logo

ఆగిన రైతు భరోసా చెల్లింపులు

రైతు భరోసా పథకానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. యాసంగి సీజన్‌లో పంట సాగు చేసిన రైతులందరికీ సాయం అందిస్తామని రాష్ట్ర  ప్రభుత్వం ప్రకటించినా డిసెంబర్‌ మూడో వారంలో ఐదు ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేసింది.

Published : 08 May 2024 03:13 IST

మహబూబ్‌నగర్‌ వ్యవసాయం, కొత్తకోట, న్యూస్‌టుడే : రైతు భరోసా పథకానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. యాసంగి సీజన్‌లో పంట సాగు చేసిన రైతులందరికీ సాయం అందిస్తామని రాష్ట్ర  ప్రభుత్వం ప్రకటించినా డిసెంబర్‌ మూడో వారంలో ఐదు ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేసింది. తర్వాత లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు నోటఫికేషన్‌ రావటంతో నగదు చెల్లింపుల ప్రక్రియ ముందుకు సాగలేదు. గత వారంలో రైతు భరోసా లబ్ధిదారులందరికీ నగదు చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. సోమవారం ఐదు ఎకరాలు దాటిన రైతుల ఖాతాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ నగదు జమ చేసింది. మంగళవారం కూడా కొంత మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఇందులో ఆరు నుంచి 10 ఎకరాల రైతులు కూడా ఉన్నారు. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం రైతు భరోసా కింద నగదు చెల్లింపు నిలిపివేయాలని సూచించటంతో ప్రక్రియ ఆగిపోయింది.

ఉమ్మడి జిల్లాలో 11.25 లక్షల మంది రైతులు ఉన్నారు. వారందరికీ ఏటా రూ.1,256 కోట్ల పెట్టుబడి సాయం అందేది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2.26 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో 2.6 లక్షల మంది రైతులకు ఇప్పటికే రూ.164 కోట్లకు పైగా నగదును జమ అయ్యింది. నారాయణపేట జిల్లాలో 1.77 లక్షల మంది రైతులకు రూ.225.17 కోట్ల నగదు జమ చేసింది. వనపర్తి జిల్లాలో 1.83 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇప్పటి వరకు 1.75 లక్షల మంది రైతులకు రూ.181 కోట్ల చెల్లింపులు జరిగాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 1.63 లక్షల మంది రైతులకు రూ.227 కోట్ల చెల్లింపులు జరిగాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 3.22 మంది లక్షల రైతులు ఉన్నారు. ఇందులో 3.6 లక్షల మంది రైతులకు రూ.370 కోట్ల చెల్లింపులు జరిగాయి. సోమ, మంగళవారాల్లో జరిగిన చెల్లింపుల వివరాలను వ్యవసాయ శాఖ వెబ్‌సెట్లో పొందుపరచలేకపోయింది. ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఇంకా ఎంత మందికి నగదు రావాల్సి ఉందో తెలియదన్నారు. రైతులు మాత్రం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు