logo

శాసన సభలో అతివల కేతనం

ఆకాశంలో సగం అంటూ అతివల్ని పొగడటమే తప్ప ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం కల్పించింది తక్కువే.

Published : 29 Oct 2023 05:35 IST

8 మంది మహిళలు.. 11 సార్లు గెలుపు
మంత్రిగా బాధ్యతలు  నిర్వర్తించిన డీకే అరుణ
న్యూస్‌టుడే, అచ్చంపేట, కొత్తకోట

కాశంలో సగం అంటూ అతివల్ని పొగడటమే తప్ప ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం కల్పించింది తక్కువే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పురుషులతో సమానంగా ఓటు హక్కు ఉన్న మహిళ అనాదిగా చులకన భావానికే గురైంది. శాసనసభకు జరిగిన తొలి ఎన్నికల నాటి నుంచి పరిశీలిస్తే ఇదే కళ్లకు కడుతుంది. రాష్ట్రంలో 1952లో తొలిసారిగా ఎన్నికలు జరగ్గా అప్పటి పరిగి నియోజకవర్గం నుంచి షహాజహాన్‌ బేగం, మక్తల్‌ నుంచి శాంతాబాయి పోటీ చేసి గెలుపొంది మహిళ ప్రతినిధుల ఖాతా తెరిచారు. కాని ఆతరువాత ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 13 మంది మహిళలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగా ఎనిమిది మంది మాత్రమే శాసనసభలో అడుగెట్టారు. వీరిలో ఆరుగురు కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు తెదేపాకు చెందిన వారున్నారు. 14 సార్లు సాధారణ ఎన్నికలు జరగ్గా వాటిలో 1972, 1978, 1994 అసలు మహిళలకు పోటీ చేసే అవకాశమే దక్కలేదు.

ఆరు నియోజకవర్గాల్లో వారే అధికం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆరు సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. దేవరకద్ర, గద్వాల, మక్తల్‌, అలంపూర్‌, నారాయణపేట, కొడంగల్‌ నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇప్పటి వరకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా షాద్‌నగర్‌ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది. మిగతా 13 నియోజకవర్గాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు నుంచి 15 సార్లు జరిగిన ఎన్నికల్లో 8 మంది మహిళలు విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. వారిలో ఒకరు మూడు సార్లు, మరొకరు రెండు సార్లు గెలుపొందగా మరో ఆరుగురు ఒక్కో సారి విజయం సాధించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు 11 సార్లు మహిళలు గెలుపొందారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లిన షాద్‌నగర్‌ నియోజకవర్గం నుంచి 1957లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన షాజహాన్‌ బేగం స్వతంత్ర అభ్యర్థి లక్ష్మారెడ్డిపై 3,423 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1985లో షాద్‌నగర్‌ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.ఇందిర సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బి.కిష్టయ్యపై 7,018 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.


హాట్రిక్‌ సాధించిన డీకే అరుణ

గద్వాల నియోజకవర్గం నుంచి డీకే అరుణ మూడుసార్లు వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది హాట్రిక్‌ సాధించారు. రెండు సార్లు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2004లో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా గద్వాల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచి తెదేపా అభ్యర్థి గట్టు భీముడుపై 38,686 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీలో చేరి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రిగా 2009 వరకు బాధ్యతలు నిర్వహించారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తెదేపాకు చెందిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై 10,427 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2009 నుంచి 2010 వరకు రోశయ్య మంత్రివర్గంలో రెండోసారి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి భారాస అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై 8,260 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019లో భాజపాలో చేరి ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


సీత దయాకర్‌ను వరించిన ఎమ్మెల్యే పదవి

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో దేవరకద్ర నియోజకవర్గం 2009లో కొత్తగా ఏర్పాటైంది. ఈ నియోజకవర్గానికి తొలిసారి జరిగిన ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన సీతాదయాకర్‌రెడ్డి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ ఎన్నికల్లో ఆమె భర్త దయాకర్‌రెడ్డి మక్తల్‌ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఒకేసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఘనతను వారు సొంతం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థి స్వర్ణ సుధాకర్‌పై 19,036 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంతకు ముందు సీతాదయాకర్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు.


వనపర్తి నుంచి రెండుసార్లు

వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కుముదిని దేవి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962, 1967లో రెండు సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. వనపర్తి సంస్థానాధీశుల కుటుంబం నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి సత్తాను చాటారు.


అమరచింత చివరి ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండేవి. 2004లో అమరచింత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన స్వర్ణ సుధాకర్‌ తెదేపా అభ్యర్థి దయాకర్‌రెడ్డిపై 13,783 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తరువాత 2007లో నియోజకవర్గాల పునర్విభజనలో అమరచింతను రద్దు చేసి దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేశారు. దాంతో స్వర్ణ సుధాకర్‌ అమరచింత నియోజకవర్గానికి చివరి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు.


మరో ఇద్దరు మహిళలు..

తొలిసారి 1952లో నిర్వహించిన ఎన్నికల్లో మక్తల్‌/ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన శాంతాబాయి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1957 అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జయలక్ష్మి దేవమ్మ సమీప స్వతంత్ర అభ్యర్థి జనార్దన్‌రెడ్డిపై కేవలం 78 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని