logo

Telangana Elections: అక్కడ పెద్దనాన్న.. ఇక్కడ అమ్మాయి

నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాల్లో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి కుటుంబానికి చెందిన వారే ఉన్నారు.

Updated : 02 Nov 2023 09:15 IST

నారాయణపేట, న్యూస్‌టుడే: నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాల్లో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి కుటుంబానికి చెందిన వారే ఉన్నారు. 2005లో నారాయణపేటలో జరిగిన మావోయిస్టుల కాల్పుల్లో అప్పటి ఎమ్మెల్యే నర్సిరెడ్డితోపాటు చిన్న కుమారుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ నాయకుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి సైతం ప్రాణాలు కోల్పోయారు. 2005 ఉప ఎన్నికల్లో నర్సిరెడ్డి పెద్దకుమారుడు మక్తల్‌ ప్రస్తుత ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఉమ్మడి మక్తల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి 40వేల మెజార్టీతో గెలిచారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండుసార్లు తెరాస నుంచి మక్తల్‌ ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. ఇప్పటి వరకు మూడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. నారాయణపేట నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపికైన చిట్టెం పర్ణికా రెడ్డి మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి సొంత తమ్ముడి కూతురు.

చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తమ్ముడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి కూతురే ప్రస్తుతం పేట నియోజకవర్గ బరిలో ఉన్న డా.చిట్టెం పర్ణికా రెడ్డి. ఒకే కుటుంబానికి చెందిన చిట్టెం పర్ణికా రెడ్డి పేట నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తుండగా మక్తల్‌ నియోజకవర్గం నుంచి నాలుగోసారి (భారాస నుంచి వరుసగా మూడోసారి) చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పక్క పక్క నియోజకవర్గాల్లో పోటీలో నిలిచారు. మాజీ మంత్రి, ప్రస్తుత భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి డీకే అరుణకు పర్ణికా రెడ్డి సొంత మేనకోడలు. కాంగ్రెస్‌ పార్టీ 2014, బీఎల్‌ఎఫ్‌ పార్టీ నుంచి 2018లో పోటీ చేసి ఓడిపోయిన కుంభం శివకుమార్‌రెడ్డి చెల్లెలి కూతురే పర్ణికా రెడ్డి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని