logo

అతివల ఆదరణ దక్కేదెవరికో!

సార్వత్రిక సమరంలో పోలింగ్‌ సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు గెలుపు వ్యూహాలు ముమ్మరం చేశారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.

Published : 08 May 2024 04:51 IST

స్వశక్తి సంఘాల మద్దతుకు అభ్యర్థుల వ్యూహాలు
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

సార్వత్రిక సమరంలో పోలింగ్‌ సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు గెలుపు వ్యూహాలు ముమ్మరం చేశారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో కీలకంగా మారిన అతివల ఓట్లను తమ ఖాతాలో వేసుకునే పనిలో నిమగ్నయ్యారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. భారీగా తాయిలాల ఆశ చూపుతూ తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు ఏదైనా ఓటింగ్‌ శాతంలో ముందుండే మహిళా ఓటర్లు ఆదరిస్తే విజయం సాధిస్తామనే ధీమాలో అభ్యర్థులు పావులు కదుపుతున్నారు.

బూత్‌ల వారీగా జాబితాలు

ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్ల ఆధిక్యం కొనసాగుతోంది. 12 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 29.78 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 14.51 లక్షల మంది పురుషులు, 15.26 లక్షల మంది మహిళలు నమోదయ్యారు. పురుషుల కంటే అతివలు దాదాపు 74 వేల మంది అధికంగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపోటములను శాసించే వీరి ఓట్లపై అభ్యర్థులు దృష్టి సారించారు. బూత్‌ల వారీగా సంఘాల జాబితాను ప్రాథమికంగా రూపొందించారు. మహిళా ఓటర్లతో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లను రాబట్టుకునేందుకు ప్రలోభాల ఎర వేస్తున్నారు.

భారీగా నజరానాలు?

ఉమ్మడి జిల్లాలో 58 మండల సమాఖ్యలుండగా వీటి పరిధిలో 1,955 గ్రామైక్య సంఘాలున్నాయి. 49,440 స్వశక్తి సంఘాల పరిధిలో 5,46,953 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరి కుటుంబాల  పరిధిలో మరో 6 లక్షలకు పైగా ఓటర్లుంటారని అంచనా. దీంతో అభ్యర్థులు ప్రతి సంఘానికి భారీగా నజరానాలు ఇవ్వనున్నారు. నగదుతో పాటు చీరలు, ఇతర సామగ్రి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మహిళల బ్యాంకు ఖాతాలోకే నగదు మళ్లించే ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ఈసీ డేగ కన్ను వేయడంతో అభ్యర్థులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మహిళల మద్దతు ఎవరికి దక్కుతుందో వారికే విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు