logo

మహిళల పెన్నిధి.. చదువుల సన్నిధి!

ఉమ్మడి జిల్లాలోనే ఏకైక మహిళా డిగ్రీ కళాశాలగా ఉన్న మహబూబ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అనేక ప్రత్యేకతలతో ఆదర్శంగా నిలుస్తోంది.

Published : 23 May 2024 03:43 IST

ఎన్టీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నో ప్రత్యేకతలు 

కళాశాలలో విద్యార్థినులు 

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: ఉమ్మడి జిల్లాలోనే ఏకైక మహిళా డిగ్రీ కళాశాలగా ఉన్న మహబూబ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అనేక ప్రత్యేకతలతో ఆదర్శంగా నిలుస్తోంది. 1981లో ఏర్పాటైన ఈ కళాశాలలో అత్యాధునిక వసతులు ఉన్నాయి. అపారమైన అనుభవం కలిగిన అధ్యాపకులు పాఠాలు బోధిస్తూ విద్యార్థినుల భవితకు బాటలు వేస్తున్నారు. సంప్రదాయ డిగ్రీ, పీజీలతో పాటు ఉపాధికి దోహదపడే వినూత్నమైన కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడి ప్రత్యేకతలపై ‘న్యూస్‌టుడే’ కథనం. 
ఉమ్మడి జిల్లా కేంద్రం నడిబొడ్డున ఏర్పాటు చేసిన కళాశాలలో 2,957 మంది విద్యార్థినులు చదువుతున్నారు. 61 తగరతి గదులు, 31 లెక్చర్‌ హాల్స్, భౌతిక, రసాయన, వృక్ష, జంతుశాస్త్రాలకు సంబంధించి 13 ప్రయోగశాలలు, నైపుణ్యాలు పెంచే టాస్క్‌ సెల్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (ప్రత్యేక జిమ్‌), ప్లేస్‌మెంట్‌ సెల్, స్టూడెంట్‌ వెయిటింగ్‌ హాల్, క్యాంటీన్‌ అందుబాటులో ఉన్నాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమంలో బోధన కొనసాగుతోంది. ఒక పీజీ, 14 యూజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సమీపంలోనే బస్టాండు, రైల్వేస్టేషన్, క్రీడా మైదానం, ఆసుపత్రి ఉండటం విద్యార్థినులకు సానుకూలాంశాలు. సుదూర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చేవారు బస్టాండులో దిగి కళాశాలకు కాలినడకన వెళ్లొచ్చు. సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, ఉపాధి రంగాల్లో ఉద్యోగాల సాధనకు అవసరయ్యే నైపుణ్యాలు, కంప్యూటర్‌ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఆత్మరక్షణకు యుద్ధ విద్య కూడా నేర్పిస్తారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలు ఉన్నాయి. ప్రయోగశాలల్లో పీజీ స్థాయి వసతులు ఉన్నాయి. ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో కళాశాలలో నిర్వహిస్తున్న జాబ్‌ మేళాల్లో రూ.14వేల నుంచి రూ.24వేల వేతనంలో 220 మంది విద్యార్థినులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బీ+ న్యాక్‌ గ్రేడ్‌ ఉన్న ఈ కళాశాలకు స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ప్రవేశ ప్రక్రియ ఇలా..

దోస్త్‌ వెబ్‌సైట్‌లో ఈనెల 25 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ఈనెల 20 నుంచి ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఈ నెల 30 వరకు ఉంటుంది. జూన్‌ 3న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్‌ 10లోపు విద్యార్థులు రిపోర్టు చేయాలి. రెండో విడత రిజిస్ట్రేషన్లు జూన్‌ 4 నుంచి ప్రారంభమవుతాయి.


దరఖాస్తులకు ఆహ్వానం 

ఈ ఏడాది వివిధ కోర్సుల్లో 1,380 సీట్లు ఉన్నాయి. ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దోస్త్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. నెట్, సెట్, పీహెచ్‌డీలు విద్యార్హతలు కలిగిన 79 మంది అధ్యాపకులు నాణ్యమైన విద్య అందిస్తారు. ప్రతి విద్యార్థినికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వినూత్నమైన కోర్సులు నిర్వహిస్తున్నాం. టాస్క్‌తో పాటు అనేక రకాలైన సంస్థలతో ప్రత్యేక ఎంవోయూలు ఉన్నాయి. 

 డా.ఎం.విజయ్‌కుమార్, ప్రిన్సిపల్, ఎన్టీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని