logo

సత్వర సేవలకు మార్గం

ఇన్నాళ్లు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కొనసాగిన డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) సేవలు త్వరలో విస్తరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సిద్దిపేటలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది.

Published : 01 Apr 2023 01:41 IST

సిద్దిపేటకు డీసీసీబీ ప్రాంతీయ కార్యాలయం
న్యూస్‌టుడే, సిద్దిపేట

ఇన్నాళ్లు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కొనసాగిన డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) సేవలు త్వరలో విస్తరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సిద్దిపేటలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఈమేరకు రాష్ట్ర సహకార బ్యాంకు సన్నాహకం చేస్తోంది. పాలన వికేంద్రీకరణతో సత్వర సేవలు సాధ్యం కానున్నాయి. ఇన్నాళ్లు వివిధ సందర్భాల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని డీసీసీబీ వరకు వెళ్లాల్సి వచ్చేది. నాబార్డు నుంచి డీసీసీబీకి, అక్కడి నుంచి అనుబంధ శాఖలకు, తద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు రుణ మొత్తాలు చేరుతాయి. వాటి ద్వారా రైతులకు, ఇతర వర్గాలకు లక్ష్యాల మేర రుణాలు అందిస్తుంటారు. డీసీసీబీల్లో అన్ని రకాల రుణాల చెల్లింపు, డిపాజిట్లు, లాకర్లు, ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తారు. 2016లోనే జిల్లా ఏర్పాటైనప్పటికీ వికేంద్రీకరణ జరగలేదు. సహకార సంఘాల ఛైర్మన్లు.. డీసీసీబీ పాలకవర్గంలో డైరెక్టర్లు, ఛైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అలాంటపుడు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఎంపికలు, ఎన్నికలు చేపట్టాల్సి వచ్చేది. సిద్దిపేటలో ఏర్పాటైతే ఇక్కడ ప్రత్యేకంగా ఎన్నిక జరిగే అవకాశం ఉంది. డీసీసీబీ శాఖల పరిధిలో రూ.3 లక్షల వరకు రుణ పరిమితిగా ఉంటుంది. అంతకుమించితే సంగారెడ్డి వరకు వెళ్లాల్సి వచ్చేది. సంఘాల అధ్యక్షులు, ఉద్యోగులు వివిధ సమావేశాలకు అక్కడి వరకు వెళ్తుంటారు.

మరింత బలోపేతం

జిల్లాలో ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) కంప్యూటరీకరణ పూర్తయింది. సంఘాల ద్వారా ధాన్యం, మొక్కజొన్న, కంది, శనగలు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. సభ్యులకు పంట, వ్యవసాయ అనుబంధ రుణాలు అందిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు విక్రయిస్తున్నారు. మూడు సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకులు కొనసాగుతున్నాయి. గత వానాకాలం సీజన్‌లో 190 కొనుగోలు కేంద్రాల ద్వారా 39,398 మంది రైతుల నుంచి 16.52 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు ద్వారా సత్ఫలితాలు సాధ్యం కానున్నాయి. చిరువ్యాపారులు, మహిళా సంఘాలకు, ఇతరత్రా రంగాల వారికి మేలు చేకూరనుంది. ఈ విషయమై డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు.

జిల్లాలో శాఖలు - 12
ఉద్యోగులు - 102
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు - 21
సభ్యత్వం పొందిన రైతులు - 1,88,125

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని