logo

కర్షకుల కరుణకు నేతల ఆరాటం

లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. పోలింగ్‌ సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. జిల్లా ఓటర్లలో అత్యధికులది రైతు కుటుంబాల నేపథ్యమే.

Updated : 08 May 2024 06:05 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. పోలింగ్‌ సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. జిల్లా ఓటర్లలో అత్యధికులది రైతు కుటుంబాల నేపథ్యమే. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు అన్నదాతలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో వీరికి ప్రాధాన్యం ఇచ్చాయి. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని అన్ని పార్టీలు నమ్మబలుకుతున్నాయి. రైతుల మద్దతు కూడగడితే గట్టెక్కడం సులభమని అభ్యర్థులు భావిస్తున్నారు.

వివరిస్తూ.. అభ్యర్థిస్తూ..

 కాంగ్రెస్‌: వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకాన్ని తెచ్చింది తామేనని, ఇప్పుడు 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నామని కాంగ్రెస్‌ నేతలు ప్రచారంలో చెబుతున్నారు. రైతు భరోసా పేరుతో కర్షకులకు ఎకరానికి ప్రతి సంవత్సరం 15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేల హామీలను అమలు చేస్తామని వివరిస్తున్నారు. వరి ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని, పంద్రాగస్టు నాటికి రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని పేర్కొంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

భాజపా: దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రతి రైతుకు ఏటా రూ.6వేలు పంపిణీ చేస్తున్నామని భాజపా నేతలు ఓటర్లకు చెబుతున్నారు. ఈ పథకం కొనసాగుతుందని వివరిస్తున్నారు. పంట నష్టాన్ని కచ్చితంగా అంచనా వేస్తామని రైతులకు వేగంగా పరిహారం అందిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. పీఎం ఫసల్‌ బీమా పథకం మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని వివరిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు గిడ్డంగుల ఏర్పాటుకుతో అన్నదాతలకు అండగా ఉంటామని పేర్కొంటున్నారు.

భారాస: రైతు బంధు పథకాన్ని భారాస ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చామని, రైతులకు ఎకరానికి రూ.10వేల సాయాన్ని అందించామని గుర్తుచేస్తున్నారు. వ్యవసాయానికి  24 గంటల ఉచిత విద్యుత్తును అమలు చేశామని చెబుతున్నారు. పట్టా ఉన్న వారు మృతి చెందితే రైతు బీమా కింద రూ.5లక్షల పరిహారం చెల్లిస్తూ కుటుంబానికి అండగా నిలిచామని, ఈ ఎన్నికల్లో గెలిపిస్తే రైతుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రచారం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు