logo

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం

Published : 24 May 2022 03:28 IST

వికాస్‌ను అభినందిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌బాషా

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పందన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదన్నారు. కలెక్టర్‌తో పాటు జేసీ మహేష్‌కుమార్‌, ఇతర అధికారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సామూహిక సమస్యలకు సంబంధించి పమిడిముక్కల మండలం తాడంకి పంచాయతీ చెరువు ఆక్రమణ తొలగించేలా చర్యలు తీసుకోవాలని మేరుగ వెంకటేశ్వరరావు,  బందరు మండలం చినయాదర దళితవాడలో తుమ్మాచెరువు అభివృద్ధి పరిచి తాగునీటి సమస్య పరిష్కరించాలని సర్పంచి గళ్లా తిమోతి, మచిలీపట్నంలో కరెంటు బిల్లులు ఒక్కచోటే కట్టించుకుంటున్న కారణంగా నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని, భాస్కరపురం కరెంటు కార్యాలయంలో మరో కేంద్రం ఏర్పాటు చేయాలని పీఎస్‌ఎస్‌ఆర్‌ శర్మ వినతులు అందచేశారు.

పేద విద్యార్థికి ప్రైవేట్‌ పాఠశాలలో ఉచిత సీటు
గన్నవరం మండలం సవారిగూడెంకు చెందిన లంకా వికాస్‌ ఉన్నత విద్యాభ్యాసానికి కలెక్టర్‌ చేయూత అందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వికాస్‌ ఏక సంధాగ్రాహి అని, బాలమేధావిగా గుర్తింపు దక్కించుకున్నాడని వికాస్‌ తండ్రి గంగాధరరావు స్పందనలో కలెక్టర్‌కు తెలియజేశారు. అతనికి వచ్చిన ప్రశంసాపత్రాలు, పత్రికా క్లిప్పింగ్‌లు పరిశీలించిన కలెక్టర్‌ వికాస్‌ ప్రతిభాపాటవాలను గుర్తించి కొద్దిసేపు ముచ్చటించారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వికాస్‌కు స్కూల్‌ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని, గన్నవరం సెయింట్‌జాన్స్‌ పాఠశాలలో 2వ తరగతిలో అడ్మిషన్‌ ఇప్పించాలని వికాస్‌ తండ్రి వేడుకున్నారు. స్పందించిన కలెక్టర్‌ విజయవాడ ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్‌ స్కూల్‌లో ఉచితంగా సీటు ఇప్పించాలని డీఈవో తాహెరా సుల్తానాను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని