logo

ప్రభుత్వ భూమి.. ఆక్రమణకు యత్నం..

శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు కలిసి వస్తోంది. ఎవరూ పట్టించుకోక పోవడంతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ మిగులు భూమిని ఆక్రమించుకుంటున్నారని మండలంలోని పరికిబండ,

Published : 24 Jan 2022 01:05 IST

ఆర్డీఓ దృష్టికి తెచ్చిన గ్రామస్థులు

ఫలితంగా సర్వేకు సన్నాహాలు

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే

పరికిబండ శివారులో చెట్లు కొట్టేసి చదును చేసిన భూమి

శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు కలిసి వస్తోంది. ఎవరూ పట్టించుకోక పోవడంతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ మిగులు భూమిని ఆక్రమించుకుంటున్నారని మండలంలోని పరికిబండ, తుపాకులపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనోహరాబాద్‌ మండలంలోని పరికిబండ పంచాయతీ పరిధి 611 సర్వే నంబర్‌లో 284 ఎకరాల అటవీ భూమి ఉంది. దాన్ని అనుకుని సర్వే నంబరు 209లో 84 ఎకరాల మిగులు భూమి ఉంది. అటవీ శాఖ అధికారులు వారి భూమి వరకు కందకం తీసి ఎవరూ ఆక్రమించుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. మిగులు భూమి చెంతన శివ్వంపేట మండలం బిజిలీపూర్‌ గ్రామ శివారులో హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత సీీఐకు చెందిన భూమి ఉంది. తన భూమికి చెంతనే ఉన్న మిగులు భూమిపై కన్నేసిన ఆయన అందులోని 25 ఎకరాల్లో చెట్లను తొలగించి చదును చేయించారు. అంతటితో సరిపెట్టుకోక ఎవరికీ అనుమానం రాని విధంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ మిగులు భూమి చుట్టూ కందకం తీయించారు. విశ్రాంత సీఐ 25 ఎకరాలను ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేపట్టగా, మిగిలిన భూమిని మరికొందరు ప్రజా ప్రతినిధులు మేము సైతం అంటూ జేసీీబీ యంత్రాలతో చదును చేయించి కబ్జాకు తెరలేపారు. ఈ నేపథ్యంలో శనివారం మండలానికి వచ్చిన తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌కు మిగులు భూమి ఆక్రమణపై ఇరుగ్రామాల ప్రజలు ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల ఫిర్యాదుకు స్పందించిన ఆయన సదరు భూమిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని మనోహరాబాద్‌ తహసీీల్దార్‌ బిక్షపతిని ఆదేశించారు. దీంతో ఆయన ఆదివారం సదరు భూమిని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. రెండు మండలాల సర్వేయర్లు, అటవీ శాఖ అధికారుల సమక్షంలో సోమవారం సమగ్ర సర్వే చేపట్టి మిగులు భూమి నిగ్గు తేలుస్తామన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు తేలితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని