logo

రైతుల ఆశలపై నీళ్లు

మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో సగటున 15 సెం.మీ. వర్షపాతం

Published : 18 Jan 2022 02:40 IST

వర్షాలకు దెబ్బతిన్న పంటలు

ఈనాడు, నల్గొండ - నూతనకల్‌, న్యూస్‌టుడే

నూతనకల్‌ మండలం టీక్యాతండాలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన వరిపైరు

మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో సగటున 15 సెం.మీ. వర్షపాతం నమోదవడంతో నూతనకల్‌, మోతె, చివ్వెంల, మద్దిరాల, నడిగూడెం, ఆత్మకూరు(ఎస్‌), సూర్యాపేట తదితర మండలాల్లోని మిర్చి పంట మొత్తం పాడైంది. మేళ్లచెరువు, దామరచర్ల, పాలకవీడు, మఠంపల్లి, అడవిదేవులపల్లి, తుంగతుర్తి, తిరుమలగిరి, హుజూర్‌నగర్‌, చింతలపాలెం మండలాల్లోని మిర్చి పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది పూత దశలో పంట బాగుందనుకునేలోపే అకాల వర్షాలకు నీటమునగడంతో మూడు జిల్లాల్లో సుమారు 3వేల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే మిర్చి, ఇతర పంటలకు దాదాపు రూ.2 కోట్ల వరకు నష్టం జరిగిందని తెలిసింది.

చేపల చెరువులా మారిన పంట పొలాలు

చెరువులు అలుగు పోయటంతో..

నూతనకల్‌, మోతె, నడిగూడెం, సూర్యాపేట, చివ్వెంల మండలాల్లో ఇటీవల రైతులు నాట్లు వేశారు. వర్షాలకు పలు చెరువులు రాత్రికిరాత్రే అలుగు పోయడంతో నాట్లన్నీ మునిగిపోయాయి. అత్యధికంగా నూతనకల్‌, మద్దిరాల, సూర్యాపేట మండలాల్లో వరిపొలాలకు నష్టం వాటిల్లింది. సూర్యాపేట జిల్లాలో 8వేల ఎకరాల మిర్చి, వరిపైర్లు దెబ్బతిన్నట్లు అనధికారిక అంచనా. నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు మంగళవారం నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ప్రభుత్వ ఆదేశంతో వరంగల్‌ జిల్లాల్లో మంత్రుల బృందం పర్యటించనున్న దృష్ట్యా సూర్యాపేట జిల్లాలో జరిగిన నష్టాన్ని పరిశీలించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. మోతె మండలం నామాపురం, విభళాపురం మధ్య చెరువు నీళ్లతో రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట పట్టణంలోని పలు కాలనీలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. మానసనగర్‌, ప్రియాంక కాలనీలు ఇంకా చెరువులను తలపిస్తున్నాయి. పురపాలక యంత్రాంగం ఎప్పటికప్పుడు వరద నీటిని తోడేస్తున్నా పలు కాలనీల ప్రజలు ఇంకా ముంపుతో సతమతమవుతూనే ఉన్నారు.

చేపలచెరువులా మారింది

- లావుడ్యా లవకుశ, రైతు, టీక్యాతండా

రెండు ఎకరాల వరిపైరు వరదకు కొట్టుకుపోయింది. పొలమంతా చేపల చెరువులా మారింది. సుమారు రూ.90వేల వరకు పెట్టుబడి నష్టపోయాను. అధికారులు పరిహారం అందించి ఆదుకోవాలి.


కొట్టుకుపోయిన పంట పొలాన్ని చూపుతున్న ఈ రైతు నూతనకల్‌ మండలం టీక్యాతండాకు చెందిన లావుడ్యా నర్సింహ. ఎకరంన్నర పొలంలో ఇటీవల రూ.70 వేల వరకు ఖర్చుచేసి నాటు వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పక్క గ్రామం కందగట్ల చెరువు అలుగు పోయడంతో తన ఎకరంన్నర పొలంతో పాటు సుమారు 50 ఎకరాల్లో పైరు కొట్టుకుపోయిందని, నాట్లు వేసి నాలుగు రోజులైనా కాకముందే పెట్టిన పెట్టుబడి నష్టపోయామని కన్నీటిపర్యంతమయ్యారు.


ఈ ఫోటోలో కనిపిస్తున్న రైతు పేరు నెల్లుట్ల వీరస్వామి. అతడిది సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం తాళ్లసింగారం. తనకున్న రెండెకరాలతో పాటు మరో రెండెకరాలను కౌలుకు తీసుకొని మిరప సాగు చేశారు. వారానికి ఒకసారి మందులు పిచికారి చేయడంతో పంట ఏపుగా పెరిగింది. పూత దశకు చేరుకోవడంతో ఇటీవల తామర, నల్లపురుగు ఆశించింది. మరోవైపు మూడు రోజులుగా కురిసిన వర్షాలకు పంట మొత్తం కొట్టుకుపోయింది. చివరకు గొర్రెలకు మేతగా పంట ఉపయోగపడుతోందని, రూ.2 లక్షల పెట్టుబడి నీటిపాలైందని వీరస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని