logo

మరింత పడిపోయిన విద్యుదుత్పాదన

రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.

Published : 29 Mar 2024 03:08 IST

రాయచూరు ఉష్ణ విద్యుత్తు కేంద్రం టవర్లు

రాయచూరు, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. రాయచూరు కేంద్రంలో ఒకటి, రెండు, మూడు, ఆరు యూనిట్లు పూర్తిగా స్తంభించాయి. నాలుగు, ఐదు, ఏడు, ఎనిమిది యూనిట్ల ద్వారా కేవలం 669 మెగావాట్ల తయారీ సాధ్యపడుతోంది. ఈ కేంద్రం మొత్తం ఉత్పాదన సామర్థ్యం 1720 మెగావాట్లు. సగం యూనిట్లు పడకేయడంతో 1051 మెగావాట్ల విద్యుత్తు నష్టం వాటిల్లింది. 1700 మెగావాట్ల సామర్థ్యమున్న బళ్లారిలో 646 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నారు. మూడు యూనిట్లలో చివరి యూనిట్‌ ఆగిపోయింది. రెండు యూనిట్లలో పూర్తి స్ధాయిలో ఉత్పాదన సాధ్యపడటం లేదు. ఫలితంగా 1054 మెగావాట్లను కోల్పోయింది. యరమరాస్‌లోని ఒకటి, రెండు యూనిట్లు ద్వారా 1600 మెగావాట్ల ఉత్పాదన చేయాల్సి ఉండగా... 754 మెగావాట్లే అందుతోంది. యూనిట్లలో ఆశించినంత తయారీ జరగనందున 846 మెగావాట్ల నష్టపోయింది. ఐదు కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 7680 మెగావాట్ల ఉత్పాదన జరగాలి. సాయంత్రం వరకు 3506 మెగావాట్లను ఉత్పత్తి చేశారు. 4174 మెగావాట్లను కర్ణాటక విద్యుత్తు నిగమ కోల్పోయింది. జలాశయాల్లో నీటి మట్టం పడిపోవడం, సాంకేతిక కారణాల వల్లనే యూనిట్లు నిలిపివేయటానికి కారణంగా తెలుస్తోంది.

ఉడుపిలోని రెండు యూనిట్ల ద్వారా (సామర్థ్యం 1200 మెగావాట్లు) 927 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఉత్పాదనలో ఎంతో మెరుగుపడినట్లు నిపుణులు వివరించారు. 1460 మెగావాట్ల కెపాసిటీ ఉన్న జిందాల్‌లో మార్చి ఆరంభంలో రెండంకెల సంఖ్యలో ఉత్పాదన నమోదయ్యేది. గురువారం 510 మెగావాట్లు తయారైంది. దీన్ని మంచి పరిణామంగా భావిస్తున్నారు.  


జల విద్యుత్తు..

రాష్ట్రంలోని జలవిద్యుత్తు కేంద్రాలు మొండికేస్తున్నాయి. శరావతిలో 605, నాగజహరిలో 507, వారాహిలో 228, కొడసళ్లిలో 113, గేరుసొప్పాలో 104, కాద్రాలో 50, జోగ్‌లో 45, సూపాలో 40, శివసముద్రంలో 14, ఎల్‌పీహెచ్‌లో 13, మణిడ్యామ్‌లో ఒక మెగావాట్‌ ఉత్పత్తి చేస్తున్నారు. జల కేంద్రాల ద్వారా మొత్తం 1720 మెగావాట్లు తయారు అవుతోంది. షింషా, మునిరాబాద్‌, బాద్రా, ఘటక ప్రభ, ఆలమట్టిలో ఉత్పాదన శూన్యం. హైడ్రాలిక్‌ ప్రాజెక్టుల్లో ఉత్పాదన అవుతున్నందునే థర్మల్‌లో ఉత్పత్తి తగ్గిన ప్రభావం ప్రస్తుతానికి కన్పించడం లేదు. ఏప్రిల్‌, మే నెలల్లో జల ఉత్పాదన నిలిపివేసే అవకాశముంది. విపత్తును తప్పించేందుకు శాఖోత్పన్న కేంద్రాల్లో ఉత్పాదన పెంచుకోవాలని విద్యుత్తు నిపుణులు విద్యుత్తు నిగమ ఉన్నాధిÅకారులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని