logo

నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం

దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది.

Published : 17 May 2024 02:47 IST

జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందం ఏర్పాటు

పత్తి విత్తనాలు...

న్యూస్‌టుడే, గజ్వేల్‌: దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. ఈ మేరకు జిల్లాలో పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ బృందం ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ మనుచౌదరి ఆమోదం తెలిపినట్లు జిల్లా డీఏవో శివప్రసాద్‌ వెల్లడించారు. ఎక్కడైనా బీటీ-3 పత్తి విత్తనాలు, అనుమతి లేని మొక్కజొన్న, ఇతర పంట విత్తనాలు విక్రయించకుండా బృందం నిరంతర నిఘా ఉంటుందని అన్నారు.

రైతులకు అంటగట్టి.. పుడమిని నమ్ముకొని సేద్యం చేసే అన్నదాతలను ఏటా కల్తీ, నకిలీ విత్తనాలు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు ఈ దందాను సాగిస్తున్నారు. ఏటా వానాకాలం సీజన్‌కు ముందే గ్రామాల్లో తిష్ఠ వేస్తున్నారు. హుస్నాబాద్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, ములుగు, వర్గల్‌ ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతులను మోసగిస్తున్నారు. మహారాష్ట్ర, ఏపీలోని గుంటూరు, ఇతర ప్రాంతాల నుంచి అనుమతి లేనివి, నకిలీ పత్తి(బీటీ-3) విత్తనాలను సీజన్‌కు ముందే తీసుకొచ్చి గ్రామాల్లో నిల్వచేసి వర్షాలు రాగానే అదును చూసి విక్రయిస్తున్నారు. జాతీయ రహదారికి చేరువలో సిద్దిపేట, మెదక్‌ జిల్లాలు ఉండటంతో సరుకు రవాణా చేసే వాహనాల్లో విత్తనాలు తీసుకొచ్చి సీజన్‌ ప్రారంభం కాగానే వివిధ గ్రామాల్లో విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. కలుపు నాశని మందులను తట్టుకునే జన్యుమార్పిడి విత్తనాలైన బీటీ-3 పత్తి విత్తనాలు సాగు చేస్తే శ్రమ తక్కువ అని దళారులు చెప్పటంతో రైతులు ఆశక్తి చూపుతున్నారు. గత కొన్నేళ్లుగా జిల్లాలో ఈ విత్తన సాగు విస్తరిస్తూ వస్తోంది. గ్లైఫోసెట్‌(గడ్డి మందు) పిచికారి చేయటం వల్ల పంట ద్వారా పత్తితో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ముఖ్యంగా రైతులు, ప్రజలు క్యాన్సర్‌ బారినపడే అవకాశం ఉందని ప్రభుత్వం ఈ విత్తనాల సాగును నిషేధించింది. అయినప్పటికీ కలుపు నివారణ చర్యలు సులభం కావటంతోపాటు పత్తి దిగుబడి ఎక్కువగా ఉంటుందని దళారుల ప్రచారంతో రైతులు ఈ విత్తనాలపై ఆసకి చూపుతున్నారు. ప్రస్తుతం సాధారణ బీటీ-2 రకం విత్తన సంచి ధర రూ.864 వరకు ఉంటే బీటీ-3 విత్తనాలు రూ.1500ల వరకు అమ్ముతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ నకిలీ, కల్తీ విత్తనాల విక్రయాలను ఆదిలోనే అరికట్టి రైతులకు దన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది.

రెండు జిల్లాల్లో సాగు ఇలా..

పది రోజుల్లో రోహిణీ కార్తె రానుంది. వానాకాలం సీజన్‌ ఆరంభం కానుంది. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల పరిధిలో దాదాపు 4.50 లక్షల మంది రైతులున్నారు. రెండు జిల్లాల్లో కలిపి వానాకాలం సీజన్‌లో సుమారుగా 7.71 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా పత్తి దాదాపుగా 2 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు రైతులు పత్తి విత్తనాలకే రూ.34.56 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. మొక్కజొన్న, వరి తదితర విత్తనాలకు మరో రూ.1.50 కోట్ల వరకు ఖర్చు చేస్తుంటారు. పంట వేసిన తరువాత విత్తులు సరిగా మొలకెత్తకపోవటం, పంట ఏపుగా పెరిగినా పూత, కాత రాకపోవటం తదితర ప్రతికూలతతో నకిలీ విత్తనాలు వెలుగు చూస్తుంటాయి. ఈ క్రమంలో ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందేందుకు రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటంతో నష్టాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వమే ముందుగా నకిలీలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.

కఠిన చర్యలు తప్పవు: శివప్రసాద్‌, డీఏవో

నకిలీ విత్తనాలు ఎవరు అమ్మినా కఠిన చర్యలు తప్పవు. బీటీ-3 పత్తి విత్తనాలపైనా ప్రత్యేక నిఘా పెట్టాం. పోలీసుల సహకారంతో టాస్క్‌ఫోర్స్‌ బృందాల ఏర్పాటుకు కలెక్టర్‌ అనుమతించారు. ఏర్పాటు చేసి నకిలీలను అరికడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని