logo

నాడు-నేడు మారని తీరు!

ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మనబడి ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Published : 06 Dec 2022 01:27 IST

నెలాఖరుతో పూర్తికానున్న గడువు
ఇప్పటికి జరిగిన పనులు 25 శాతం లోపే..
శిథిలావస్థ భవనాల్లో చిన్నారుల చదువులు
న్యూస్‌టుడే, నెల్లూరు (విద్య)

ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మనబడి ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే రెండో విడతలో 1,357 పాఠశాలల అభివృద్ధికి రూ.453.91 కోట్లు కేటాయించింది. నెలాఖరుకు పనులు పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పటికి జరిగింది 25 శాతంలోపు కావడం గమనార్హం.

‘నాడు-నేడు’ రెండో విడత పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు జరిగే పాఠశాలల్లో ప్రత్యామ్నాయంగా తరగతులు నిర్వహించే ఏర్పాట్లు చేయకపోవడంతో శిథిల భవనాలు, వరండాలు, చెట్ల నీడలోనే చిన్నారులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పనుల్లో జాప్యం నెలకొందని విద్యాశాఖాధికారులు చెబుతుండగా.. రాష్ట్ర కార్యాలయం నుంచి రావాల్సిన వస్తువులు, నిధులు రాలేదని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. నిర్మాణాలు నెమ్మదిగా సాగుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి పూర్తి చేయాల్సిన అధికారులు.. పనులను ఆలస్యంగా మొదలు పెట్టారు. ఫలితంగా పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఇసుక, ఇటుకలు, నిర్మాణ సామగ్రి విద్యార్థులకు అడ్డంగా మారింది. వీటి కారణంగా పిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

రెండో విడతలో ఎంపికైన పాఠశాలలు1357
మరుగుదొడ్ల నిర్మాణాలు : 1080 పాఠశాలల్లో
మంజూరైన నిధులురూ.453.91కోట్లు
అదనపు తరగతి గదులు 552 పాఠశాలల్లో 2001 గదులు


నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు

జిల్లాలో జరుగుతున్న రెండో విడత ‘నాడు- నేడు’ పనుల వేగవంతానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పనులు త్వరితగతిన పూర్తిచేయిస్తాం.

సీహెచ్‌ ఉషారాణి, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ


ఎన్నాళ్లకో పూర్తి?

 

నగరంలోని మూలాపేట మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో (రామయ్య బడి) ఆరు నుంచి పదో తరగతి వరకు 195 మంది విద్యార్థులు ఉన్నారు. దీనిలో విలీనమైన పాఠశాల 3, 4, 5 తరగతి విద్యార్థులు మరో 150 మంది చేరారు. గదుల కొరత కారణంగా పాఠశాలకు ఏడు అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. ఒక్కో నిర్మాణానికి రూ.13 లక్షలు చొప్పున రూ.91 లక్షలు వచ్చాయి. మొదట రూ.16 లక్షలు ఆ పాఠశాల సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాలో పడ్డాయి. అయినా నేటికీ పునాది దశలోనే ఉన్నాయి. మరో గత్యంతరం లేక పాఠశాలలోని శిథిలావస్థ భవనం, వరండాల్లో చిన్నారుల చదువులు సాగుతున్నాయి.


అలా సా..గుతూ..

నగరంలోని దర్గామిట్ట బాలికల ఉన్నత పాఠశాలలో రెండో విడత రూ.95.91 లక్షలతో 8 అదనపు తరగతి గదులు, ఫర్నీచర్‌, విద్యుత్తు, ఫ్యాన్లు, గ్రీన్‌బోర్డులు, తదితర తొమ్మిది రకాల పనులు చేపట్టాల్సి ఉంది. వీటికి  ఇప్పటి వరకు రూ.24 లక్షలు మంజూరైనా 30 శాతం నిర్మాణాలు జరగలేదు. జరిగిన పనులు కూడా  నాసిరకంగా జరుగుతున్నాయని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


ప్చ్‌.. ఈసారీ లేదు

నగరంలోని మూలాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 380 మంది విద్యార్థులు చదువుతున్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాల్లోని విద్యార్థులు 150 మంది ఇక్కడ విలీనమయ్యారు. గదుల్లేకపోవడంతో శిథిలావస్థ భవనాలు, రేకుల షెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు నాడు-నేడు మొదటి, రెండో విడతలో అదనపు తరగతి గదులు మంజూరు కాలేదు. భవనాల మరమ్మతులు, తాగునీరు, మరుగుదొడ్లకు రెండో విడతలో నిధులొచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని