logo

ఫలితాలు మెరుగయ్యేలా..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న వారిలో ఎక్కువ మంది పేదలే. ప్రైవేటు కళాశాలల్లో చదివేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడమే దీనికి కారణం. తమ పిల్లలను ప్రయోజకుల్ని చేయాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలల్లో చదివిస్తున్నారు.

Published : 04 Oct 2022 02:56 IST

ఇంటర్‌ విద్యార్థులకు ప్రతి వారం పరీక్షలు

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న వారిలో ఎక్కువ మంది పేదలే. ప్రైవేటు కళాశాలల్లో చదివేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడమే దీనికి కారణం. తమ పిల్లలను ప్రయోజకుల్ని చేయాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలల్లో చదివిస్తున్నారు. వాటిలో చదువుతున్న వారిలో ఎక్కువ మంది గట్టెక్కడం లేదు. దీంతో తల్లిదండ్రుల లక్ష్యం నెరవేరని పరిస్థితి. ఇంటర్‌ బోర్డు తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాల మెరుగుకు బాటలు పడనున్నాయి.

సామర్థ్యానికి మెరుగులు

జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో 8,364 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో కొందరు వ్యవసాయ పనులు, పార్ట్‌టైం పనులు చేసుకుంటూ తరగతులకు హాజరవుతున్నారు. గత విద్యా సంవత్సరం సగం మంది విద్యార్థులైనా ఉత్తీర్ణులు కాలేదు. ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితులే ఉంటున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం పెంపుపై ఇంటర్‌ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి వారం పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోనున్నారు.

ఎంసెట్‌, నీట్‌కు సన్నద్ధమయ్యేలా..

ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ఎంసెట్‌, నీట్‌కు విద్యార్థుల్ని సిద్ధం చేస్తారు. ఇందుకు అధిక మొత్తంలో ఫీజులు నిర్ణయిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు ఎలాంటి అవగాహన లేకుండా పరీక్షలు రాస్తుండటంతో ర్యాంకుల సాధనలో వెనుకబడుతున్నారు. ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ కళాశాలల్లోనూ ఎంసెట్‌, నీట్‌కు విద్యార్థుల్ని సన్నద్ధం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా అధ్యాపకులను నియమించడమా, ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకులతోనే శిక్షణ ఇవ్వడమా అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


బోర్డు ఆదేశాలు పాటిస్తాం

-గోవిందరామ్‌, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి

ఇంటర్‌ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతాం. విద్యార్థులకు ప్రతి వారం పరీక్షలు నిర్వహించడం ద్వారా సామర్థ్యాలను ముందే గుర్తించేందుకు వీలుంటుంది. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. ఎంసెట్‌, నీట్‌పై ఉన్నతాధికారుల ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని