logo

కల నెరవేరేలా.. మెళకువలు పెంపొందేలా!

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ), మహబూబ్‌నగర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం (ఎండీసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో 8 ఏళ్ల విరామం తర్వాత ఉమ్మడి జిల్లాలో వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు.

Updated : 23 May 2024 06:05 IST

హెచ్‌సీఏ క్రికెట్‌ శిక్షణ శిబిరాలకు పోటెత్తిన బాలలు 

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ), మహబూబ్‌నగర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం (ఎండీసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో 8 ఏళ్ల విరామం తర్వాత ఉమ్మడి జిల్లాలో వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆరు శిక్షణ శిబిరాలు ఇక్కడ నిర్వహించగా వందలాది మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం, సాయంత్రం సీనియర్‌ క్రీడాకారులు, శిక్షకుల పర్యవేక్షణలో మెళకువలు నేర్చుకున్నారు. హెచ్‌సీఏ తొలిసారిగా ప్రతి శిక్షణ శిబిరానికి జంబో క్రికెట్‌ కిట్లను అందించటం విశేషం. ఒక్కో కిట్‌లో 4 మ్యాట్లు, 8 చొప్పున ప్యాడ్లు, గ్లౌ, థై ప్యాడ్లు, 4 హెల్మెట్లు, 10 వికెట్లు, 4 బ్యాట్లతో పాటు ఫిట్‌నెస్‌ కోన్స్, బంతులు, సింథటిక్‌ బాల్స్, స్వింగ్‌బాల్, ఫిట్‌నెస్‌ ల్యాడర్, ప్లాస్టిక్‌ బాల్స్‌ అందించారు. 

- న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ క్రీడలు, జడ్చర్ల పట్టణం 

జడ్చర్ల: క్రికెట్‌ సాధన చేస్తున్న క్రీడాకారులు

శిబిరాల వారీగా ఇలా.. 

మహబూబ్‌నగర్‌లోని ఎండీసీఏ మైదానంలో నిర్వహించిన వేసవి క్రికెట్‌ శిబిరానికి రోజూ 250 నుంచి సుమారు 300 మంది వరకు చిన్నారులు వచ్చి శిక్షణ పొందారు. జిల్లాలోని చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చి క్రికెట్‌ సాధన చేశారు. గద్వాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో 130 మంది చిన్నారులు పాల్గొన్నారు. నాగర్‌కర్నూలు వేసవి శిబిరానికి 95 మంది నిత్యం హాజరయ్యారు. జడ్చర్ల శిబిరానికి 130 మంది, కోస్గిలో 60 మంది చిన్నారులు, కల్వకుర్తి శిబిరానికి 110 వరకు వచ్చి సాధన చేశారు. మహబూబ్‌నగర్‌ శిబిరంలో ఆరుగురు సీనియర్‌ క్రికెటర్లు శిక్షణ ఇచ్చారు. మిగతా శిబిరాల్లో ఇద్దరు సీనియర్‌ క్రికెటర్లు చిన్నారులకు క్రికెట్‌ మెలకువలు నేర్పించారు. క్రికెట్‌లో బేసిక్స్, బ్యాటు పట్టే విధానం, బ్యాటింగ్‌ ఎలా చేయాలి, క్యాచులు, ఫీల్డింగ్‌ సామర్థ్యాలు, బౌలింగ్, బంతులు పట్టే విధానం, పరుగులు తీసే పద్ధతులు, ప్రధానంగా క్రికెటర్‌కు ఉండాల్సిన ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించారు. 

మహబూబ్‌నగర్‌ : క్యాచ్‌ పట్టడంలో తర్ఫీదు


మహబూబ్‌నగర్‌లో ఉంటూ.. 

మాది మాది నారాయణపేట జిల్లా. అమ్మానాన్నల ప్రోత్సాహంతో నెల రోజులుగా మహబూబ్‌నగర్‌లోనే ఉంటూ ఎండీసీఏ మైదానంలో నిర్వహిస్తున్న వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరానికి వచ్చి క్రికెట్‌లో శిక్షణ తీసుకున్నాను. ఇష్టమైన క్రికెటర్‌ ధోనీలా ఆడాలని ఉంది. భారత జట్టుకు ఎంపికవటమే నా లక్ష్యం. 

ఎ.అభిరాం, కొండదొడ్డి(మక్తల్‌)


అండర్‌-16 మ్యాచులు ఆడాను 

రెండేళ్లుగా వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరానికి వస్తున్నా. కోచ్‌ అబ్దుల్లా సహకారంతో బ్యాటింగ్, బౌలింగ్‌లో మెలకువలు నేర్చుకున్నా. గత ఏడాది నిర్వహించిన అండర్‌-16 జిల్లా స్థాయి లీగ్‌ మ్యాచ్‌లు ఆడాను. క్రికెటర్‌ జాస్‌ హేజిల్‌ ఉడ్‌ లాగా బౌలింగ్‌ చేయాలన్నదే నా కల. 

ప్రణవ్‌ కార్తికేయ,మహబూబ్‌నగర్‌ 


హెచ్‌సీఏ పోటీల్లో ప్రాధాన్యం..

వేసవి శిబిరాల్లో చిన్నారులకు అన్ని మెలకువలు నేర్పించి క్రికెట్‌ మ్యాచులు ఆడించాం. అంతర్‌ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ) త్వరలో నిర్వహించే అండర్‌-14, 16, 19, సీనియర్స్‌ అంతర్‌ జిల్లాల క్రికెట్‌ పోటీల్లో శిబిరాల్లో ప్రతిభ చాటిన వారికి ప్రాధాన్యం ఇస్తాం.  

ఎం.రాజశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి


జాతీయ స్థాయిలో ఆడాలని.. 

క్రికెట్‌ ఇష్టం కావటంతో ప్రత్యేకంగా దృష్టి పెట్టాను. అమ్మాన్నాన్నలు ప్రోత్సహిస్తున్నారు. హెచ్‌సీఏ శిబిరంలో అండర్‌-14 బాలికల విభాగంలో శిక్షణ తీసుకున్నా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ బాగా చేస్తాను. భవిష్యత్తులో బాలికల జట్టులో స్థానం సంపాదించి జాతీయ స్థాయిలో ఆడాలని ఉంది. 

ఆశ్రిత, వెంకటేశ్వరకాలనీ, జడ్చర్ల


అవగాహన పెరిగింది.. 

క్రికెట్‌లోనూ బాలికలు ముందుండాలి. నేను మొదటిసారిగా క్రికెట్‌ శిక్షణ తీసుకున్నా. ఆటపై అవగాహన పెరిగింది. నైపుణ్యాలు పెంచుకున్నాను. సెలవుల తర్వాత కూడా క్రికెట్‌ శిక్షణ, సాధన కొససాగిస్తాను. క్రికెటర్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించటమే లక్ష్యంగా ముందుకెళ్తా. 

జమీల తబస్సుమ్, ఎస్‌వీపీనగర్‌ కాలనీ, జడ్చర్ల


సెలవుల తర్వాత కూడా రోజూ సాధన

వేసవి శిబిరంలో భాగంగా నెల రోజుల పాటు వచ్చి క్రికెట్‌ సాధన చేశా. ఎన్నో విషయాలు, నైపుణ్యాలు తెలుసుకున్నా. శిక్షణ బాగుంది, సెలవులయ్యాక కూడా ఉదయం, సాయంత్రం వచ్చి క్రికెట్‌ సాధన చేస్తా. ఇష్టమైన క్రికెటర్‌ విరాట్‌ కోహ్లిలా రాణిస్తా. 

బి.అశ్విత్‌ సింగ్, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని