logo

కోడళ్లకు కొత్త కష్టం!

ధరూరు మండలానికి చెందిన కృష్ణవేణి రెండేళ్ల కిందట వివాహం చేసుకుని జిల్లాలో మరో మండలం పరిధిలోని గ్రామంలో అత్తారింటికి వెళ్లింది.

Updated : 05 Mar 2024 06:26 IST

ఆరు గ్యారంటీలకు వారు దూరం

గద్వాల, న్యూస్‌టుడే: ధరూరు మండలానికి చెందిన కృష్ణవేణి రెండేళ్ల కిందట వివాహం చేసుకుని జిల్లాలో మరో మండలం పరిధిలోని గ్రామంలో అత్తారింటికి వెళ్లింది. పుట్టినింట్లో రేషన్‌ కార్డులో పేరు తొలగించి అత్తారింటి కార్డులో చేర్చాలని వినతి పెట్టుకుంది. అధికారులు విచారించి పుట్టినింటి కార్డులో పేరు తొలగించారు. కానీ అత్తారింటి కార్డులో పేరు చేర్చలేదు. పేరు చేర్చటానికి ఆన్‌లైన్‌లో ఆప్షన్‌ లేదని అధికారులు తీరిగ్గా సెలవిచ్చారు. పుట్టింటి కార్డులో పేరులేకా.. అటు అత్తారింటి కార్డులో పేరు చేర్చక రేషన్‌ కోటాను రెండేళ్లుగా కోల్పోయింది. ఇలాంటి కొత్త కోడళ్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 వేలకుపైగానే ఉన్నారు. వీరిదరి సమస్యా ఇదే. తాజాగా ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు రేషన్‌ కార్డే ప్రామాణికం కానుందని చెబుతున్న వేళ వారిలో ఆందోళన నెలకొంది.

పేర్ల నమోదుకు నిరీక్షణ

రేషన్‌ కార్డుల జారీపై గత ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా కార్డులు జారీచేస్తుందని ఆశతో ప్రజలున్నారు. అది కూడా కనుచూపు మేరలో కానరావడంలేదు. పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చిన కొత్తకోడళ్లకు ఆందోళన తప్పటం లేదు. ఉమ్మడి జిల్లాలో వేల మంది కొత్త కోడళ్ల పేర్లు కార్డుల్లోకి నమోదు కాకపోవడంతో వారంతా నిరీక్షిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నాటికి వేల సంఖ్యలో పెళ్లిళ్లు ఉమ్మడి జిల్లాలో జరగనున్నాయి. ముహుర్తాలు ఉన్న రోజుల్లో సగటున 500 నుంచి 750 వరకు పెళ్లిళ్లు ఉమ్మడి జిల్లాలో జరగనున్నాయి. వారందరికీ ఇదే సమస్య కానుంది. దరఖాస్తులు చేసుకున్నా సమాధానమివ్వలేని పరిస్థితి అధికారులది. గత మూడేళ్లుగా అర్జీలు కుప్పలుగా పేరుకుపోయాయి. పేర్ల తొలగింపు ప్రక్రియ మాత్రం నిరంతరాయంగా కొనసాగుతోంది. కొత్తకార్డుల జారీ, పేర్ల చేర్పు ప్రక్రియకు మాత్రం అవకాశం లేకుండా ఉంది

వినతులు ఇచ్చి..

ఉమ్మడి జిల్లాలో మూడేళ్ల వ్యవధిలో అత్తారింటి కార్డులో ఒక్కపేరు కూడా చేర్చలేదని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా వివాహాలు అయిన తర్వాత అత్తారింటి కార్డుల్లో పేరు చేర్చక నిరీక్షిస్తున్న దరఖాస్తుల సంఖ్య మూడేళ్లుగా 22,500 వరకు ఉన్నాయి. కొత్తగా పెళ్లయి కుటుంబం విడిగా ఉన్నవారు కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తుల సంఖ్య కూడా వేలల్లోనే ఉంది. కొత్త రేషన్‌ కార్డుల విషయంలో పేర్ల తొలగింపు మా చేతుల్లో ఉంది. కానీ చేర్చేది ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందంటున్నారు రెవెన్యూ సిబ్బంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని