logo

ప్రజాస్వామ్య ఆయువుపట్టు.. ఓటరన్నా నిలబెట్టు

ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.. ఓటు. దాని సద్వినియోగంతోనే మనతో పాటు సమాజానికి మేలు చేకూరుతుంది. ఇదే నినాదంతో పలు సంస్థలు, సంఘాల ప్రతినిధులు ఓటరు చైతన్యానికి కంకణబద్ధులయ్యారు.

Updated : 08 May 2024 06:07 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట: ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.. ఓటు. దాని సద్వినియోగంతోనే మనతో పాటు సమాజానికి మేలు చేకూరుతుంది. ఇదే నినాదంతో పలు సంస్థలు, సంఘాల ప్రతినిధులు ఓటరు చైతన్యానికి కంకణబద్ధులయ్యారు. శతశాతం పోలింగ్‌ నమోదైతే కలిగే ప్రయోజనాలను ఆయా సంస్థలు, సంఘాల నిర్వాహకులు గుర్తుచేస్తున్నారు. పారదర్శకత, మెరుగైన పాలనతో కూడిన నవ భారత నిర్మాణంలో అంతా భాగస్వాములు కావాలంటూ అవగాహన కల్పిస్తుండటం విశేషం.

ఎన్‌వైకే ఆధ్వర్యంలో..

నడుస్తూ.. చైతన్యం తెస్తూ..

 ఓటు చైతన్యానికి నడుం బిగించింది సిద్దిపేటలోని మార్నింగ్‌ వాకర్స్‌ అసోసియేషన్‌. ఇందులో పట్టణానికి చెందిన ఉద్యోగులు, వ్యాపారులు 31 మంది సభ్యులు ఉన్నారు. నిత్యం ఉదయాన్నే వాహ్యాళికి వెళ్లే వారంతా సామూహిక చైతన్యానికి శ్రీకారం చుట్టారు. వజ్రాయుధమైన ఓటు హక్కును అందరూ పారదర్శకంగా వినియోగించుకోవాలనే నినాదంతో ప్రదర్శనలు చేపట్టారు. జీవనానికి ఆక్సిజన్‌ (02) ఎంత అవసరమో.. ప్రజస్వామ్య పరిరక్షణకు ఓటు అంతేనని ప్రదర్శన నిర్వహించారు. కోమటిచెరువు వద్ద నెక్లెస్‌ మార్గంలో నడకకు వచ్చే వారికి అవగాహన కల్పిస్తున్నారు. మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


 ఆవశ్యకత చాటి చెప్పేలా..

లఘుచిత్రంతో అవగాహన హుస్నాబాద్‌కు చెందిన పున్న రమేశ్‌, అక్కన్నపేట మండలం గౌరవెల్లికి చెందిన తాడూరి సురేష్‌, కల్లెం లక్ష్మణ్‌లు ‘ఓట్ల పండగ’ పేరిట లఘుచిత్రాన్ని నిర్మించారు. ఇందులో వీరే నటించారు. సాధారణంగా ఎన్నికలనగానే జనమంతా ఓట్ల పండగ వచ్చిందని సంబర పడుతుంటారు. డబ్బు, మద్యం, మాంసం పంచుతారని, అన్నింటి కంటే ఓట్ల పండగ పెద్దదిగా భావిస్తారు. నాయకులు ప్రలోభాలకు గురిచేస్తుంటారు. వాటికి లొంగిపోతే ఏం జరుగుతుందన్న అంశాన్ని ఇందులో ప్రస్తావించారు. విలువైన ఓటు మన ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని, నిస్వార్థంగా ఓటేస్తేనే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవచ్చన్న మంచి సందేశంతో ఓటర్లకు అవగాహన కల్పించారు.

- న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం


లఘుచిత్రంతో అవగాహన

హుస్నాబాద్‌కు చెందిన పున్న రమేశ్‌, అక్కన్నపేట మండలం గౌరవెల్లికి చెందిన తాడూరి సురేష్‌, కల్లెం లక్ష్మణ్‌లు ‘ఓట్ల పండగ’ పేరిట లఘుచిత్రాన్ని నిర్మించారు. ఇందులో వీరే నటించారు. సాధారణంగా ఎన్నికలనగానే జనమంతా ఓట్ల పండగ వచ్చిందని సంబర పడుతుంటారు. డబ్బు, మద్యం, మాంసం పంచుతారని, అన్నింటి కంటే ఓట్ల పండగ పెద్దదిగా భావిస్తారు. నాయకులు ప్రలోభాలకు గురిచేస్తుంటారు. వాటికి లొంగిపోతే ఏం జరుగుతుందన్న అంశాన్ని ఇందులో ప్రస్తావించారు. విలువైన ఓటు మన ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని, నిస్వార్థంగా ఓటేస్తేనే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవచ్చన్న మంచి సందేశంతో ఓటర్లకు అవగాహన కల్పించారు.

- న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం


ఓటర్లంతా పోలింగ్‌ కేంద్రాల బాట పట్టించాలన్న ఉద్దేశంతో గజ్వేల్‌కు చెందిన రాయరావు విశ్వేశ్వరరావు ఇటీవల ఓ పాట రాసి చిత్రీకరించారు. దాన్ని ఇటీవల సిద్దిపేట కలెక్టర్‌ మనుచౌదరి ఆవిష్కరించారు. విశ్వేశ్వరరావు ఓ ప్రైవేటు కళాశాలలో పని చేస్తూనే రచయిత, స్వరకర్తగా రాణిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు తనవంతు కృషిగా ఓ పాట రాశారు. ఓటు వేయాల్సిన ఆవశ్యకతను ఇందులో చాటిచెప్పారు. ప్రలోభాలకు లొంగితే ఎంత నష్టమని వివరించారు. ఓటింగ్‌ శాతం పెంచేందుకు దోహదం చేస్తుందని విశ్వేశ్వరావు ధీమా వ్యక్తం చేశారు.


ప్రచారం చేస్తూ.. ఆరా తీస్తూ..

గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ జిల్లాలోని 50 గ్రామాల్లో తక్కువ పోలింగ్‌ శాతం నమోదైంది. దీనిపై జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌రాజ్‌ వాటిపై ప్రత్యేక దృష్టి సారించి.. ఈసారి పోలింగ్‌ పెంచేందుకు కంకణం కట్టుకున్నారు. ప్రచార రథం ద్వారా సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో కళాకారులు ఓటు హక్కు వినియోగంపై ప్రచారం నిర్వహిస్తున్నారు. పాటల ద్వారా చైతన్యం తీసుకొస్తున్నారు. అంతే కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశారా, లేదా అని ఆరా తీస్తున్నారు. నివేదిక ప్రకారం తగు చర్యలు తీసుకుంటున్నారు.

- న్యూస్‌టుడే, మెదక్‌


మరువొద్దని.. అమ్ముకోవద్దని..

నిస్వార్థంగా ఓటేయాలని, సమర్థ నేతను ఎన్నుకోవాలంటూ తన పాటలతో అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు బెజ్జంకి మండలం గుండారానికి చెందిన కవి, గాయకుడు బుర్ర సతీష్‌. మూడు వారాల కిందట ‘ఓటరన్నా మరువబోకు ఓటు.. ఓటు తప్పకుండా వేయాలి ఓటు.. ఓటు కాలరాసుకుంటే నీ బతుకు చేటు’ అంటూ రాసిన గీతాన్ని చంద్రశేఖర్‌ ఆజాద్‌ గానంతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో విడుదల చేయగా మంచి స్పందన లభించింది. జబర్దస్త్‌ ఫేమ్‌ వెంకీ ఇందులో నటించగా 23 వేల మంది వీక్షించారు. ఏడాది క్రితం ‘ఎంత పని జేస్తివే ఓటమ్మా.. నన్ను ఆగం చేసింది కాదే నోటమ్మా’ అనే పాటను సతీష్‌ సొంత యూట్యూబ్‌ ఛానెల్‌లో విడుదల చేశారు. దీన్ని 10 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం. 

- న్యూస్‌టుడే, బెజ్జంకి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు