logo

దివ్యమైన ఆత్మవిశ్వాసం..

అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారిలోని కొందరు.. ఏదైనా పని చేయాలంటే వెనుకాడుతుంటారు. కనీస ప్రయత్నమైనా చేయరు. అలాంటిది ఈ దివ్యాంగులు మాత్రం తమ పట్టుదలతో శక్తికి మించి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Updated : 04 Feb 2023 06:31 IST

అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారిలోని కొందరు.. ఏదైనా పని చేయాలంటే వెనుకాడుతుంటారు. కనీస ప్రయత్నమైనా చేయరు. అలాంటిది ఈ దివ్యాంగులు మాత్రం తమ పట్టుదలతో శక్తికి మించి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. లక్ష్య సాధనకు వైకల్యం అవరోధం కాదని ఇటీవల మేడ్చల్‌ జిల్లాలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు రచయిత, దివ్యాంగుడు నిక్‌ వుజిసిన్‌ ప్రేరణ కల్పించారు. ఈ నేపథ్యంలో స్ఫూర్తిగా నిలిచిన పలువురు దివ్యాంగులపై ‘న్యూస్‌టుడే’ కథనం.


పట్టుదలతో ముందడుగు

న్యూస్‌టుడే, కోహెడ గ్రామీణం: ఆత్మవిశ్వాసం, తపన ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్నారు కోహెడ మండలం గుండారెడ్డిపల్లికి చెందిన పాశం నరేందర్‌రెడ్డి. ఒంటి కాలితో నడవలేని పరిస్థితిలో ఉన్నా సాగు చేస్తూ కుటుంబాన్ని చేదోడుగా నిలిచారు. సైకిల్‌పై వెనుక కూర్చొని వెళ్లడం నేర్చుకున్నారు. ఆ తర్వాత ద్విచక్ర వాహనం కొనుగోలు చేసి నడపడం నేర్చుకున్నారు. ఇప్పుడు అన్నీ పనులు తానే చేసుకుంటున్నారు. వరితో పాటు మిర్చి సాగు చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. కొంత పొలం వాగు అవతల ఉండగా తెప్పపై నారును అక్కడికి తరలించారు. వ్యవసాయం చేస్తూ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తూ ఆదర్శంగా నిలిచారు.


ఇటు సాగు.. అటు సేవ..

- న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, కొండాపూర్‌: చిన్నప్పుడే పోలియో కారణంగా కాళ్లు చచ్చుబడ్డాయి. అయినా ధైర్యం కోల్పోకుండా సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచారు కొండాపూర్‌ మండలం గంగారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌. సేంద్రియ విధానంలో కూరగాయలు పండిస్తున్నారు. హరితగృహం ఏర్పాటుచేసి మెరుగైన దిగుబడులు సాధిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన చిరుధాన్యాలతో పాటు బియ్యం కూడా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. స్వామి వివేకానంద, సత్యసాయి సేవా సమితి ద్వారా సేవా కార్యక్రమాలు సైతం కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతోమంది అధికారులు ఈయన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ప్రశంసించారు.


అన్నదాత సేవలో సంతృప్తి

న్యూస్‌టుడే, కొండపాక గ్రామీణం: శారీరక వైకల్యం ఉన్నా మిగతా వారికంటే తానేమీ తక్కువ కాదంటూ ఏఈవో కొలువు సాధించి స్ఫూర్తిగా నిలిచారు పట్నం విష్ణుకుమార్‌. కొండపాక మండలం మర్పడ్గ క్లస్టర్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. పాపన్నపేట మండలం దౌలాపూర్‌కు చెందిన సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడే పోలియో బారిన పడ్డారు. కుడి కాలు వంగిపోయి నడిచేందుకు ఇబ్బందులు ఎదురైనా పొలాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ రైతులకు సూచనలు చేస్తున్నారు. తల్లిదండ్రులు యాదమ్మ-అంజయ్య. సోదరి సరిత ఉన్నారు. అగ్రికల్చర్‌ డిప్లొమా చదివి వ్యవసాయ విస్తరణాధికారి ఉద్యోగాన్ని సాధించారు. వైకల్యం ఉన్నా చురుగ్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు.


కుటుంబానికి చేదోడుగా..

న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలం చీలపల్లికి చెందిన గొట్టిముక్కల సంగారెడ్డి పుట్టుకతోనే దివ్యాంగుడు. ఆత్మస్థైర్యంతో జీవనం సాగిస్తున్నారు. మల్లారెడ్డి, వెంకటమ్మ ఏకైక కుమారుడైన ఈయనకు పోలియో కారణంగా రెండు కాళ్లు పనిచేయడం లేదు. పట్టుదలతో చదువుకుని డిగ్రీ పూర్తి చేశారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తుంటారు. తనవంతుగా కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే జీవనోపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. ఇంటికి సమీపంలో కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిపై ఆధారపడరు. మండల కేంద్రం నుంచి సరకులను తన బ్యాటరీ త్రిచక్ర వాహనంపై తెచ్చుకుంటారు. దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని