logo

భద్రాద్రి రామయ్యా.. ఆన్‌లైన్‌లో నీసేవలేవయ్యా?

దేవాదాయ శాఖ అలసత్వంతో రాములవారు ఆన్‌లైన్‌లోకి రాలేకపోతున్నారు. అంతర్జాలం అనేది అందని ద్రాక్షగా మారింది. ఆఫ్‌లైన్‌ సేవలకే ఈ కోవెల పరిమితమన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు

Published : 04 May 2023 06:10 IST

దేవాదాయ శాఖ అలసత్వంతో రాములవారు ఆన్‌లైన్‌లోకి రాలేకపోతున్నారు. అంతర్జాలం అనేది అందని ద్రాక్షగా మారింది. ఆఫ్‌లైన్‌ సేవలకే ఈ కోవెల పరిమితమన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. సాంకేతికంగా ప్రధాన కోవెళ్లు ముందుకు దూసుకుపోతుంటే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఆశించిన మేర ప్రగతి సాధించడం లేదు. సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి భద్రగిరిలో నిర్వహించే పూజా క్రతువుల సమాచారం తెలిపే మార్గాలు కరవయ్యాయి. సమస్త సమాచారం అందుబాటులో ఉండాలంటే శాశ్వత ప్రాతిపదికన ఆన్‌లైన్‌ సేవలు ప్రవేశపెట్టాలి. ఈదిశగా అధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

ఉత్సవాలకే అంతర్జాల సేవలు పరిమితం

శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు సెక్టార్‌ టిక్కెట్ల విక్రయం నిమిత్తం ‌్ర్ర్ర.్జ్త్చ్ట౯్చ‘్త్చః్చ్ఝ్న-ఃi-’.‘్న్ఝ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఆ తరుణానికి పరిమితం. దీనికి విశేష ఆదరణ ఉంటున్నప్పటికీ సాధారణ రోజుల్లో పనిచేయదు. కొవిడ్‌ తరుణంలో పరోక్ష సేవలను ప్రోత్సహించగా దీనికీ స్పందన లభించింది. ఈనేపథ్యంలో పూర్తిస్థాయి అంతర్జాల వ్యవస్థ అవసరమని గుర్తించినప్పటికీ ఏళ్ల తరబడి కొలిక్కి రావటం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలకు ఆన్‌లైన్‌ వ్యవస్థ అందుబాటులో ఉండటంతో వాటి వార్షిక బడ్జెట్‌ రూ.కోట్లలో పెరుగుతోంది. ఇక్కడ పెరుగుదల నామమాత్రంగా ఉంటోంది.

సాంకేతిక వనరులను వినియోగిస్తే..

పెద్ద ఆలయాల్లో ఎలాంటి రుసుములు చెల్లించినా కంప్యూటర్‌ టిక్కెట్‌ ఇస్తారు. ఇక్కడ కంప్యూటరీకరణ చేస్తామని చెప్పినప్పటికీ ఇంకా పుస్తకాలనే ఉపయోగిస్తూ రసీదులు ఇస్తున్నారు. ఇకనైనా దేవుడికి భక్తులకు మధ్య వారధిగా సాంకేతిక వనరులను వినియోగించాలని పలువురు కోరుతున్నారు.

కౌంటర్లను అనుసంధానిస్తే..

ప్రసాదాల విక్రయం, పూజ-దర్శన టిక్కెట్‌ జారీ, కల్యాణ కట్ట, ప్రచార శాఖ, వసతి విభాగాలను అంతర్జాలంలో ఉంచాలి. ఈప్రక్రియ అమల్లోకి వస్తే భక్తులు ఎక్కడి నుంచైనా తమకు అనుకూలమైన రోజు దర్శనానికి రావొచ్చు. పక్కా ప్రణాళిక ప్రకారం ఎక్కడ బస చేయాలో స్పష్టత ఉంటుంది. తీరా వచ్చాక వసతి లభించలేదనే ఇబ్బందీ ఉండదు. ఆదివారం నిర్వహించే అభిషేకానికి తక్కువ మందికే అవకాశం లభిస్తుంది. ఈ టిక్కెట్ల కోసం ఒక్కోసారి పైరవీలు తప్పవు. ఇలాంటి చిక్కులు కలగకుండా ముందుగా బుక్‌ చేసిన వారికి ఆన్‌లైన్‌ ద్వారా అవకాశం కల్పించవచ్చు. ప్రతిరోజూ ఉదయం సుప్రభాతం, రాత్రి పవళింపు సేవలో పాల్గొనేందుకు అంతర్జాలంలో టిక్కెట్లను జారీ చేయడం వల్ల భక్తులకు ఆనందం కలుగుతుంది. రామయ్యకు ఆదాయం సమకూరుతుంది.      

నగదు రహిత లావాదేవీలేవీ..?

పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. రామాలయంలో ఐదేళ్ల క్రితం స్వైపింగ్‌ యంత్రాలను ప్రారంభించారు. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను స్వైప్‌ చేసి భక్తులు సేవలను పొందేవారు. ఇలా చేయడం వల్ల రద్దీ తరుణంలో ఆలస్యమవుతోందని, ఆలయ ఖాతాలోకి నగదు వస్తుందో లేదో వెంటనే తెలిసేది కాదని, బ్యాంకు ఛార్జీలు పడటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్వైపింగ్‌ యంత్రాలను నాలుగేళ్ల కిందటే ఆపేశారు. చేతిలో పైసలు లేకుండా ఇంతదూరం వచ్చిన భక్తులు ఏటీఎంలకు వెళ్తే అవి మొరాయిస్తున్నాయి. రామాలయంలో ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటివి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని