logo

అసంపూర్తిగా కొనుగోళ్లు.. అవస్థల్లో అన్నదాతలు

ఓ వైపు వానాకాలం పంటల సాగు ప్రారంభం కానుండటంతో రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరో వైపు నేటికీ యాసంగిలో పండించిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో అన్నదాతలు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

Published : 08 Jun 2023 03:24 IST

చివ్వెంల కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం (పాత చిత్రం)

సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఓ వైపు వానాకాలం పంటల సాగు ప్రారంభం కానుండటంతో రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరో వైపు నేటికీ యాసంగిలో పండించిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో అన్నదాతలు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లావ్యాప్తంగా 296 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన 111 కేంద్రాల్లో 103 చోట్ల కొనుగోళ్లు పూర్తి కావడంతో మూసివేశారు. ఐకేపీ కేంద్రాలు 186కు 176 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి కాగా.. పది కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. మే నెలలో వేగంగా జరిగినా కొనుగోళ్లు ఆ తరువాత మందగించాయి. అధికారులు సైతం ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

అడుగడుగునా ఇక్కట్లు.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్‌లో ప్రారంభించి మే చివరి వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, జిల్లాలో చివ్వెంల, మోతె, నూతనకల్‌, ఆత్మకూర్‌(ఎస్‌), తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం మండలాల్లోని 18 కేంద్రాల్లో ఇంకా కొనుగోళ్లు చేపడుతున్నారు. లారీల కొరత, నిర్వాహకుల నిర్లక్ష్యం వెరసి ఆయా కేంద్రాల్లో కర్షకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు అమ్మిన ధాన్యానికి డబ్బులు రాక కొందరు.. మరో వైపు వడ్లు అమ్ముడుపోక మరికొందరు అన్నదాతలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. తొలుత అకాల వర్షాలు వేధించగా.. ప్రస్తుతం లారీల కొరత అన్నదాతలను కంటి మీద కునుకు లేకుండా చేశాయి. లారీలు సకాలంలో రాక ధాన్యం కాంటా పూర్తయినా రోజుల తరబడి కేంద్రాల్లోనే నిల్వ చేయాల్సి వస్తోంది. కాంటా వేసిన వడ్లను అష్టకష్టాలు పడి మిల్లులకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉందంటూ బస్తాకు రెండు కిలోల చొప్పున మిల్లర్లు కోత విధిస్తున్నారు. ఇన్నాళ్లు నిరీక్షించిన రైతులపై మిల్లర్ల కోతలు అదనపు భారంగా మారాయి. అధికారులు స్పందించి కొనుగోళ్లు వెంటనే పూర్తయ్యేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.

వెంటనే పూర్తి చేస్తాం: శ్రీధర్‌, డీసీవో, సూర్యాపేట

కొనుగోళ్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. త్వరలో మిగతా కేంద్రాల్లోనూ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం.

మొత్తం కేంద్రాలు: 296
ఇప్పటి వరకు మూసివేసినవి: 279
కొనసాగుతున్నవి: 18
కొనుగోలు చేసిన ధాన్యం: 3.51 లక్షల మెట్రిక్‌ టన్నులు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని