logo

బాస్కెట్‌బాల్‌ ఆడుతూ.. పతకాలు సాధిస్తూ

వారంతా మధ్య తరగతి పేదింటి బిడ్డలు.. కుటుంబ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో క్రీడలపై దృష్టి పెట్టారు. బాస్కెట్‌బాల్‌ క్రీడను ఎంచుకుని అందులో ప్రతిభ చూపుతున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోనే కాకుండా ఏకంగా జాతీయస్థాయికి ఎదిగారు. పాల్గొన్న ప్రతి పోటీల్లోనూ

Updated : 26 Jun 2022 04:52 IST

నల్గొండ క్రీడావిభాగం, నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే

బాస్కెట్‌బాల్‌ క్రీడలో జాతీయస్థాయిలో రాణిస్తున్న కళాశాల విద్యార్థులను అభినందిస్తున్న కళాశాల

మాజీ ప్రిన్సిపల్‌ చంద్రశేఖర్‌, పీడీ, అధ్యాపకులు (ఫైల్‌ ఫోటో)

వారంతా మధ్య తరగతి పేదింటి బిడ్డలు.. కుటుంబ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో క్రీడలపై దృష్టి పెట్టారు. బాస్కెట్‌బాల్‌ క్రీడను ఎంచుకుని అందులో ప్రతిభ చూపుతున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోనే కాకుండా ఏకంగా జాతీయస్థాయికి ఎదిగారు. పాల్గొన్న ప్రతి పోటీల్లోనూ పతకాల పంట పండిస్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయస్థాయిలో సత్తాచాటడానికి సన్నద్ధం అవుతున్నారు. కేవలం క్రీడల్లోనే ప్రతిభ చూపడం కాకుండా చదువులోనూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ శెభాష్‌ అనిపించుకుంటున్నారు నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన పలువురు క్రీడాకారులు.

అంతర్జాతీయస్థాయిలో గుర్తింపే లక్ష్యం: పవన్‌

నేను ప్రస్తుతం ఎన్జీ కళాశాలలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతున్నా. నాకు చిన్నప్పటి నుంచి బాస్కెట్‌బాల్‌ ఆటంటే ఎంతో ఇష్టం. ఎక్కడ పోటీలు జరిగినా వెళ్లి చూసేవాడిని. అలా ఆటపై పెరిగిన ఆసక్తితో 8వ తరగతి నుంచే శిక్షణ పొందడం ప్రారంభించా. స్కూల్‌స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నాను. నేను ఇప్పటి వరకు జాతీయస్థాయిలో అయిదు సార్లు, రాష్ట్రస్థాయిలో 5 సార్లు ఆడి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించా. నా అత్యుత్తమ ఆటకు పలుమార్లు ప్రశంసాపత్రాలు దక్కాయి. అంతర్జాతీయస్థాయిలో రాణించడమే లక్ష్యంతో కళాశాలలో నిత్యం సాధన చేస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే నా ధ్యేయం.

బాస్కెట్‌బాల్‌ ఆటంటే ప్రాణం -వాసిక్‌

ఎన్జీ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. ఇతర క్రీడల కన్నా బాస్కెట్‌ బాల్‌ ఆటంటే ప్రాణం. అమ్మనాన్నల ప్రోత్సాహంతో బాస్కెట్‌బాల్‌ శిక్షణ పొందాను. శిక్షకుల పర్యవేక్షణలో ఆటలో పరిణితి సాధించాను. నేను ఇప్పటి వరకు జాతీయస్థాయిలో ఒకసారి, రాష్ట్రస్థాయిలో అయిదు సార్లు ఆడి పలు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందుకున్నా. పలు మ్యాచ్‌ల్లో నా అత్యుత్తమ ఆటతో జట్టుకు విజయాలు అందించా. ప్రస్తుతం కళాశాలలో నిత్య సాధన కొనసాగిస్తున్నాను. అంతర్జాతీయస్థాయిలో ఆడి దేశానికి పేరు తేవడమే నాలక్ష్యం.

జిల్లాకు పేరు తేవాలని: యశ్వంత్‌కుమార్‌

నేను ప్రస్తుతం ఎన్జీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నా. బాస్కెట్‌ బాల్‌ ఆటపై ఉన్న ఆసక్తితో స్కూల్‌స్థాయి నుంచే శిక్షణ పొందాను. మొదట్లో స్కూల్‌స్థాయిలో ఆడి బహుమతులు సాధించాను. ఆ తర్వాత కళాశాల స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాను. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 5సార్లు ఆడి పలు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందుకున్నాను. పలు సందర్భాల్లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించి అందరిచే ప్రశంసలు పొందాను. జాతీయస్థాయిలో ఆడడమే లక్ష్యంగా నిరంతరం కళాశాలలో సాధన చేస్తున్నా. బాస్కెట్‌ బాల్‌ క్రీడలో ప్రతిభ చూపి జిల్లాకు పేరు తేవడమే నా లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని