పల్లెల్లో బెట్టింగ్‌ భూతం

జోగులాంబ జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతూ యువతను ముగ్గులోకి దింపుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. గతంలోనూ పోలీసులు ఇలాగే కొందరిని అదుపులోకి తీసుకొని విచారించి కేసులు నమోదు చేసి వదిలేశారు.

Updated : 26 May 2024 06:25 IST

క్రికెట్‌ పందాలతో కుటుంబాలు అప్పులపాలు

ధరూరు, న్యూస్‌టుడే: జోగులాంబ జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతూ యువతను ముగ్గులోకి దింపుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. గతంలోనూ పోలీసులు ఇలాగే కొందరిని అదుపులోకి తీసుకొని విచారించి కేసులు నమోదు చేసి వదిలేశారు. కానీ బెట్టింగ్‌ వ్యవస్థను మాత్రం అడ్డుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణం తేడా లేకుండా ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా యువకులు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీల కారణంగా ఇది మరింత ఎక్కువైంది. ఇందులో యువకులే కాదు 50 ఏళ్లు దాటినవారు, 18 ఏళ్లు నిండని వారు ఉన్నారు. దర్జాగా వ్యాపారాలు వెలుగబెడుతున్నవారు ఉన్నారు. 

వారికి కాసులు.. వీరికి చీకట్లు 

వాస్తవానికి బెట్టింగ్‌ కూడా ఒక జూదమే. ఈ ఐపీఎల్‌ పందెం క్రికెటర్లకు, బీసీసీఐకి బెట్టింగులు నిర్వహిస్తున్న యాప్‌ల నిర్వాహకులకు, క్రికెట్‌ పోటీల ప్రసార హక్కులు పొందిన ఛానెళ్లకు, క్రికెట్‌టీంలకు పెట్టుబడులుగా రూ.కోట్ల కుమ్మరించి కొనుగోలు చేసి ఆడిస్తున్న మల్టీ నేషనల్‌ పారిశ్రామిక సంస్థలకు కాసులు కురిపిస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా వీటిపై బెట్టింగుల కారణంగా కొన్ని కుటుంబాల్లో చీకట్లు మిగులుతున్నాయి. కుటుంబాలకు ఆర్థికంగా చితికిపోతున్నాయి. కొందరు ఆస్తులు తనఖా పెట్టి మరీ బెట్టింగ్‌లకు దిగుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతుండటం విచారకరం.

ఇవిగో వాస్తవాలు..

  • ధరూరు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామంలో తండ్రి పైసా పైసా కూడబెట్టి సొమ్మును వడ్డీలకు ఇచ్చి వచ్చిన వడ్డీతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా కుటుంబాన్ని పోషించుకునే వాడు. కొడుకు చేతికి వచ్చాకే ఆసలు కథ మొదలైంది కొంత సొమ్ము కొడుకు చేతికి ఇచ్చి వ్యాపారం పెట్టించాడు. తీరా ఇచ్చిన సొమ్ము బెట్టింగ్‌లో పోగొట్టుకోవటమే కాకుండా గ్రామంలో తనకు తెలిసిన వారితో తండ్రికి తెలియకుండానే రూ.25 లక్షల వరకు అప్పులు చేసి ఆచూకీ లేకుండా పోయాడు. 
  • మరో కుటుంబంలో తండ్రికి తెలియకుండా బెట్టింగ్‌కు చేసిన అప్పు కట్టలేక ఇచ్చిన వారు ఒత్తిడి చేయటంతో ఇటు తండ్రికి చెప్పుకోలేక అటు అప్పుకట్టలేక పురుగుల మందు తాగి అస్పత్రి పాలయ్యాడో సుపుత్రుడు. ఆ కొడుకును బతికించుకోవటానికి తండ్రి ఆస్పత్రి బిల్లుల కోసం మరో రెండు లక్షలు అప్పుచేయాల్సిన పరిస్థితి. ఇంతా చేసినా మూడు రోజుల తర్వాత కొడుకు మృతి చెందటంతో కుటుంబంలో తీరని ఆవేదన మిగిలింది. పుత్రరత్నాలను నమ్ముకొని బెట్టింగ్‌ కారణంగా చేతులు కాలిన తండ్రులున్న కుటుంబాలు ఆ ఒక్క గ్రామంలోనే పది వరకున్నాయి. 

పది రూపాయల వడ్డీకి: తల్లిదండ్రులు సొమ్ము ఇవ్వకపోతే గ్రామాల్లో పది రూపాయల వడ్డీకి సొమ్ము అడిగిన వెంటనే చేతికి ఇవ్వటానికి లేదా అన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేయటానికి ముఠాలు ఏర్పాటయ్యాయి. గ్రామంలో వడ్డీ వ్యాపారం నిర్వహించే కొందరు ఈ దందాను నడిపిస్తున్నారు. గద్వాల జిల్లాలో జోరుగా బెట్టింగ్‌లు కాస్తున్న వారికి సొమ్మును సమకూర్చే దానిలో ఓ పోలీసు అధికారి పుత్రరత్నం తీరిక లేకుండా దందా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దమొత్తాలు భూముల పత్రాలు, ఇతర ఆస్తి పత్రాలు పెట్టుకొని మరి అప్పుగా ఇస్తున్నట్లు సమాచారం. మండల కేంద్రాల్లో బెట్టింగ్‌లో పాల్గొంటున్న యువతకు అప్పులు ఇవ్వటం కోసం నలుగురైదురుగు కలిసి పది నుంచి పదిహేను లక్షలు పోగేసుకొని అధిక వడ్డీకి అప్పుగా వారికి ఇస్తూ దందాను నడిపిస్తున్నట్లు బయటకు వినిపిస్తున్నది. వీరిపై కూడా పోలీసులు దృష్టి సారిస్తే బెట్టింగ్‌ రాయుళ్లు ఏ ఊళ్లో ఎంత మంది ఉన్నారనే సమాచారం కొంత వరకు తెలిసే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని