logo

వాననీటికి చితికిన సిలికాన్‌సిటీ

హైటెక్‌ సిటీ.. వాననీటిలో కొట్టుమిట్టాడుతోంది. ముంపు ప్రదేశాల సంఖ్య పెరుగుతోంది. తాగునీరు, ఆహారం కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించుకున్న ఇళ్లు మడుగులను తలపిస్తున్నాయి. వాటిలో నివాసం ఉండలేక జనం గగ్గోలు పెడుతున్నారు.

Published : 20 May 2022 02:13 IST

చిక్కుముళ్లు : సర్జాపుర రహదారిలో బుధవారం రాత్రి వాన దెబ్బకు స్తంభించిన రాకపోకలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : హైటెక్‌ సిటీ.. వాననీటిలో కొట్టుమిట్టాడుతోంది. ముంపు ప్రదేశాల సంఖ్య పెరుగుతోంది. తాగునీరు, ఆహారం కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించుకున్న ఇళ్లు మడుగులను తలపిస్తున్నాయి. వాటిలో నివాసం ఉండలేక జనం గగ్గోలు పెడుతున్నారు. వాన- మురుగునీటి పారుదల వ్యవస్థ గాడితప్పడమే సమస్యకు మూలం. కె.ఆర్‌.పురం నియోజకవర్గం పరిధిలోని హొరమావు సాయి లేఔట్‌ ప్రజలు రెండు రోజులుగా రాత్రిపూట జాగారమే చేస్తున్నారు. లోతట్టు ప్రదేశంలో ఉండడంతో ప్రవాహమంతా వచ్ఛి. ఇక్కడే స్తంభించి పోతోంది. ఇటు నుంచి దిగువకు నీరు పారే వ్యవస్థ మూసుకుపోయి ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. రెండు రోజుల నుంచి నీటిలో ఉన్న ప్రాంతాలను ఒడ్డున పడేసేందుకు బెంగళూరు పాలికె, అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రానేలేదు. జెట్‌ యంత్రాల ద్వారా తోడివేత పనులు కొనసాగుతున్నాయి. కొద్దిసేపు పని చేసే యంత్రాలు ఆపై కొద్ది సేపటికే మొరాయించాయి. సమస్య మొదటికి వచ్చింది. ఇక లాభం లేదని.. పెద్ద యంత్రాలను రంగంలోకి దింపారు. అర్ధకిలోమీటరు వరకు రాజకాలువకు చేరుకునేలా గొట్టాలు బిగించి యంత్రాల ద్వారా తోడివేత మొదలైంది. నీరు బయటకు తొలగించాక.. ఇళ్లలో మేటవేసిన బురద దడ పుట్టిస్తోంది. బుధవారం రాత్రి నుంచి మరోసారి గురువారం ఉదయం వర్షం వాన కురుస్తూనే ఉంది. మరోసారి లోతట్టు ప్రదేశాలను చిక్కలు చుట్టుముట్టాయి. బెళ్లందూరు, సర్జాపుర, సిల్క్‌బోర్డు, కోరమంగల, శాంతినగర కూడళ్లులో ప్రమాదకర వాతావరణం కనిపిస్తోంది. వర్తూరు చెరువు రహదారి మూసుకుపోయింది. లగ్గెరె, ఆర్‌.ఆర్‌.నగర, హొసకెరె, కమలానగర, బొమ్మనహళ్లి, విజయనగర, మారుతినగర, నాగవార ప్రాంతాల్లో బెంగళూరు పాలికె అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నేలకొరిగిన విద్యుత్తు స్తంభాలను బెస్కాం సిబ్బంది పునరుద్ధరిస్తున్నారు. ఇళ్లు, రహదారులపై వాలి పడిపోయిన చెట్ల కొమ్మలను తొలగించి వాహన సంచారానికి అవకాశం కల్పించారు.

అసలు సమస్య: ప్రస్తుతం ముంపునకు గురైన వాడలన్నీ ఒకప్పుడు చెరువులు, వాగుల ప్రాంతాలే. చెరువు భూముల్లో సాయిలేఔట్‌ వెలిసిందనేది జగమెరిగిన సత్యం. కొందరు రాజకీయ నాయకులు, అధికారులు భూకబ్జాదారులతో చేతులు కలిపిన ఫలితమే ప్రస్తుతం సమస్య ఎదుర్కోవడానికి కరాణం. ఐడియల్‌ లేఔట్‌ మధ్యలో ప్రవాహించే రాజకాలువ ఆ ప్రదేశానికి శాపంగా మారింది. కాలువను తవ్వేసి పునాదులు కట్టుకున్న వారి ఇళ్లు వణుకుతున్నాయి. వర్షమొస్తే ఐడియల్‌ లేఔట్‌ ముంపునకు గురవుతోంది.

కటకటా : నేటికి వాననీటి ముంపులో హొరమావు సాయి లేఔట్‌

కోరమంగల : స్తంభించిన వాననీటిలో బరువుగా కదులుతున్న వాహనాలు

మారతీనగర్‌: ఆ వీధి దాటాలంటే ఇదిగో ఇదే మార్గం మరి

బొమ్మనహళ్లి: అడ్డదిడ్డంగా పడిపోయిన చెట్లు, స్తంభాల తొలగింపు

సాయిలేఔట్‌ : నీటి మడుగును కరిగించడానికి యంత్రాల సాయం

దావణగెరెలో తీవ్ర నష్టం

భారీ వర్షాలవల్ల నేలకొరిగిన వరి పొలాన్ని వీక్షిస్తున్న దావణగెరె డీసీ మహంతేశ్‌ బీళగి

దావణగెరె, న్యూస్‌టుడే : భారీ వర్షాల వల్ల దావణగెరె జిల్లాలో సంభవించిన నష్టాన్ని జిల్లా పాలనాధికారి మహంతేశ్‌ బీళగి, ఇతర రెవెన్యూ అధికారులు గురువారం పరిశీలించారు. కంబత్తనహళ్లి, భాస్కరరావు క్యాంపు, కుక్కనూరు గ్రామాలను సందర్శించిన ఆయన వరి పొలాలు, వక్క తోటల నష్టాన్ని చూశారు. హరిహర తాలూకా నందగుడి గ్రామంలో కొత్తగా రోడ్డు పనుల్ని చేపట్టారని, ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పనులు భారీ వర్షాలకు కొట్టుకుపోయాయని అధికారులు వివరించారు. జిల్లాలో వర్షం కల్గించిన నష్టాన్ని అంచనావేసి నివేదికను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

పది రోజులకే.. పదేళ్లు నిండాయి

ఈ రోడ్డు వేసి పది రోజులైనా కాలేదు.. అప్పుడే ఇలా

బెంగళూరు (మల్లేశ్వరం): రహదారులను ఒకసారి వేస్తే కనీసం పదేళ్లపాటు మన్నిక రావాలి. రాజాజీనగరలో పది రోజుల కిందటే కొత్తగా వేసిన రోడ్డుపై తారు పది రోజులకే వర్షం నీటికి కొట్టుకుపోయింది. గుత్తేదారుల నుంచి ప్రజాప్రతినిధులు కమీషన్లు డిమాండ్‌ చేస్తుండడంతోనే నాశిరకం పనులు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరమ్మతులు పూర్తయిన చోట తారు, సిమెంటు కొట్టుకు పోయి మళ్లీ గుంతలు తేలడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని