logo

కోలారు బాటలో కల్లోలం

రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అనూహ్యంగా ఎదురైన ఆ ఘట్టం అధికార కాంగ్రెస్‌ పార్టీని కుదిపేసింది. ఇలాంటి వ్యవహారమే మునుపు.. 2019 జులై 5వ తేదీన తలెత్తింది.

Published : 28 Mar 2024 03:17 IST

ఎమ్మెల్యేల రాజీనామా హెచ్చరిక
మునియప్పకు అసమ్మతి పోటు

ఈనాడు, బెంగళూరు : రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అనూహ్యంగా ఎదురైన ఆ ఘట్టం అధికార కాంగ్రెస్‌ పార్టీని కుదిపేసింది. ఇలాంటి వ్యవహారమే మునుపు.. 2019 జులై 5వ తేదీన తలెత్తింది. నాడు.. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న విధానసౌధ ప్రాంగణం ఒక్కసారిగా కలకలంగా మారింది. అప్పటికే 13 నెలల పాటు కొనసాగిన కాంగ్రెస్‌- జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం పతనం ఆరోజే మొదలైంది. ఇరు పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా పత్రాలతో విధానసౌధ ప్రాంగణంలో పరుగులు పెట్టే సన్నివేశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. సరిగ్గా అలాంటి సంఘటనను పోలిన సన్నివేశం బుధవారం విధానసౌధ ప్రాంగణంలో కనిపించింది. కారణాలేవైనా.. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూకుమ్ముడిగా రాజీనామా చేస్తామని ప్రకటించి కాంగ్రెస్‌ సర్కారుకు కాసేపు చెమటలు పట్టించారు. ఈ సంఘటన నేపథ్యం కోలారు రాజకీయాలు కావటం గమనార్హం. కాంగ్రెస్‌ ఇంకా ప్రకటించాల్సిన కోలారులో పోటీ చేసే అభ్యర్థిపై సమాచారాన్ని అందుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకతను చాటుతూ రాజీనామా అస్త్రాన్ని సంధించారు.

సౌధలో హైడ్రామా..

ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఎం.సి.సుధాకర్‌, కోలారు ఎమ్మెల్యే కిత్తూరు మంజునాథ్‌, మాలూరు ఎమ్మెల్యే కె.వై.నంజేగౌడలతో పాటు ఎమ్మెల్సీ నజీర్‌ అహ్మద్‌, అనిల్‌ కుమార్‌ పార్టీకి రాజీనామా చేస్తామంటూ పాటు విధానసౌధకు వచ్చారు. వీరంతా కాంగ్రెస్‌ పార్టీ వారే కావటంతో అధిష్ఠానంతో పాటు రాష్ట్ర నాయకత్వం కాసేపు నివ్వెరపోయింది. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలు అందించేందుకు మంగళూరులో ఉన్న స్పీకర్‌ యు.టి.ఖాదర్‌ను కలిసేందుకు విమాన టికెట్‌ తీసుకోవటం గమనార్హం. ఇద్దరు ఎమ్మెల్సీలు తాము పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆ పత్రాలతో విధానపరిషత్తు స్పీకర్‌ బసవరాజ హొరట్టి కార్యాలయానికి కూడా చేరుకున్నారు. అంతలోనే వారికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ నుంచి స్పష్టమైన సందేశాలు రావటంతో కాస్త వెనక్కు తగ్గారు.


నేతల ఆక్రోశం

రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించిన వారంతా కోలారు, చిక్కబళ్లాపురకు చెందిన వారు కావటంతో ఆ జిల్లా రాజకీయాలపై అందరి దృష్టి మళ్లింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించాల్సిన నాలుగు లోక్‌సభ స్థానాల అభ్యర్థుల్లో ఒకటి కోలారు. అక్కడ పోటీ చేసే అభ్యర్థి- పౌరసరఫరాల శాఖ మంత్రి మునియప్ప అల్లుడు చిక్కపెద్దణ్ణ అనే సమాచారం వీరందరికీ తెలిసిపోయింది. ఈ నిర్ణయమే వీరిని ఆవేశభరితంగా మార్చింది. డాక్టర్‌ ఎం.సి.సుధాకర్‌, కిత్తూరు మంజునాథ్‌, నంజేగౌడతో పాటు బంగారుపేటె ఎమ్మెల్యే నారాయణస్వామి కూడా చిక్కపెద్దణ్ణ అభ్యర్థిత్వాన్ని ఆక్షేపించారు. ఇప్పటికే మునియప్ప మంత్రిగా ఉండగా, ఆయన కుమార్తె రూపకళ ఎమ్మెల్యేగా, కార్పొరేషన్‌ పదవిని కూడా పొందారు. కోలారులో లోక్‌సభకు పోటీ చేసే అర్హత ఉన్న నేతలు ఎందరో ఉండగా మునియప్ప కుటుంబ సభ్యులకే ఇవ్వటం ఎందుకంటూ వీరంతా ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. వీరిలో సుధాకర్‌ స్పందిస్తూ.. తాము దశాబ్దాలుగా మునియప్ప రాజకీయాలను చూసి విసిగిపోయామని ఆక్రోశించారు. మా నాన్నతో పాటు నేను కూడా ఆయన కుట్ర రాజకీయాలకు బలైనవాడినంటూ మునియప్పపై నిప్పులు చెరిగారు. కిత్తూరు మంజునాథ్‌, నంజేగౌడ కూడా ఇంత వరకు ఓపిక పట్టామని, ఇకపై ఆయన రాజకీయాలు సాగనిచ్చేది లేదంటూ మండిపడగా, ఎమ్మెల్సీ నజీర్‌ అహ్మద్‌ సైతం మునియప్ప రాజకీయాలు పార్టీకి చేటు తెస్తాయంటూ విమర్శించారు.

నేపథ్యం ఇదీ..

కోలారు రాజకీయాల్లో దశాబ్దాలుగా దళిత వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అక్కడ ఎస్‌సీ కుడి, ఎడమ (బలగై, ఎడగై) వర్గాల మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. మంత్రి మునియప్ప ఎస్‌సీ ఎడగై సముదాయానికి చెందిన నేత. ఆయనే ఆ జిల్లాలోని అన్ని రాజకీయ పదవులు పొందారని బలగై సముదాయ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. పేరుకు కోలారు లోక్‌సభ స్థానం ఎస్‌సీదే అయినా ఎప్పుడూ మునియప్పనే అవకాశాలు పొందారన్న అసంతృప్తి బలగై నేతల్లో రాజుకుంటోంది. ఈ బృందానికి మాజీ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ అండదండలు ఉన్నాయనేది మునియప్ప వర్గం అనుమానం. ఏడు సార్లు ఎంపీగా, పదేళ్ల పాటు కేంద్ర మంత్రిగా ఉన్న మునియప్ప ఇప్పటికీ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఇకనైనా బలగై సముదాయానికి చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని రమేశ్‌కుమార్‌ బృందం ప్రయత్నిస్తోంది. చివరకు ఈసారి టికెట్‌ కూడా మునియప్ప అల్లుడికి దక్కినట్లు వీరంతా ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. ఏ సముదాయానికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని, మునియప్ప కుటుంబానికే టికెట్‌ ఇవ్వటాన్ని మేము సహించబోమని ఈ అసమ్మతీయులు తెగేసి చెప్పటంతో పార్టీ డోలాయమానంలో పడింది.

  • తాను పెంచి పోషించిన నాయకులే నేడు నాపై తిరగబడటం ఆశ్చర్యంగా ఉందని మంత్రి మునియప్ప వాపోయారు. ఎవరు గెలుస్తారో అధిష్ఠానం సమీక్ష చేసిన తర్వాతనే టికెట్‌ ఇస్తుంది. ఈ వ్యవహారంపై నేనేమీ మాట్లాడనని ఆయన స్పందించారు.
  • మైసూరు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎమ్మెల్యేల రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆదేశిస్తూ కోలారు జిల్లా మంత్రి భైరతి సురేశ్‌తో మంతనాలకు ఆదేశించారు. టికెట్‌ ఇంకా ప్రకటించక ముందే ఇలాంటి నిర్ణయాలు తగదన్న ముఖ్యమంత్రి- బుధవారం రాత్రి ఈ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చర్చించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని