logo
Published : 03/12/2021 03:13 IST

ప్రభుత్వ భూముల్లో కొనసాగుతున్న ఆక్రమణలు


మట్టపల్లిలో పులిచింతల ముంపు బాధితులకు కేటాయించిన స్థలాల్లో అక్రమ కట్టడాలు

మఠంపల్లి, న్యూస్‌టుడే: కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తోంది. పులిచింతల ముంపు బాధితుల కోసం కేటాయించి హద్దు రాళ్లు పాతిన స్థలాల్లో అక్రమార్కులు యథేచ్చగా ఇళ్లు నిర్మించుకుంటున్నా తమకు పట్టనట్లు వ్యవహరిస్తోంది. రాజకీయ వత్తిళ్ల కారణంగానే సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలున్నాయి. మట్టపల్లి గ్రామం నడిబొడ్డున సర్వే సంఖ్య 1లో సర్కారు భూమి 10.24 ఎకరాలు ఉంది. పదేళ్ల కిందటే మూడు ఎకరాలు ఆక్రమణకు గురికాగా అనంతర కాలంలో 2 ఎకరాల్లో స్థానికులు ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన 5.24 ఎకరాల్లో పులిచింతల ముంపు బాధితులైన 54 మందికి కలెక్టర్‌ ఆదేశాల మేరకు అక్టోబరులో ఇంటి స్థలాలు కేటాయించారు. వీటిని అధికారికంగా పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ఈ విషయం తెలుసుకున్న కొంతమంది అక్రమార్కులు కొద్ది రోజులుగా ఈ స్థలాల్లో రాళ్లు తోలించి ఇళ్లు కడుతున్నారు. గత నెలలో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్న సమయంలోనూ ఆక్రమణదారులు అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో సర్వే పూర్తిచేసి ముంపు బాధితుల కోసం స్థలాలు కేటాయించారు. ఇక్కడ గతంలో ‘ఇది ప్రభుత్వ భూమి’ అని ఓ బోర్డును ఏర్పాటు చేశారు. 2017లో దాన్ని ఆక్రమణలకు పాల్పడే వారే తొలగించారు. మళ్లీ బోర్డును పెట్టాలన్న ఆలోచన అధికారులకు రాకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ విషయంపై తహసీల్దార్‌ లక్ష్మణ్‌బాబు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కూడా అక్రమ నిర్మాణాల విషయంలో బాధ్యత తీసుకోవాలన్నారు. వారి అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేయకూడదన్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రయోజనం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్రమ నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని