logo

కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం లేదు

కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం లేదని, ఆ పార్టీ దళితులకు అన్యాయం చేస్తోందని భాజపా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Published : 08 May 2024 05:02 IST

మంథని జనగర్జన సభలో భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌

మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌

ఈనాడు, పెద్దపల్లి(మంథని, న్యూస్‌టుడే): కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం లేదని, ఆ పార్టీ దళితులకు అన్యాయం చేస్తోందని భాజపా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మంథనిలో మంగళవారం నిర్వహించిన జనగర్జన సభలో ఆయన మాట్లాడుతూ భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కాంగ్రెస్‌ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రాసిన అంబేడ్కర్‌ను రెండు సార్లు ఓడించడం ద్వారా ఆ పార్టీ దళితులకు అన్యాయం చేసిందన్నారు. మంథని నియోజకవర్గంలో 80 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బదులు అగ్ర వర్ణాలకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తోందని ఆరోపించారు. కాటారంలో ప్రధాన కూడలిలో తన తండ్రి విగ్రహం పెట్టాలన్న ఆలోచనతో మంత్రి శ్రీధర్‌బాబు అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారన్నారు. పైగా విగ్రహావిష్కరణకు యత్నించిన నాయకులను అరెస్టు చేయించారని ఆరోపించారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి శ్రీధర్‌బాబు మినీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మహదేవపూర్‌, కాటారం, మహాముత్తారం, మల్హర్‌ మండలాలకు గోదావరి జలాలు అందించలేకపోయారన్నారు. కాళేశ్వరం వద్ద గోదావరిపై ఎల్‌డబ్ల్యూఏ పథకం కింద తన విజ్ఞప్తి మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం వంతెన నిర్మాణం చేపడితే దానికి శ్రీపాదరావు పేరు పెట్టాలని మంత్రి శ్రీధర్‌బాబు తనపై ఒత్తిడి తెచ్చారని గోమాసె ఆరోపించారు. 2009లో తాను తెరాస తరఫున పోటీ చేసి 47 వేల ఓట్లతో ఓడిపోతే, తనకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇప్పిస్తానని శ్రీధర్‌బాబు పార్టీలో చేర్చుకొని 2014, 2019లలో ధనవంతులకు టికెట్‌ ఇప్పించి అన్యాయం చేశారన్నారు. తనను గెలిపిస్తే కేంద్ర నిధులతో మంథనిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రదీప్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, పార్లమెంట్‌ ప్రభారి నరేందర్‌రెడ్డి, సహాయ ప్రభారి రమేశ్‌, కో ఆర్డినేటర్‌ సుహాసినిరెడ్డి, వెంకటేశ్వర్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి, నాయకులు సత్యప్రకాష్‌, మోహన్‌రావు, రమేష్‌, శ్రీనివాస్‌, క్రాంతికుమార్‌, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

భాజపా జనగర్జన సభకు హాజరైన జనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు