logo

పిల్లలూ కథలు చదివేద్దామా.!

వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆన్‌లైన్‌ గేమ్స్‌, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకుండా వారిలో పఠనాశక్తి పెంచే దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎన్‌సీఈఆర్టీ సహకారంతో రూమ్‌ టూ రీడ్‌ సంస్థ ‘లిటరసీ క్లౌడ్‌’ మాధ్యమం ద్వారా ఇంటి వద్దనే ప్రాథమిక స్థాయి విద్యార్థులు కథలు చదువుకునేలా ఏర్పాటు చేసింది.

Updated : 18 May 2024 04:56 IST

వేసవి సెలవుల్లో పఠనాశక్తి పెంచుకునేందుకు అవకాశం

లిటరసీ క్లౌడ్‌ వెబ్‌ పేజీ

రాజోలి, న్యూస్‌టుడే: వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆన్‌లైన్‌ గేమ్స్‌, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకుండా వారిలో పఠనాశక్తి పెంచే దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎన్‌సీఈఆర్టీ సహకారంతో రూమ్‌ టూ రీడ్‌ సంస్థ ‘లిటరసీ క్లౌడ్‌’ మాధ్యమం ద్వారా ఇంటి వద్దనే ప్రాథమిక స్థాయి విద్యార్థులు కథలు చదువుకునేలా ఏర్పాటు చేసింది. వెబ్‌పేజీలో తెలుగుతో పాటు దేశంలోని అన్ని భాషల్లో వీటిని అందుబాటులో ఉంచారు. ఇవి విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు ఉపయోగపడతాయి. వివిధ కేటగిరీలు, స్థాయిలలో పుస్తకాలు ఉన్నాయి. కంప్యూటర్‌, చరవాణిలలో ఆన్‌లైన్‌లో చదవడంతో పాటు డౌన్‌లోడ్‌ చేసుకొని ఆఫ్‌లైన్‌లో చదువుకునే వెసులుబాటు ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,200కి పైగా ప్రభుత్వ పాఠశాలలుండగా, 2,450కి పైగా ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో 1 నుంచి 5వ తరగతి వరకు దాదాపు 1.80 లక్షల మందికి పైగా చదువుతున్నారు. వీరంతా ఈ కథల పుస్తకాలను చదివేయొచ్చు.

వెబ్‌సైట్‌ ఇలా ఉపయోగించాలి 

గూగుల్‌ సెర్ప్‌లో www.literacycloud.org వెబ్‌పేజీ ప్రారంభించాలి. లేదా విద్యాశాఖ ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా సంబంధిత వెబ్‌పేజీకి వెళ్లొచ్చు. ఇందులో మనకు కోరిన భాషను ఎంచుకోవాలి. తరువాత పిల్లలకు ఆసక్తి ఉన్న కథల పుస్తకాలు, నవలలు, సందేశాత్మక చిత్రాలు, ప్రత్యక్షమవుతాయి. పుస్తకాల్లో ఎక్కువగా చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. నీతి కథలు, యాక్టివిటీ, సిటిజన్‌షిప్‌, క్రియేటివిటీ అండ్‌ టెక్నాలజీ, హెల్త్‌, నేచురల్‌ సైన్సు, హిస్టరీ అండ్‌ కల్చర్‌, లీడర్‌ షిప్‌ మొదలైన కేటగిరీల్లో పుస్తకాలు, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చదవడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, భావవ్యక్తీకరణ సామర్థ్యాలు సైతం మెరుపడనున్నాయి. ఇలా కాకుండా 040-4520 9722 అనే నంబర్‌కు ఫోన్‌ చేస్తే రూమ్‌ టూ రీడ్‌ సంస్థ అందించే కథలను వినొచ్చు.


చదివిస్తే ఎంతో ఉపయోగం

రూమ్‌ టూ రీడ్‌ అనే సంస్థ చిన్న పిల్లల కోసం కథలు వెబ్‌పేజీలో అందుబాటులో ఉంచింది. తల్లిదండ్రులు చొరవ చూపి పిల్లల చేత వాటిని చదివించడం ద్వారా పఠనా సామర్థ్యం, సృజనాత్మకత పెరుగుతుంది. లిటరసీ క్లౌడ్‌కు సంబంధించి లింక్‌, క్యూ ఆర్‌ కోడ్‌ అన్ని పాఠశాలల హెచ్‌ఎంలకు పంపించడం జరిగింది. వారి ద్వారా తల్లిదండ్రులకు చేరుతుంది. లేదా వెబ్‌సైట్‌ ద్వారా చూడొచ్చు. వేసవి సెలవుల్లో ఇది ఎంతో ఉపయోగకరం.

ఎస్తేర్‌రాణి, జిల్లా విద్యాశాఖ సమన్వయ అధికారి, జోగులాంబ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు