logo

స్వీప్‌ నడవడి.. చైతన్య ఒరవడి

ప్రజాస్వామ్య పరిరక్షణలో ‘ఓటు’ పాత్ర అనిర్వచనీయం. పారదర్శకమైన పాలన సాకారం కావాలంటే.. ఒకవేళ ఎన్నికైన తరువాత నిలదీసే హక్కు పొందాలంటే.. ఓటు సద్వినియోగంతోనే సాధ్యం.

Updated : 30 Apr 2024 06:43 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట 

వర్గల్‌ మండలంలో ప్రదర్శన

ప్రజాస్వామ్య పరిరక్షణలో ‘ఓటు’ పాత్ర అనిర్వచనీయం. పారదర్శకమైన పాలన సాకారం కావాలంటే.. ఒకవేళ ఎన్నికైన తరువాత నిలదీసే హక్కు పొందాలంటే.. ఓటు సద్వినియోగంతోనే సాధ్యం. ఆ దిశగా ఓటర్లలో చైతన్యం రావాల్సి ఉంది. ఓటున్నా వేయకపోతే ఐదేళ్లు మదనపడాల్సిందే. ఈ తరుణంలో స్వీప్‌ (సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్ట్రోరల్‌ పార్టిస్పేషన్‌) ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో చైతన్యానికి తనవంతు పాత్ర పోషిస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాల తీరుతెన్నులపై ‘న్యూస్‌టుడే’ కథనం.

ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాలో ఏటా ఓటరు నమోదుకు చక్కటి స్పందన లభిస్తోంది. అయితే పోలింగ్‌లో మాత్రం కొన్ని ప్రాంతాలు వెనుకబడుతుండటం గమనార్హం. స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో పర్వాలేదనిస్తున్నా.. లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో అధికార యంత్రాంగం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. శతశాతం పోలింగ్‌ నమోదుకు ముందు నుంచి కృషి చేస్తున్నా.. పోలింగ్‌ రోజున ఫలితం కనిపించడం లేదు. హక్కు ఉన్నప్పటికి వివిధ కారణాలతో వినియోగించుకోవడం లేదు. ఈ క్రమంలోనే గతేడాది శాసనసభ ఎన్నికల ముందు నుంచి స్వీప్‌ యంత్రాంగం.. ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

వివిధ కార్యక్రమాలతో..

పోలింగ్‌ గడువుకు సమీపిస్తున్న తరుణంలో రానున్న రోజుల్లోనూ చైతన్య ఒరవడిని కొనసాగించేందుకు అధికారులు సంకల్పించారు. సిద్దిపేట జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌, దుబ్బాక పట్టణాల్లో పరుగు, యువతీ, యువకుల సమన్వయంతో ఫ్లాష్‌మాబ్‌లు చేపట్టారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జిల్లా, మండల సమాఖ్యలు, వీవోలతో సమావేశం నిర్వహిస్తూ ఓటు ప్రాధాన్యాన్ని చెబుతున్నారు. రంగోలి, గోరింటాకు ఇతర రూపాల్లో స్వీప్‌ తనదైన ప్రత్యేకతను చాటుతోంది.

ముందంజలో యువ కేంద్రం..

ఎన్‌వైకే (నెహ్రూ యువ కేంద్రం) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 నుంచే ప్రజా చైతన్యం తేవడం ఆరంభించారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌లో ఫ్లాష్‌మాబ్‌లు చేపట్టారు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఓట్‌ఫర్‌ రన్‌ నిర్వహించారు. మరోవైపు సంగారెడ్డిలో ఇంటింటా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్‌వైకే, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, యువజన సంఘాలు సంయుక్తంగా చైతన్యం తెస్తున్నాయి. పారదర్శకంగా ఓటు వేయాలంటూ వివరిస్తున్నారు. పట్టణాల్లో పోలింగ్‌ తక్కువ నమోదువుతున్న దృష్ట్యా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పోలింగ్‌ శాతం పెంచేందుకు ఇంటింటా తిరుగుతూ.. ఇతర ప్రాంతాల్లో ఉండే వారిని రావాల్సిందిగా కోరుతున్నారు. వాట్సాప్‌ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. వీధి నాటకాల ప్రదర్శనకు సన్నద్ధమవుతున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో యువకులు, కళాకారులను భాగస్వాములను చేయనున్నారు.

అన్ని వర్గాలకు చేరితే ఫలితం..

ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఒకప్పటితో పోల్చితే ఈసారి అన్ని వర్గాల వారిని చైతన్యం తేవడంలో ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించకపోవడం గమనార్హం. పోలింగ్‌కు మరో 11 రోజులే మిగిలి ఉన్న దృష్ట్యా అన్ని వర్గాల్లో ‘ఓటు’పై చర్చ చేపట్టేలా కృషి చేస్తే మెరుగైన ఫలితం రావడం ఖాయం. వినూత్న అంశాలకు ప్రాధాన్యం ఇస్తే పోలింగ్‌ శాతం పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. మూసధోరణికి భిన్నంగా యోచిస్తే.. ఇట్టే ఆకట్టుకోవచ్చు. యువ భాగస్వామ్యం పెంచాల్సిన ఆవశ్యకత ఉంది.

హక్కుపై అవగాహన..

స్వీప్‌ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో గ్రామీణ స్థాయి నుంచి అవగాహన కల్పించేందుకు అడుగులు వేస్తున్నారు. గ్రామాల్లో బీఎల్వోలు ఇంటింటికి తిరుగుతూ ఓటు ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తున్నారు. సీ-విజిల్‌ యాప్‌ ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో కళాకారులతో కళాజాత కార్యక్రమాలు నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. మున్సిపాలిటీల్లో హోర్డింగ్‌ల ద్వారా ప్రదర్శన చేపట్టారు. టోల్‌ ఫ్రీ నెం.1950పై చైతన్యం తీసుకొచ్చారు. సీ-విజిల్‌ యాప్‌ ప్రాధాన్యాన్ని చెబుతున్నారు. విద్యాసంస్థల్లో ఓటరు నమోదు, చైతన్య కార్యక్రమాలు, అన్ని వర్గాలు ఓటు వేసేలా ప్రచారం చేపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు