logo

ఆరుగాలం పంట.. ఆగమాగం

జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరుబయట ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.

Published : 08 May 2024 03:11 IST

వడియారం కొనుగోలు కేంద్రంలో వర్షం నీటిలోనే కుప్పలు

మెదక్‌, టౌన్‌, రూరల్‌, నర్సాపూర్‌, చేగుంట, పెద్దశంకరంపేట, కొల్చారం, అల్లాదుర్గం, తూప్రాన్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరుబయట ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల వరదల్లో కొట్టుకుపోవడంతో.. కాపాడుకొనేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. మెదక్‌లో వడగళ్ల వాన కురిసింది. దీంతో పట్టణంలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మల్కాపూర్‌ తండాకు చెందిన ధరావత్‌ రూప్‌ సింగ్‌ ఇంటి సిమెంట్‌ రేకులు పగిలిపోయాయి. దీంతో ఇంట్లో ఉన్న అతని అక్కకు స్వల్ప గాయాలయ్యాయి. చేగుంట, నార్సింగి మండలాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపై ఎండబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. వడియారం కొనుగోలు కేంద్రంలో వడ్లు పూర్తిగా నీటిలోనే ఉన్నాయి. పెద్దశంకరంపేట మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కప్పడానికి టార్పాలిన్లు లేక తడిసిపోయింది. కొల్చారంలోని కొనుగోలు కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడం, లారీలు సమయానికి రాకపోవడంతో ధాన్యం బస్తాలు కాపాడుకోవడానికి అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌ గ్రామ శివారులో ఆటోపై విద్యుత్‌ స్తంభం పడింది. ఆటో నడుపుతున్న తూప్రాన్‌ చెందిన బాలరాజుకు గాయాలయ్యాయి. నర్సాపూర్‌లోని పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. పలు చోట్ల కుప్పల చుట్టూ నీరు చేరింది. అల్లాదుర్గం మండలంలోని కాయిదంపల్లి, రాంపూర్‌, గడిపెద్దాపూర్‌ గ్రామాల్లో కొంత తడిసింది.  

కొల్చారం మండలంలో..

అన్నదాతలు జాగ్రత్తలు తీసుకోవాలి  

 వాతావరణ శాఖ సూచన మేరకు రానున్న మూడు రోజుల పాటు అకాల వర్షాలు ఉన్నందున రైతులు ధాన్యం రాశులు తడవకుండా భద్రపర్చుకోవాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓపీఎంఎస్‌ చేసిన ప్రకారం, రైస్‌మిల్లర్ల కేటాయింపు చేసిన విధంగా తూకం పూర్తి చేసిన ధాన్యపు బస్తాలను రవాణా చేయాలని నిర్వాహకులకు సూచించారు.

 ఉపాధికొస్తే ఉసురు పోయింది

కౌడిపల్లి, న్యూస్‌టుడే: వర్షంతో పాటు ఈదురు గాలులకు నిర్మాణంలో ఉన్న గోడ కూలి.. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్‌లో మంగళవారం రాత్రి ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు, వివరాల మేరకు.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన మాదాసు నాగ బాల గంగాధరరావు(38), తూర్పు గోదావరి జిల్లా కడియంకు చెందిన చింతపల్లి సుబ్రమణ్యం(40) 15 ఏళ్ల క్రితం మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలోని దేవేందర్‌ కాలనీకి వచ్చారు. తాపీ మేస్త్రీలుగా పనిచేస్తున్నారు. రాయిలాపూర్‌లోని ఫాంహౌజ్‌లో మంగళవారం ఇద్దరూ గోడకు ప్లాస్టరింగ్‌ చేశారు. ఈదురు గాలులు, వర్షం రావడంతో ఆ గోడ పక్కనే నిల్చున్నారు. గోడ కూలి మీద పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గంగాధరరావుకు భార్య దేవి, నాలుగేళ్లలోపు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుబ్రమణ్యంకు భార్య శ్రీదేవి, కొడుకు, కుమార్తె ఉన్నారు.
ఇద్దరి మృతికి కారణమైన కోళ్లఫారం గోడను సిమెంట్‌ ఇటుకలతో 15 అడుగుల మేర 20 రోజుల కిందటే నిర్మించారు. మేస్త్రీలైన బాలగంగాధరరావు, చింతపల్లి సుబ్రమణ్యంలు గోడకు ప్లాస్టరింగ్‌ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


పిడుగుపాటుకు ఇద్దరి మృతి

కొండపాక గ్రామీణం: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంగళవారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన ప్రకారం కుకునూరుపల్లికి చెందిన రైతు కుమ్మరి మల్లేశం(36) పొలం వద్దకు పాలు పిండేందుకు సాయంత్రం వెళ్లాడు. అదే సమయంలో భారీ వర్షం కురిసింది.  సమీపంలోని వేపచెట్టు కిందకు వెళ్లగా పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అందోలు మండలం ఎర్రారం గ్రామానికి చెందిన బోయిని పాపయ్య (52) మంగళవారం సాయంత్రం పశువులను మేపేందుకు గ్రామ శివారులోకి వెళ్లాడు. వాటిని ఇంటికి తోలుకొస్తుండగా  వర్షం కురిసింది. పిడుగు పడడంతో ఆయన జేబులోని చరవాణి పేలిపోయి ఘటనా స్థలిలోనే మృతి చెందాడు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని