logo

పురాల్లో బస్తీ దవాఖానాలు

పట్టణాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభా అవసరాలకు తగిన విధంగా వైద్య సౌకర్యాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ప్రారంభించాలని నిర్ణయించింది. పురపాలిక శాఖ పర్యవేక్షణలో వీటిని నిర్వహించనుంది. ఇప్పటికే

Published : 27 Jan 2022 03:50 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుకు ప్రతిపాదనలు
మిర్యాలగూడ, న్యూస్‌టుడే

మిర్యాలగూడ పాత వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఖాళీగా ఉన్న భవనం

పట్టణాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభా అవసరాలకు తగిన విధంగా వైద్య సౌకర్యాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ప్రారంభించాలని నిర్ణయించింది. పురపాలిక శాఖ పర్యవేక్షణలో వీటిని నిర్వహించనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానాలు ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పురపాలికల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల వివరాలు, ఇతర సౌకర్యాల గురించి సమాచారం పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించింది. దీంతో అధికారులు సూర్యాపేట జిల్లాలోని ఐదు పురపాలికలు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు, నల్గొండ జిల్లాలోని ఏడు పురపాలికల్లో అందుబాటులో పట్టణ వాసులకు అనుకూలంగా ఉండే భవనాల వివరాలు సేకరిస్తున్నారు.

ప్రజల సమస్యలు తీర్చడానికే..
పట్టణాల్లో ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తే అత్యవసర సమయాల్లో ప్రాంతీయ, కమ్యూనిటీ ఆసుపత్రులకు వెళ్తున్నారు. సాధారణ జ్వరం వంటి సమస్యలకు ప్రాంతీయ ఆసుపత్రికి రోజుకు 500 మంది వరకు వస్తుండగా సకాలంలో వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే సాధారణ జ్వరం వంటి సమస్యలకు సైతం రూ.వేలు ఖర్చుచేయాల్సి వస్తుంది. మరోవైపు ప్రైవేటు వైద్యులను ఆశ్రయించి ఫీజుల పేరిట రూ.వందలు వెచ్చించాల్సి వస్తుండగా నిరుపేదలు, రోజువారీ కార్మికులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లో ఉపాధి కోసం వచ్చిన వారు ఆరోగ్య పరమైన సమస్యలతో రూ.వేలు వెచ్చించలేక బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి.

గతంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి పురపాలికల్లో ఏర్పాటు చేశారు. ఇవి మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తరహాలోనే సేవలందిస్తున్నాయి. కరోనా తర్వాత మాత్రమే ఇక్కడ వ్యాక్సిన్‌లను ఇస్తుండగా సాధారణ సమయాల్లో అత్యవసర వైద్యం అందటం లేదు.

బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తే అన్ని సమయాల్లో వైద్యం అందితే నిరుపేదలు 24 గంటలు వైద్యసేవలు పొందే అవకాశం ఉండగా సాధారణ జ్వరాలకు సైతం రూ.వేలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు

మిర్యాలగూడ పురపాలికలో షాబూనగర్‌ పాత వ్యవసాయ మార్కెట్‌ యార్డు, సుందర్‌ నగర్‌ కమ్యూనిటీ భవనం, నందిపాడు పంచాయతీ కార్యాలయంతో పాటుగా ఈదులగూడెంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు.

సూర్యాపేట పురపాలికలో 3, చండూరు 1, నందికొండ 1 ఏర్పాటు చేయాలని ఇప్పటి వరకు ప్రతిపాదనలు పంపారు. మిగతా పురపాలికల్లో అధికారులు భవనాల ఎంపికలో నిమగ్నమయ్యారు.


పేదలకు ప్రాధాన్యం
- తిరునగరు భార్గవ, పుర అధ్యక్షుడు, మిర్యాలగూడ

నిరుపేదలు నివాసం ఉండే ప్రాంతాలకు ఎక్కువ శాతం ప్రాధాన్యం ఇస్తూ భవనాలు ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపాం. బస్తీ దవాఖానాల ఏర్పాటుతో పట్టణ పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించొచ్చు. కమ్యూనిటీ హాల్‌లు, ఇతర ప్రభుత్వ ఖాళీ భవనాలను ఎంపిక చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని