logo

ప్రజలందరికీ జలభాగ్యం

ప్రతి ఇంటికీ తాగునీటిని అందించేందుకు జల్‌జీవన్‌ మిషన్‌ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు.

Published : 22 Mar 2023 02:49 IST

బసవేశ్వరుని విగ్రహం వద్ద అధికారులు, నాయకులతో బొమ్మై

విజయపుర, న్యూస్‌టుడే : ప్రతి ఇంటికీ తాగునీటిని అందించేందుకు జల్‌జీవన్‌ మిషన్‌ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు. విజయపుర జిల్లాలో 4.64 లక్షల ఇళ్లకు తాగునీటిని అందించే లక్ష్యాన్ని పెట్టుకున్నామని, ఇప్పటికే 2.87 లక్షల ఇళ్లకు నేరుగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. విజయపుర జిల్లా ముద్దేబిహాళలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొత్తగా నిర్మించిన విగ్రహాలను ఆవిష్కరించారు. ఆయా పథకాల లబ్ధిదారులకు హక్కు పత్రాలు, చెక్కులు మంగళవారం పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లాలో రూ.4 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందన్నారు. కర్ణాటకలో ఇప్పుడు అభివృద్ధి పర్వం కొనసాగుతోందన్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు, పేదలు, యువత సమస్యలను పరిష్కరించేందుకు వివిధ పథకాలను జారీ చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు ఎ.ఎస్‌.పాటిల్‌ నడహళ్లి, సోమనగౌడ పాటిల్‌, రమేశ్‌ బూసనూర తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

‘న్యాయ’ సలహాలు తీసుకుంటాం..

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పనిచేసిన సమయంలో అక్రమాలపై న్యాయ తనిఖీకి ఆదేశించేందుకు ముందు న్యాయ కోవిదుల సలహా తీసుకుంటామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. నాటి సిద్ధు ప్రభుత్వ అక్రమాలపై మాట్లాడడం ‘బొగ్గు ఇతరుల మసి విషయం మాట్లాడినట్లు’ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 59 ప్రధాన అక్రమాలపై లోకాయుక్త తనిఖీని కోరుతూ ఇప్పటికే తమ పార్టీ నాయకుడు ఎన్‌ఆర్‌ రమేశ్‌ ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. హుబ్బళ్లిలో బొమ్మై మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బ్రిటన్‌లో రాహుల్‌ గాంధీ భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అలవాటేనని విమర్శించారు. ‘గ్యారెంటీ కార్డు’ పేరిట కాంగ్రెస్‌ నాయకులు విజిటింగ్‌ కార్డులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఈ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ‘ఉరిగౌడ, నంజేగౌడ’ అంశం ముగిసిపోయిన అధ్యాయమని అన్నారు. సత్యం చెబితే కొందరు తట్టుకోలేకపోతున్నారని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి బాబూరావు చించనసూరు పార్టీ వీడడం- భాజపాపై ఎటువంటి ప్రభావం ఉండదని అన్నారు. కేంద్ర హోం మంత్రి ఈ నెల 26న, ప్రధాని 25న కర్ణాటకకు వస్తున్నట్లు తెలిపారు. తమ ప్రధాన డిమాండ్లు నెరవేరడంతో రవాణా శాఖ ఉద్యోగులు తమ ఆందోళనను విరమించారని ఇదే సందర్భంలో ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని