logo

మునుగోడు.. ఉత్కంఠ వీడేది నేడు

మునుగోడు ఓటరు దేవుళ్లపై భారం వేసిన ఉప ఎన్నికల అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు నెల రోజులు శ్రమించారు. వారి కరుణాకటాక్షాల కోసం ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఓటును తమకు ప్రసాదించమని మొక్కుకున్నారు.

Updated : 06 Nov 2022 06:09 IST

గుబులుతో నాయకులు.. గుంభనంగా అనుచరులు
చౌటుప్పల్‌, నాంపల్లి- న్యూస్‌టుడే

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద ప్రత్యేక పోలీసుల భద్రత

మునుగోడు ఓటరు దేవుళ్లపై భారం వేసిన ఉప ఎన్నికల అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు నెల రోజులు శ్రమించారు. వారి కరుణాకటాక్షాల కోసం ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఓటును తమకు ప్రసాదించమని మొక్కుకున్నారు. ఓటరు దేవుళ్లు తమపై ఏ మేరకు కరుణ చూపారో నేడు తేలనుండడంతో తమ అనుచర గణాన్ని వెంటబెట్టుకుని నల్గొండకు బయలు దేరారు. మునుగోడు నియోజకవర్గంలోని ఓటరు దేవుళ్ల తీర్పు ఆదివారం వెలువడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నికలు ఫలితాలు ఆదివారం వెలువడనున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు నల్గొండకు మకాం మార్చారు. అనుచరులు మాత్రం గ్రామాల్లోనే ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. గతంలో ఏ ఎన్నిక జరిగినా ఫలితాలు రాక ముందే తమదంటే తమదే విజయమని సమాచార సాధనాల్లో ప్రకటనలు చేసే రాజకీయ పార్టీల నాయకులు ప్రస్తుతం అందుకు భిన్నంగా మౌనం వహిస్తుండటం గమనార్హం. ఉప ఎన్నికలో ఓటర్లు ఎవరిని ఆదరించారోననేది తేల్చుకోలేకపోతున్నారు. ఆదివారం వచ్చే ఫలితం నాయకులకు గుబులు రేపుతుండగా అనుచరులు మాత్రం ఏమీ మాట్లాడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఫలానా పార్టీ వాళ్లు ఓటర్లకు డబ్బులు పంచకుండా ఏక మొత్తంగా నాయకులే పంచుకున్నారని, ఆయా గ్రామాల్లో ఓట్లు తమ పార్టీకే వస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల నుంచి వచ్చిన వలస ఓటర్లకు ప్రధాన పార్టీల నాయకులు డబ్బులు ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శించారనే చర్చలు గ్రామాల్లో వినిపిస్తున్నాయి. సామాజికవర్గాల వారీగా ఓటింగ్‌ బేరీజు వేసుకుంటూ విజయం వరిస్తుందా.. లేదా అనే అనుమానంతో ప్రధాన పార్టీల నాయకులు గుబులు పడుతున్నారు. ప్రధాన పార్టీల వీరాభిమానులైతే తమ అభ్యర్థి గెలిస్తే ఇష్టదైవాన్ని దర్శించుకొని శిరోముండనం చేయించుకుంటామని మొక్కుకుంటున్నారు. ఓటమి చవిచూడాల్సి వస్తే ఆ బాధను మరిచిపోయేందుకు ఏదైనా విహార యాత్రకు వెళ్లాలనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నెల రోజులుగా ఉప పోరులో శ్రమించిన నాయకులు, కార్యకర్తల ఆతృతకు ఆదివారంతో తెరపడనుంది.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ కంప్యూటరీకరణ కోసం ఏర్పాట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని