logo

వచ్చేస్తున్నాం..అధ్యక్షా..!

ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా.. వివిధ కారణాలతో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలుపొంది.. శాసనసభలో అడుగు పెట్టనున్నారు పలువురు అభ్యర్థులు.

Updated : 04 Dec 2023 06:36 IST

తొలి ఎన్నికల్లోనే.. ఘన విజయం
మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే

ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా.. వివిధ కారణాలతో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలుపొంది.. శాసనసభలో అడుగు పెట్టనున్నారు పలువురు అభ్యర్థులు. ప్రధాన పార్టీల నుంచి(భారాస మినహా) పలువురు అభ్యర్థులు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ కేవలం కాంగ్రెస్‌ నుంచి పోటీలో నిలిచిన అభ్యర్థులు మాత్రమే విజయబావుట ఎగురవేశారు. తొలిసారి బరిలో నిలిచి గెలుపొందిన అభ్యర్థులపై ప్రత్యేక కథనం..


వ్యక్తిగత ఇమేజ్‌తో గెలుపు..

మిర్యాలగూడ నుంచి తొలిసారిగా కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి.. భారీ మెజార్టీతో భారాస అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావుపై ఘన విజయం సాధించారు. తాను చేపట్టిన సేవా కార్యక్రమాలతో సాధించిన వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు ఆయన సామాజికవర్గం ఓట్లు, మైనార్టీలు, బలంగా ఉన్న కాంగ్రెస్‌ సంప్రదాయ ఓట్లతో నియోజకవర్గ చరిత్రలోనే తొలిసారిగా 1,16,402 ఓట్లు సాధించడంతో పాటు 50,281 ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.


విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో..

ఆలేరులో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి 49,204 ఓట్ల మెజార్టీతో తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతపై ఘన విజయం సాధించారు బీర్ల అయిలయ్య. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్న ఆయన సర్పంచిగా, ఎంపీటీసీ సభ్యుడిగా, సైదాపూర్‌ పాల సంఘం ఛైర్మన్‌తో పాటు పలు పదవులు నిర్వహించారు. ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన బీసీ కోటాలో టికెట్‌ దక్కించుకొని అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. బీర్ల ఫౌండేషన్‌ పేరుతో గత కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు సైతం ఆయన గెలుపునకు బాటలు వేశాయి.


తండ్రి వారసత్వంతో..

రాజకీయ కురవృద్ధుడు కుందూరు జానారెడ్డి వారసుడిగా నాగార్జునసాగర్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున తొలిసారి బరిలో నిలిచిన జైవీర్‌రెడ్డి 55,849 ఓట్లతో.. తాజా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌పై ఘన విజయం సాధించారు. 41ఏళ్లకే ఎమ్మెల్యే అయి ఉమ్మడి జిల్లాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. విదేశాల్లో చదువుకుని వచ్చిన ఆయన తండ్రి అడుగుజాడల్లో నడిచేందుకు గత కొంత కాలంగా నియోజకవర్గంలోనే మకాం వేశారు. తనదైన శైలిలో ప్రతి గ్రామం తిరుగుతూ యువతలో మంచి ఫాలోయింగ్‌ పెంచుకున్నారు. తన తండ్రికి సాధ్యం కాని మెజార్టీని సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు.


భారాస నుంచి వచ్చి..

ఉద్యమ కాలం నుంచి తెరాసలో పని చేసిన మందుల సామేల్‌.. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. తుంగతుర్తి నుంచి భారాస టికెట్‌ ఆశించిన ఆయన అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటికే తుంగతుర్తిలో టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న అద్దంకి దయాకర్‌, మోత్కుపల్లి నర్సింహులును కాదని టికెట్‌ దక్కించుకున్నారు. అద్దంకి దయాకర్‌ సైతం అండగా నిలవడంతో ప్రస్తుత ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై 51,094 ఓట్ల భారీ మెజార్టీతో తొలిసారిగా ఘన విజయం సాధించారు.


ఉమ్మడి జిల్లా నుంచి మళ్లీ ఒక్కరే..

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే

ఉమ్మడి జిల్లాలో మహిళా శాసనసభ్యులు అంతంత మాత్రంగానే ఎన్నికవుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో ఏకైక మహిళా ఎమ్మెల్యేగా ఉన్న గొంగిడి సునీత ప్రస్తుత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఆమె స్థానాన్ని కోదాడ నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన నలమాద పద్మావతి పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించి.. మళ్లీ ఏకైక మహిళా ఎమ్మెల్యేగా నిలిచారు.


సత్తా చాటిన పద్మావతి..

గత ఎన్నికల్లో కోదాడ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన పద్మావతి.. కేవలం 700 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లోనూ సైదిరెడ్డిపై ఓటమి చెందిన ఆమె.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తీవ్రంగా కృషి చేశారు. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో 67,104 ఓట్ల రికార్డు స్థాయి భారీ మెజార్టీతో ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌పై ఘన విజయం సాధించి సత్తా చాటారు.


హ్యాట్రిక్‌ ఆశలు గల్లంతు..

ఆలేరు నుంచి వరుసగా 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన గొంగిడి సునీత హ్యాట్రిక్‌ ఆశలకు గండి పడింది. నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి కేసీఆర్‌ ఖాతాలో పడడంతో ఆమెకు ఎన్నికల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బీర్ల అయిలయ్య చేతిలో 49,204 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.


మిగిలిన వారి ప్రభావం నామమాత్రమే..

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన మహిళా అభ్యర్థినులు ఓట్లు రాబట్టడంలో అంతగా ప్రభావం చూపలేకపోయారు. నాగార్జునసాగర్‌ నుంచి భాజపా తరఫున బరిలో నిలిచిన కంకణాల నివేదిత 6,491 ఓట్లు సాధించి గతం కంటే మెరుగయ్యారు. భాజపా నుంచి హుజూర్‌నగర్‌లో పోటీ పడిన చల్లా శ్రీలత కేవలం 3,715 ఓట్లు సాధించగా.. ఇదే నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున బరిలో నిలిచిన మల్లు లక్ష్మి కేవలం 1,914 ఓట్లు మాత్రమే సాధించారు. ఇక నకిరేకల్‌ నుంచి బీఎస్పీ తరఫున బరిలో నిలిచిన మేడి ప్రియదర్శిని 2,600 ఓట్లు సాధించారు.


రేవంత్‌ను కలిసిన విజేతలు

గుర్రంపోడు, న్యూస్‌టుడే: ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆదివారం రాత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. కుందూరు జైవీర్‌ (నాగార్జునసాగర్‌) కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి(భువనగిరి), మందుల సామేలు(తుంగతుర్తి) రేవంత్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా భారీ మెజారిటీ సాధించిన వీరికి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.


వెళుతున్నా.. వెళుతున్నా

ఉమ్మడి జిల్లాలో ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పలువురు ఓటమి పాలయ్యారు. ఓటమి ఖాయమని తేలగానే అభ్యర్థులు లెక్కింపు కేంద్రం నుంచి వెనుదిరిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని