logo

అచ్చంపేటలో కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యం

అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ భారీ ఆధిక్యం సాధించింది. 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన భారాసకు ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది.

Published : 07 Dec 2023 04:26 IST

అచ్చంపేట, న్యూస్‌టుడే : అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ భారీ ఆధిక్యం సాధించింది. 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన భారాసకు ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. భాజపా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. నియోజకవర్గంలో 8 మండలాలు ఉండగా అన్ని మండలాల్లో కాంగ్రెస్‌ జయకేతనం ఎగురవేసింది.నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి డా.చిక్కుడు వంశీకృష్ణకు 1,15,337 ఓట్లు రాగా భారాస అభ్యర్థి గువ్వల బాలరాజుకు 66,011 ఓట్లు, భాజపా అభ్యర్థి సతీశ్‌ మాదిగకు కేవలం 4,267 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. భారాస అభ్యర్థి గువ్వల బాలరాజుపై కాంగ్రెస్‌ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ 49,326 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. భారాసకు పట్టు ఉన్న గ్రామాల్లో కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు.

15 ఏళ్ల తరువాత గెలుపు : నల్లమలలో విస్తరించిన అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ 15 ఏళ్ల తరువాత విజయాన్ని నమోదు చేసుకుంది. తెదేపా ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 1983, 1985, 1994, 1999, 2009లో జరిగిన ఎన్నికల్లో ఐదు సార్లు విజయం సాధించింది. 1989, 2004 ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్‌ గెలుపొందింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2014, 2018 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో భారాస విజయం సాధించింది. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి డి.కిరణ్‌కుమార్‌ గెలుపొందగా 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డా.చిక్కుడు వంశీకృష్ణ విజయం సాధించారు. ఆ తరువాత మూడు సార్లు వరుసగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. ఎట్టకేలకు 15 ఏళ్ల తరువాత జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ భారాసపై భారీ విజయాన్ని నమోదు చేసుకొని సత్తాను చాటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని