logo

భర్తపై ద్వేషం.. చిన్నారికి మరణశాసనం

గోవాలో తన నాలుగేళ్ల కుమారుడిని చంపి, సూటుకేసులో మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కిన మైండ్‌ఫుల్‌ ఏఐ సంస్థ సీఈవో సుచనాసేఠ్‌ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త వెంకటరత్నం తన కుమారుడితో గడిపేందుకు కోర్టు అనుమతించడమే హత్యకు దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు.

Updated : 11 Jan 2024 18:51 IST

ఎక్కువ మోతాదులో దగ్గుమందు తాగించి హత్య
సీఈవో సుచనాసేఠ్‌ కేసులో వెలుగులోకి కీలకాంశం

సుచనా.. నవ్వుల వెనుక నిగూఢ ద్వేషం

బెంగళూరు (గ్రామీణం), చిత్రదుర్గం, న్యూస్‌టుడే : గోవాలో తన నాలుగేళ్ల కుమారుడిని చంపి, సూటుకేసులో మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కిన మైండ్‌ఫుల్‌ ఏఐ సంస్థ సీఈవో సుచనాసేఠ్‌ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త వెంకటరత్నం తన కుమారుడితో గడిపేందుకు కోర్టు అనుమతించడమే హత్యకు దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు. 2022లో దంపతుల విడాకుల ప్రక్రియ ప్రారంభమైంది. కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే దానిపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో భర్త ప్రతి ఆదివారం తన తనయుడితో ఉండేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఈ ఉత్తర్వులు సుచనాను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అందుకే బాలుడిని చంపేందుకు నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు. సుచనాను మరింత విచారించేందుకు ఆమెను గోవా కోర్టు 6 రోజులు పోలీసు కస్టడీకి అప్పగించింది.

పక్కా ప్రణాళికతోనే హత్య..

చిన్నారికి ఎక్కువ పరిమాణంలో దగ్గుమందు ఇచ్చి తలదిండు లేదా టవల్‌తో బాలుడి గొంతునులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హోటల్‌ రూంలో తనిఖీలు నిర్వహించగా ఒక పెద్ద, చిన్న దగ్గు మందు సీసాలు కనిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. తనకు దగ్గు వస్తోందని, ఒక సిరప్‌ సీసా కొని తేవాలని హోటల్‌ సిబ్బందిని సుచనాసేఠ్‌ కోరినట్లు చెప్పారు. అయితే తాను ఈ హత్య చేయలేదని, నిద్రనుంచి లేచేసరికే కుమారుడు చనిపోయి ఉన్నాడని ఆమె చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం పరీక్ష అనంతరం బాలుడి మృతదేహాన్ని అతడి తండ్రికి అప్పగించారు. కాగా సుచనాసేఠ్‌ నిర్వహిస్తున్న కంపెనీకి ఎటువంటి సొంత చిరునామా లేదు. కో-వర్కింగ్‌ స్పేస్‌నే తన కార్యాలయం చిరునామాగా మార్చుకుంది. బెంగళూరు థణిసంద్రలోని అపార్ట్‌మెంట్లోని ప్లాట్ను నాలుగునెలల కిందటే ఆమె ఖాళీ చేసిందని పోలీసులు గుర్తించారు.

  • బాలుడి తండ్రి వెంకటరామన్‌ ఇండోనేషియా నుంచి బుధవారం ఉదయం హిరియూరుకు చేరుకున్నారు. ఆయన అనుమతితో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య బృందం బాలుడికి శవపరీక్ష చేశారు. వైద్యుడు కుమారనాయక్‌ మాట్లాడుతూ బాలుడికి గుండె భాగంలో వాపు వచ్చిందని, ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారని వెల్లడించారు. బాలుడిని ఆదివారం రోజే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కుమారుడి మృతదేహాన్ని చూసి ఆ తండ్రి తట్టుకోలేకపోయారు. శవపరీక్ష తర్వాత మృతదేహాన్ని తండ్రి వెంకటరామన్‌కు అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలోనే బెంగళూరులోని ఓ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని