logo

కళాశాల లేక.. చదువు సాగక!

రాజోలి మండలంలో ఏటా 230 మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. వీరు ఇంటర్‌ విద్య చదువుకోవడానికి స్థానికంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లేదు. పక్క మండలమైన వడ్డేపల్లిలోనూ లేదు.

Published : 08 May 2024 03:11 IST

21 మండలాల్లో ఇంటర్‌ విద్యకు దూరంగా విద్యార్థులు

రాజోలి మండలంలో ఏటా 230 మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. వీరు ఇంటర్‌ విద్య చదువుకోవడానికి స్థానికంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లేదు. పక్క మండలమైన వడ్డేపల్లిలోనూ లేదు. 20 కి.మీ. దూరంలోని అయిజ లేదా రవాణా సౌకర్యం సరిగా లేని మానవపాడుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇలా వెళ్లలేక ఏటా 30 శాతం మంది విద్యార్థులు పదితోనే చదువు మానేస్తున్నారు.

గద్వాల న్యూటౌన్‌, న్యూస్‌టుడే: విద్యార్థి జీవితంలో ఇంటర్‌ కీలకమైంది. ఎంతో మంది విద్యార్థులు భవిష్యత్తును నిర్దేశించేది ఇందులో ఎంచుకునే కోర్సులే. అయితే.. స్థానికంగా జూనియర్‌ కళాశాలలు లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతోంది. చాలా మంది పదో తరగతితో చదువు ఆపేస్తున్నారు. వారిలో బాలికలు అధిక శాతం ఉండటం ఆందోళన కలిగించే అంశం.

ఉమ్మడి జిల్లాలో..: ఏటా దాదాపు 40 వేల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పూర్తి చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 39,915 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సప్లమెంటరీ పరీక్ష ద్వారా మరికొందరు ఉత్తీర్ణులైతే ఆ సంఖ్య పెరుగుతుంది. మొత్తం 76 మండలాల్లో 56 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. ఇందులో జిల్లా కేంద్రాల్లో రెండు, మూడు కళాశాలలుండగా, 21 మండలాల్లో కాలేజీలు లేకపోవడంతో అక్కడి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలతో పాటు, అప్పటికే ఉమ్మడి మండలాల్లో కళాశాలలు లేని సమస్య తీవ్రంగా ఉంది. మరోవైపు ప్రభుత్వ సెక్టార్‌ పరిధిలో కేజీబీవీ, గురుకుల, ఆదర్శ కళాశాలలు 96 ఉన్నాయి. ఇందులో కేజీబీవీ మినహా, మిగిలిన వాటిలో ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తుండటంతో స్థానికంగా చదవాలనుకునే వారికి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. స్థానికంగా ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలు లేకపోవడం వల్ల ఆ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దూరంగా ఉన్న కళాశాలలకు వెళ్లేందుకు ఏడాదికి దాదాపు రూ.9 వేల నుంచి రూ.15 వేల వరకు రవాణా భారం పడుతుండటంతో వెచ్చించలేని పరిస్థితి కొందరిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు