logo

భక్తుల చెంతకు అహోబిలేశుడు

సంక్రాంతి వస్తే ఆళ్లగడ్డ వాసులకు మరో పండగ వచ్చినట్లే. అదే అహోబిలేశుని పార్వేట ఉత్సవం.

Published : 15 Jan 2023 05:43 IST

16 నుంచి పార్వేట ఉత్సవం ప్రారంభం

పల్లకిని ఊరేగింపుగా తీసుకొస్తున్న భక్తులు

ఆళ్ల్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: సంక్రాంతి వస్తే ఆళ్లగడ్డ వాసులకు మరో పండగ వచ్చినట్లే. అదే అహోబిలేశుని పార్వేట ఉత్సవం. ఒకటి కాదు, రెండు కాదు... 40 రోజులపాటు స్వామివారు నేరుగా జనుల చెంత తిరుగుతూ సాగే ఉత్సవం కనులవిందుగా ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో జరిగే తన వివాహానికి ఆహ్వానించేందుకు స్వయంగా నృసింహ స్వామి భక్తుల చెంతకు వెళ్లే ఈ మహత్తర కార్యానికి అహోబిలం వేదికగా నిలుస్తోంది. ఈనెల 16వ తేదీ నుంచి పార్వేట ఉత్సవం ప్రారంభం కానుంది.

ఖడ్గం ధరించి..

పరి అంటే గుర్రం.. వేట అంటే ప్రజలను రక్షించడం కోసం రాజులు గుర్రం మీద చేసే స్వారీ. దీనినే పార్వేట అంటారు. అహోబిలంలో దేవుడే చేతిలో ఖడ్గం ధరించి పార్వేటకు బయలుదేరడం ప్రత్యేకం. వైష్ణవ ఆలయాల్లో ప్రధానంగా రెండు సార్లు పార్వేట జరుగుతుంది. ఒకటి విజయదశమి రోజు.. మరొకటి సంక్రాంతి మరుసటి రోజైన కనుమనాడు. అన్ని దేవాలయాల్లో ఒక రోజు మాత్రమే జరుగుతుండగా ఇక్కడ 40 రోజులు జరుగుతుంది.

40 రోజులపాటు ఊరేగింపు

పార్వేట ఉత్సవం 40 రోజులపాటు కొనసాగుతుంది. ఆళ్లగడ్డతోపాటు ఉయ్యాలవాడ, రుద్రవరం మండలాల్లోని 32 గ్రామాల్లో పల్లకి ఊరేగింపుగా చేరుకుంటుంది. ఈనెల 16 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 24న తిరిగి అహోబిలానికి చేరుకుంటుంది. ప్రహ్లాద వరద స్వామి, జ్వాల నృసింహ స్వామి కొలువుదీరిన పార్వేట పల్లకి ఆయా గ్రామాలకు  చేరుకోగానే ఊరంతా కలిసి ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేస్తారు.

అలంకరణలో ఉత్సవమూర్తులు

600 ఏళ్ల ఘన చరిత్ర

నృసింహ స్వామి పార్వేట ఉత్సవానికి సుమారు 600 ఏళ్ల చరిత్ర ఉంది. మొదటి పీఠాధిపతి ఆదివన్‌ శఠగోప యతీంద్ర మహాదేశికన్‌.. నృసింహ స్వామి నుంచి స్వయంగా సన్యాసం స్వీకరించిన సమయంలో స్వామివారే సాక్షాత్తు తనను ఊరూరా తిప్పి ప్రజలకు మోక్ష ఉపదేశం చేయమని ఆదేశిస్తారు. దీంతో అప్పట్లో పీఠాధిపతి స్వామి విగ్రహంతో ఊరూరా తిరిగారు. కాలక్రమంలో అది కాస్త సంక్రాంతి పండగ మరుసటి రోజైన కనుమ నాటి నుంచి స్వామి పార్వేటగా కొనసాగుతోంది.


అహోబిలంలోనే ప్రత్యేకం

- కిడాంబి వేణుగోపాలన్‌, ప్రధానార్చకుడు

ఏ దివ్య క్షేత్రంలో లేని విధంగా స్వామి పార్వేట ఉత్సవం 40 రోజులపాటు నిర్వహించడం ఒక్క అహోబిలంలోనే ప్రత్యేకం. పార్వేటలో భాగంగా ఆయా గ్రామాల్లోకి వెళ్లిన స్వామివారిని భక్తులు కులమతాలకు అతీతంగా ఆరాధిస్తారు. తమ చెంతకు భగవంతుడు రావడంతో ప్రజలంతా సంతోషంగా పండగ చేసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని