logo

ఆనవాయితీ కొనసాగింపు..

మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్‌ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం.

Published : 25 Apr 2024 02:54 IST

మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్‌ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. 1957లో పి.హన్మంత్‌రావు (కాంగ్రెస్‌), 1962లో జరిగిన ఎన్నికల్లోనూ గెలుపొందారు. 1971లో డా.మల్లికార్జున్‌ (కాంగ్రెస్‌) గెలుపొందగా, 1977లో ఆయన మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1999లో భాజపా తరఫున పోటీ చేసిన విజయాన్ని అందుకున్న ఆలే నరేంద్ర.. 2004లో భారాస (అప్పటి తెరాస) నుంచి బరిలో దిగి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ ఎంపీ స్థానం నుంచి, గజ్వేల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు చోట్ల గెలుపు అందుకున్నారు. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు అత్యధిక సీట్లు రాగా ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారానికి చెందిన కొత్త ప్రభాకర్‌రెడ్డికి గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ రెండోసారి ఎంపీగా విజయం సాధించారు.

 బాగారెడ్డి హ్యాట్రిక్‌..

 మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అత్యధికమార్లు ప్రాతినిధ్యం వహించింది కేవలం బాగారెడ్డి మాత్రమే. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన ఆయన మలిచెలిమ సర్పంచిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1991, 1996లో జరిగిన ఎన్నికల్లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. 1998లో కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడంతో తిరిగి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లోనూ బాగారెడ్డి ఎంపీగా గెలుపొందడం విశేషం. ఇలా ఆయన నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.

 న్యూస్‌టుడే, మెదక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు