logo

‘శత’శాతం ప్రగతి..!

నిర్దిష్ట ప్రణాళికకు శ్రమించే తత్వం తోడయితే.. సత్ఫలితాలు సాధ్యం. ఉపాధ్యాయుల అనుశీలన.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనేక సర్కారు బడులు శతశాతం ఫలితాలు సాధించి భళా అనిపించాయి.

Updated : 01 May 2024 05:58 IST

‘పది’ వార్షిక ఫలితాల్లో సత్తా చాటిన సర్కారు బడులు

 శత శాతం ఫలితాలు సాధించిన మెదక్‌ కస్తూర్బా పాఠశాల

న్యూస్‌టుడే, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి మున్సిపాలిటీ: నిర్దిష్ట ప్రణాళికకు శ్రమించే తత్వం తోడయితే.. సత్ఫలితాలు సాధ్యం. ఉపాధ్యాయుల అనుశీలన.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనేక సర్కారు బడులు శతశాతం ఫలితాలు సాధించి భళా అనిపించాయి. సకాలంలో పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేసిన నిర్వాహకులు.. పునఃశ్చరణ ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దారు. వెనుకబడిన అంశాల్లో సందేహాలను నివృత్తి చేసి వెన్నుతట్టారు. తరచూ పరీక్షలు నిర్వహించి స్థైర్యాన్ని పెంచారు. ఉపాధ్యాయ బృందం సమష్టి తత్వం.. ఎప్పటికప్పుడు విద్యార్థులకు చేసిన దిశానిర్దేశం అనేక పాఠశాలల్లో ‘పది’లో మెరుగైన ఫలితాలను సాకారం చేసింది.

 ఫలితాలతో దూసుకెళ్లి

ఏటా సిద్దిపేట జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు శతశాతం ఫలితాలతో దూసుకెళ్తున్నాయి. జిల్లాలో మొత్తం 26 మండలాలు ఉండగా.. తొమ్మిది మండలాల్లోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులంతా పాసవడం గమనార్హం. అక్కన్నపేట, చిన్నకోడూరు, ధూల్మిట్ట, కొండపాక, మద్దూరు, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, రాయపోల్‌ మండలాలు ఈ ఘనతను సాధించాయి. జిల్లా వ్యాప్తంగా జడ్పీ, ఉన్నత పాఠశాలలు - 179, గురుకులాలు - 27, కస్తూర్బాలు-20, ఆదర్శ - 11, ఆశ్రమ -1 పాఠశాలలు శతశాతం ఫలితాలను సాధించాయి. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ సారి అనేక పాఠశాలలు మెరుగయ్యాయి. ప్రత్యేక తరగతుల నిర్వహణ, అధికారుల ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైంది.

ప్రత్యేక శ్రద్ధ వహించి..

మెదక్‌ జిల్లాలో ఈసారి పదిలో ఉత్తమ ఫలితాలు వచ్చాయి. ఉత్తమ ఫలితాల సాధనకు సర్కారు బడుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, నిత్యం పరీక్షలు నిర్వహించి, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్రత్యేకంగా మెటీరియల్‌ అందించారు. 37 జిల్లా పరిషత్తు పాఠశాలలు, ఎనిమిది కస్తూర్బా, 3 చొప్పున ఆదర్శ పాఠశాలలు, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ గురుకులాలు, 2 గిరిజన గురుకులాలు, ఒక మైనార్టీ పాఠశాలు శతశాతం సాధించిన జాబితాలో ఉన్నాయి. గత విద్యాసంవత్సరం కంటే ఈ సారి 12 పాఠశాలల్లో శతశాతం ఫలితాలు వచ్చాయి.

పాఠశాలకో ఇన్‌ఛార్జి

సంగారెడ్డి జిల్లాలో వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు గతంలో కంటే ఈ సారి పెరిగాయి. ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో ప్రత్యేకంగా మూడు నెలల పాటు పాఠాల బోధనకు ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించారు. జిల్లా, మండల స్థాయి అధికారులకు ఒక్కో పాఠశాలను ఇన్‌ఛార్జిగా నియమించారు. వారంతా వారంలో మూడు రోజులు పిల్లల ప్రగతిని పరిశీలించి కల్టెకర్‌కు నేరుగా నివేదికలు ఇచ్చారు. ఇలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఫలితాలు సాధ్యమయ్యాయి. ఉపాధ్యాయులు వెనుకబడిన వారిని దత్తత తీసుకొని చదివించారు. ప్రభుత్వ 124, కస్తూర్బా 12, ఆదర్శ పాఠశాలలు 8, సాంఘిక సంక్షేమ గురుకులాలు 10, బీసీ గురుకులాలు 10 వరకు శతశాతం సాధించిన వాటిలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని