logo

మంత్రి ఇలాకా...అరాచకాల కేక

‘‘డోన్‌లో గత ప్రభుత్వంలా కాకుండా అక్రమాలకు తావులేకుండా ప్రజలకు మేలైన పాలన అందించాం. నేరాలు అదుపు చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం.

Published : 10 May 2024 02:34 IST

పోలీసు దాడుల్లో దొరికిన గంజాయి

 ‘డోన్‌లో గత ప్రభుత్వంలా కాకుండా అక్రమాలకు తావులేకుండా ప్రజలకు మేలైన పాలన అందించాం. నేరాలు అదుపు చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు డోన్‌లో స్వేచ్ఛగా తిరిగేలా చేశాం. డోన్‌ ప్రాంతంలో నెమళ్లు కూడా స్వేచ్ఛగా తిరిగేలా అభివృద్ధి చేశాం.’’

 - పలు సమావేశాల్లో ఆర్థికమంత్రి బుగ్గన చెప్పిన మాటలివి.!!


మద్యం.. గంజాయి.. మట్కా.. ఇలా అరాచకాలకు అడ్డాగా మారింది. ఖనిజ ఖిల్లాగా పేరొందిన డోన్‌ పట్టణంలో గత మూడేళ్లలో యువకుల అరాచకాలు, అల్లరిమూకల దాడులు.. గంజాయి రవాణా, అక్రమ మద్యానికి అడ్డాగా మారింది.

వెనక ఉండి నడిపిస్తుందెవరో

డోన్‌ పట్టణంలో డీఎస్పీ కార్యాలయంతో పాటు, పట్టణ, గ్రామీణ పోలీసుస్టేషన్లు, సెబ్‌ పోలీస్‌స్టేషన్‌ ఉంది. ఇద్దరు సీఐలు, పలువురు ఎస్సైలు విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలో 32 వార్డులతో పాటు 80 వేల మందికి పైగా జనాభా ఉన్నారు. ఇలాంటి చోట్ల శాంతిభద్రతల పరిరక్షణ చాలా కీలకం. ఇలాంటి పట్టణంలో చాలామంది అక్రమమద్యం రవాణా, గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. మట్కా లోగుట్టుగా పెద్దఎత్తున నడుస్తోంది. ‘అధికార’ పార్టీకి చెందిన కొందరు ముఖ్యనాయకులే వెనుకుండి ఇవన్నీ నడిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమమద్యం కేసుల్లో దొరుకుతున్నది ఎక్కువగా డోన్‌కు చెందిన వారే కావడం గమనార్హం. పట్టణంలో మద్యం మత్తులో యువకులు పట్టపగలే ప్రధాన రహదారుల్లో ఘర్షణలకు పాల్పడుతున్నారు. గతంలో బ్లేడ్లతోనూ దాడులు చేసుకున్నారు. మద్యం వ్యాపారం విషయంలోనే గతంలో అధికారపార్టీ అనుచరుల మధ్య ఘర్షణ జరిగి కత్తులతో దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది.

గుట్టుగా మట్కా..

డోన్‌లో అధికారపార్టీలో కీలకంగా ఉన్న ఓ నాయకుడి కనుసన్నల్లోనే పెద్దఎత్తున మట్కా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని పాతపేట, కొండపేట, టీఆర్‌ నగర్‌, కొత్తపేట ప్రాంతాల్లో కొందరు మట్కా వ్యాపారాన్ని గుట్టుగా చేస్తున్నారు. ఈ అయిదేళ్ల కాలంలోనే ఆ నాయకుడు ఎంతో అక్రమంగా ఆర్జించాడని అధికార పార్టీ నాయకులే అనుకుంటున్నారు. మట్కాతో పాటు, అక్రమమద్యం, ఇతర విషయాల్లోనూ కొందరు నాయకులతో కలసి ఆయన పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. పాతపేట కేంద్రంగా మరో ఇద్దరు నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
- న్యూస్‌టుడే, డోన్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు