logo

పెన్‌డ్రైవ్‌ల వెనుక సిద్ధు సర్కారు

హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (జనతాదళ్‌ బహిష్కృత)కు సంబంధించిన అశ్లీల వీడియో కేసును కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయంగా మార్చుకుందని జనతాదళ్‌ రాష్ట్రాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు.

Published : 08 May 2024 02:50 IST

కుమారస్వామి తీవ్ర ఆగ్రహం

విలేకరుల సమావేశంలో కుమారస్వామి

ఈనాడు, బెంగళూరు : హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (జనతాదళ్‌ బహిష్కృత)కు సంబంధించిన అశ్లీల వీడియో కేసును కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయంగా మార్చుకుందని జనతాదళ్‌ రాష్ట్రాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. ఆయన మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలకు ముందు హాసన, బెంగళూరు గ్రామీణ నియోజకవర్గాలతో పాటు రాష్ట్రమంతటా అశ్లీల వీడియోలు విడుదల చేయాలని కాంగ్రెస్‌ ప్రణాళిక సిద్ధం చేసుకుందని నిందించారు. ఇందులో భాగంగా 25 వేలకు పైగా పెన్‌డ్రైవ్‌లను ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సూచనతో ఆ పార్టీ కార్యకర్తలు పంపిణీ చేశారని ఆరోపించారు. వీటిని విడుదల చేసేందుకు ముందుగానే సామాజిక మాధ్యమంలో ప్రజ్వల్‌ అశ్లీల వీడియోలు చూడాలంటే ఓ వ్యాట్సప్‌ నంబర్‌ను అనుసరించాలంటూ ప్రచారం చేశారని వివరించారు. పైగా ప్రజ్వల్‌ తనను తుపాకీతో బెదిరించి లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసిన మహిళ ప్రజ్వల్‌ రేవణ్ణతో గతనెల 22న ఎన్నికల ప్రచారానికి ఎందుకు వచ్చినట్లని కుమారస్వామి ప్రశ్నించారు. వారం రోజుల్లోనే ఆ మహిళ ప్రజ్వల్‌పై ఎలా ఫిర్యాదు చేస్తుందన్నారు. ఈ పెన్‌డ్రైవ్‌ తతంగంపై హాసన జేడీఎస్‌ పోలింగ్‌ ఏజెంట్‌ పూర్ణచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్‌) అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. ఆ అధికారులు డీకే శివకుమార్‌, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మార్గదర్శకత్వంలోనే విచారణ చేస్తున్నట్లు ఆరోపించారు. వారు నిష్పక్షపాతంగా విచారణ చేయకుండా అడ్డుపడే శక్తులను వదిలేది లేదన్నారు. ఈ పెన్‌డ్రైవ్‌లు విడుదల చేసిన వ్యక్తి హాసనలో కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొంటున్నట్లు కుమారస్వామి అతని చిత్రాలను విడుదల చేశారు. మరోవైపు ఈ వీడియోలను అజ్ఞాతంగా విడుదల చేసిన కార్తిక్‌ గౌడను గుర్తించే ప్రయత్నం కూడా సిట్‌ అధికారులు చేయటం లేదన్నారు. కేవలం ప్రభుత్వ సూచనతో పని చేసే సిట్‌ను రద్దు చేసి సీబీఐ ద్వారా ఈ కేసును విచారించాలని కుమారస్వామి డిమాండ్‌ చేశారు.

రాహుల్‌కు నోటీసులేవీ?

ప్రజ్వల్‌ రేవణ్ణ 400 మంది మహిళలపై లైంగిక దౌర్జన్యం చేశారు.. వారిలో 16 ఏళ్ల బాలికలూ ఉన్నారని ఇటీవల కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. అంటే ఆయనకు ఈ వీడియోల గురించి సమాచారం ఉండే ఉంటుందని.. ఆయనను విచారించేందుకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదంటూ కుమారస్వామి ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న భాజపా నేత దేవరాజేగౌడతో శివకుమార్‌ చర్చించాల్సిన అవసరం ఏముందన్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు బయటపడాలంటే డీకేను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించి విచారించాలని డిమాండ్‌ చేశారు. ప్రజ్వల్‌ ఉదంతంతో పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిందని భావిస్తే భాజపా ఏ నిర్ణయం తీసుకున్నా మేము సిద్ధమని ఓ ప్రశ్నకు కుమారస్వామి బదులిచ్చారు.

ఇంటర్‌పోల్‌ నోటీసులు..

దేశం విడిచి పారిపోయిన ప్రజ్వల్‌ రేవణ్ణ విచారణకు హాజరు కావాలంటూ ఇంటర్‌పోల్‌ పోలీసులు బ్లూకార్నర్‌ నోటీసులు జారీ చేశారు. సిట్‌ మనవికి ఇంటర్‌పోల్‌ బృందం స్పందించి 196 దేశాలకు ఈ సమాచారాన్ని అందించినట్లు బదులిచ్చింది. మరోవైపు కిడ్నాప్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హెచ్‌.డి.రేవణ్ణ దరఖాస్తు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల న్యాయస్థానం వాయిదా వేసింది. ఆయన బుధవారం వరకు సిట్‌ కస్టడీలో ఉండాలని గతంలో న్యాయమూర్తి ఆదేశించిన విషయం తెలిసిందే.


రేవణ్ణకు అస్వస్థత..

అధికారుల విచారణను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హెచ్‌డి.రేవణ్ణ మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. రోజంతా విచారణకు హాజరవుతున్న ఆయన సమయానికి నిద్ర పోకుండా, ఆహారాన్ని తీసుకోకపోవటంతో గ్యాస్ట్రిక్‌తో పాటు హెర్నియా సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని సిట్‌ అధికారులు నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు