logo

గెలిస్తే ఐదేళ్లకు సరిపడా ప్రగతి ప్రణాళికలు

‘ మాది ప్రజలకు సేవ చేసే కుటుంబం. 30 ఏళ్ల క్రితం జానారెడ్డి హయాంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మారుమూల ప్రాంతాలకు రహదారుల నిర్మాణం జరిగింది. ఇప్పుడు గెలిపిస్తే రానున్న ఎన్నికల్లో నేను చేసిన పనులు చేప్పే ఓట్లడుగుతాను.

Published : 08 May 2024 03:58 IST

‘ఈనాడు’తో నల్గొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి

ఈనాడు, నల్గొండ : ‘ మాది ప్రజలకు సేవ చేసే కుటుంబం. 30 ఏళ్ల క్రితం జానారెడ్డి హయాంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మారుమూల ప్రాంతాలకు రహదారుల నిర్మాణం జరిగింది. ఇప్పుడు గెలిపిస్తే రానున్న ఎన్నికల్లో నేను చేసిన పనులు చేప్పే ఓట్లడుగుతాను. నల్గొండ లోక్‌సభ అభివృద్ధికి మా వద్ద ఐదేళ్లకు సరిపడా ప్రగతి ప్రణాళికలు ఉన్నాయి. ఈ దఫా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నల్గొండలో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయ’మని నల్గొండ లోక్‌సభ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాకు కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి, మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి సహకారం, గత 30 ఏళ్లలో జానారెడ్డి ఈ ప్రాంతానికి చేసిన పనులని చూసే తాము ఓటేయాలని ఓటర్లను కోరుతున్నామన్నారు. పలు అంశాలపై ఆయన ‘ఈనాడు’తో ముఖాముఖీ మాట్లాడారు.

ప్రమాదాల నివారణకు కృషి..

జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులతో మాట్లాడుతాను. పలు చోట్ల సర్వీసు రహదారులు లేకపోవడం వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ ప్రాంతాలు పర్యటించినప్పుడు గుర్తించాను. ఈ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాను. మరోవైపు రైల్వే సమస్యలు సైతం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో చాలా ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపాదించిన నడికుడి - బీబీనగర్‌ డబ్లింగ్‌ పనులను త్వరితగతిన పూర్తయ్యేందుకు నిత్యం పర్యవేక్షిస్తా. ప్రజా సమస్యల పరిష్కారానికి దిల్లీకి, నల్గొండకు మధ్య వారధిగా ఉంటాను. నల్గొండ - మల్లేపల్లి రహదారితో పాటూ పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను. వాటన్నింటినీ నాలుగు వరుసలుగా చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాను.

నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు

కొత్త జిల్లాల్లో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు కృషి చేస్తాను. ఇప్పుడు చలకుర్తిలో ఉన్న నవోదయ జానారెడ్డి హయాంలో వచ్చిందే. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక కేంద్రీయ విద్యాలయం ఉండేలా చర్యలు తీసుకుంటాను. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రంలో ఒత్తిడి తీసుకువస్తాను. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజాసమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేలా కృషి చేస్తాను.

చేసిన పనులు చెప్పే ఓట్లడుగుతాను

నన్ను గెలిపిస్తే ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను చెప్పే రానున్న ఎన్నికల్లో ఓట్లడుగుతాను. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉంది. కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. లోక్‌సభ నియోజకవర్గంలో ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు మంత్రులున్నారు. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ ఎన్నికల్లో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ నల్గొండ నుంచే వస్తుందని ఆశిస్తున్నాను.

ఒక్కో సెగ్మెంట్‌లో ఒక్కో రంగం అభివృద్ధి..

లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లను ఒక్కో రంగంలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎక్కడ ఏ రంగం అభివృద్ధికి అవకాశాలున్నాయో ఆ పరిశ్రమలు వచ్చేలా చేసి.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఉదాహరణకు మిర్యాలగూడలో ఆహారశుద్ధి పరిశ్రమలు, నల్గొండలో ఐటీ సేవలు, దేవరకొండలో స్వయం ఉపాధి, హుజూర్‌నగర్‌, కోదాడల్లో సిమెంటు, క్వారీ తదితర పరిశ్రమలను స్థాపించి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తాను. పెండింగ్‌లో ఉన్న డిండి ఎత్తిపోతలతో పాటూ పలు సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేలా ఒత్తిడి తెస్తాను. మిర్యాలగూడలో పలు పరిశ్రమల స్థాపనకు అవకాశమున్నా గత పదేళ్లలో పట్టించుకోలేదు. నల్గొండకు ధీటుగా మిర్యాలగూడలో పరిశ్రమలు, స్వయం ఉపాధి రంగాల్లో ప్రభుత్వం ద్వారా పలు సంస్కరణలు చేపడుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు