Rohit Sharma: రోహిత్‌కు ఏమైంది? ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా రావడానికి కారణమిదే!

ముంబయి స్టార్‌ ఆటగాడు రోహిత్ శర్మ కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వెల్లడించడం గమనార్హం.

Updated : 04 May 2024 12:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో ముంబయికి అయిదు టైటిళ్లు అందించిన సారథి రోహిత్‌ శర్మను (Rohit Sharma) కోల్‌కతాతో మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్ల జాబితాలో చేర్చింది. లక్ష్య ఛేదన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ (11) కేవలం ఒక్క సిక్స్ మాత్రమే కొట్టి కుదురుకున్నట్లే కనిపించినా.. ఎక్కువసేపు నిలవలేదు. అయితే, ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లోనూ మైదానంలోకి దిగిన అతడు.. కోల్‌కతాతో పోరులో రాకపోవడంతో రోహిత్‌కు ఏమైందనే అనుమానం అభిమానుల్లో కలిగింది. అసలే ఐపీఎల్ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచ కప్‌ ఆడాల్సి ఉంది. దీంతో ముంబయి సీనియర్ ఆటగాడు పీయూశ్‌ చావ్లా (Piyush Chawla) మ్యాచ్‌ అనంతరం రోహిత్ ‘ఇంపాక్ట్‌’ పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘రోహిత్ తేలికపాటి వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని భావించాం. అందుకే, ఫీల్డింగ్‌ కోసం మైదానంలోకి దిగలేదు. బ్యాటింగ్‌ మాత్రమే చేశాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో పిచ్‌ను నిందించడానికి ఏమీ లేదు. చాలా బాగుంది. కేకేఆర్‌ బౌలర్లు చాలా అద్భుతంగా బంతులేశారు. మనం అనుకున్న విధంగా కొన్నిసార్లు అన్నీ జరగవు. మాకు ఇది బ్యాడ్ డే. రాబోయే మ్యాచుల్లో మంచి ప్రదర్శన చేస్తామనే నమ్మకం ఉంది. ఇక నుంచి గౌరవంగా టోర్నీ నుంచి నిష్క్రమించేలా ఆడతాం. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తామా? లేదా? అనే దాని గురించి ఆలోచించం. టీ20 క్రికెట్‌లో కేవలం ఒక్క దానిమీదనే ఆధారపడలేం. బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌ కూడా చాలా ముఖ్యం. ప్రతి జట్టుకూ వచ్చిన అవకాశాలను కాపాడుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని పీయూశ్‌ తెలిపాడు.

ముంబయి కథ ముగిసిందక్కడే: ఇర్ఫాన్‌

‘‘కోల్‌కతా 57/5 స్కోరుతో ఉన్నప్పుడు కోలుకొనే అవకాశం ఇచ్చిన ముంబయి తమ కథను అక్కడే ముగించేసింది. పేపర్‌ మీద చాలా బలంగా ఉన్న హార్దిక్‌ సేన మైదానంలో మాత్రం నాణ్యమైన ప్రదర్శన చేయలేకపోతోంది. హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తడం సహజమే. నమన్ ధిర్‌కు వరుసగా మూడు ఓవర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రధాన బౌలర్లను రంగంలోకి దించాల్సింది. మనీశ్ పాండే, వెంకటేశ్‌ అయ్యర్ భాగస్వామ్యంతో కోల్‌కతా మళ్లీ రేసులోకి వచ్చింది. అసలు 150 స్కోరైనా చేయడం కష్టమని భావించిన సమయంలో 170 లక్ష్యాన్ని నిర్దేశించింది’’ అని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని