logo

9 స్థానాల్లో.. 12 సార్లు ఉప ఎన్నికలు..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ అనివార్య పరిస్థితుల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు తప్పలేదు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. 9 నియోజకవర్గాలు ఉప ఎన్నికలకు వేదికలయ్యాయి. భువనగిరి, హుజూర్‌నగర్‌, మునుగోడు నియోజకవర్గాల్లోనైతే రెండు పర్యాయాలు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.

Published : 11 Nov 2023 03:16 IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ అనివార్య పరిస్థితుల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు తప్పలేదు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. 9 నియోజకవర్గాలు ఉప ఎన్నికలకు వేదికలయ్యాయి. భువనగిరి, హుజూర్‌నగర్‌, మునుగోడు నియోజకవర్గాల్లోనైతే రెండు పర్యాయాలు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. మిగతా చోట్ల ఒక్కొక్కసారి ఉప ఎన్నికలు జరిగాయి. కొందరు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి పోటీ చేయడం, కొందరు ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ పడటం, ఎమ్మెల్యే పదవిలో ఉండగా మరణించడం, కొందరు పార్టీలు మారి పదవికి రాజీనామా చేయడం వంటి పరిణామాలతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలకు ఆస్కారమేర్పడింది.  

మేళ్లచెరువు, న్యూస్‌టుడే

హుజూర్‌నగర్‌

1952లో హుజూర్‌నగర్‌ ద్విసభ్య అసెంబ్లీ నియోజకవర్గం. ఎం.జయసూర్య (పీడీఎఫ్‌) మెదక్‌ పార్లమెంటు, హుజూర్‌నగర్‌ ఒక అసెంబ్లీ స్థానానికి ఒకేసారి పోటీ చేసి రెండూ గెలిచారు. మెదక్‌ ఎంపీగా వెళ్లారు. హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక జరిగింది. మొగ్దుం మొహినొద్దీన్‌ విజయం సాధించారు.

  • 2018లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌), శానంపూడి సైదిరెడ్డి (తెరాస)పై గెలుపొందారు. ఆ తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఉత్తమ్‌ గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2019 ఉప ఎన్నికల్లో ఉత్తమ్‌ సతీమణి పద్మావతి (కాంగ్రెస్‌)పై సైదిరెడ్డి (తెరాస) విజయం సాధించారు.

ఆలేరు

2004 సాధారణ ఎన్నికల్లో నగేష్‌ (తెరాస) గెలిచారు. పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాలతో తెలంగాణ వాదం బలం కోసం పార్టీ ఎమ్మెల్యేలందరిలాగా నగేష్‌ రాజీనామా చేశారు. 2008లో ఉప ఎన్నిక జరిగింది. మళ్లీ నగేష్‌ గెలుపొందారు.

రామన్నపేట

1972 సాధారణ ఎన్నికల్లో వడ్డేపల్లి కాశీరాం (కాంగ్రెస్‌) గెలిచారు. ఆయన అకాలమరణంతో 1974లో ఉప ఎన్నిక జరిగింది. పెరిక రాజరత్నం (కాంగ్రెస్‌) విజయం సాధించారు. 2004 వరకు మాత్రమే ఈ నియోజకవర్గం ఉంది.

భువనగిరి

1952లో రావి నారాయణరెడ్డి (పీడీఎఫ్‌) అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసి రెండు స్థానాల్లోనూ గెలిచారు. ఎంపీగా వెళ్లడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. గోక రామలింగం (కాంగ్రెస్‌) విజయం సాధించారు.

  • 1999 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎలిమినేటి మాధవరెడ్డి (తెదేపా) 2000 సంవత్సరంలో నక్సల్స్‌ మందుపాతర పేలుళ్లలో మరణించారు. అదే సంవత్సరం ఆగస్టులో ఉప ఎన్నిక జరగ్గా.. మాధవరెడ్డి సతీమణి ఉమామాధవరెడ్డి విజయం సాధించారు.

నాగార్జున సాగర్‌

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నోముల నర్సింహయ్య (తెరాస) విజయం సాధించారు. కొన్నాళ్ల తర్వాత అనారోగ్యంతో మరణించారు. 2021 ఉప ఎన్నికలో ఆయన తనయుడు భగత్‌ (తెరాస) విజయం సాధించారు.

మునుగోడు (చిన్నకొండూరు)

  • 1965 చిన్నకొండూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.
  • 2018 మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీలో కలహాలతో భాజపాలో చేరిక, ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో 2022లో ఉప ఎన్నిక జరిగింది. రాజగోపాల్‌రెడ్డిపై కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (తెరాస) గెలుపొందారు.

మిర్యాలగూడ (పెద్ద మునిగల్‌)

1952లోనే పెద్ద మునిగల్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. కేవీ రామారావు (కాంగ్రెస్‌) విజయం సాధించారు.

దేవరకొండ

1999లో ధీరావత్‌ రాగ్యానాయక్‌ (కాంగ్రెస్‌), నేనావత్‌ పశ్యానాయక్‌ (తెదేపా)పై గెలుపొందారు. 2001 డిసెంబరు 29వ తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దిమడుగు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం వద్ద నక్సల్స్‌ కాల్పుల్లో చనిపోవడంతో 2002 మేలో ఉప ఎన్నిక నిర్వహించారు. రాగ్యానాయక్‌ సతీమణి భారతీ రాగ్యానాయక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నల్గొండ

1985లో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. మరో మూడు ప్రాంతాల్లో విజయం సాధించడంతో నల్గొండ స్థానానికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో గడ్డం రుద్రమదేవి (తెదేపా) విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని