logo

కమీషన్లకు రైతుల నోట్లో మట్టిగొడతారా..!

డేగపూడి- బండేపల్లి కాలువ పనులు ఎందుకు ఆపేశారో చెప్పాలని.. గుత్తేదారుల వద్ద నుంచి పది శాతం కమీషన్ల కోసం రైతుల నోట్లో మట్టిగొడతావా.

Published : 30 Jan 2023 01:48 IST

రైతులతో కలసి డేగపూడి-బండేపల్లి కాలువను పరిశీలిస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి

సైదాపురం, న్యూస్‌టుడే:  డేగపూడి- బండేపల్లి కాలువ పనులు ఎందుకు ఆపేశారో చెప్పాలని.. గుత్తేదారుల వద్ద నుంచి పది శాతం కమీషన్ల కోసం రైతుల నోట్లో మట్టిగొడతావా.. ఎన్నికల ప్రచారంలో తొమ్మిది నెలల్లో కాలువ పనులు పూర్తిచేస్తామని చెప్పి నాలుగేళ్లయినా ఎందుకు ప్రారంభించలేదో రైతులకు మంత్రి కాకాణి సమాధానం చెప్పాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు, రైతులతో ఆదివారం సోమిరెడ్డి కలిసి సైదాపురం మండలం కట్టుబడిపల్లి వద్ద నుంచి కాలినడకన బయల్దేరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమశిల జలాలు సంగం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనుబోలు మండలానికి రావడంలో అవాంతరాలు ఏర్పడి చివరాయకట్టు రైతులు ఏటా ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు.  అనేక అవాంతరాలను అధిగమించి అప్పటి సీఎం చంద్రబాబును  ఒప్పించి సోమశిల, కండలేరు ఆయకట్టును కలుపుతూ ప్రత్యేక ఉత్తర్వులు తీసుకొచ్చామన్నారు. డేగపూడి-బండేపల్లి లింక్‌ కాలువ నిర్మాణం, భూసేకరణకు 2018లో రూ.42 కోట్లు మంజూరు చేశామని, ఎకరాకు రూ.7 లక్షలు చెల్లించి రెండు గ్రామాలు మినహా అప్పుడే పూర్తిచేశామని వివరించారు. 11 శాతం లెస్‌తో వైకాపా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ  పనులను దక్కించుకుందన్నారు.  తెదేపా ప్రభుత్వ హయాంలోనే 9.5 కిలోమీటర్లకు గాను 4 కిలోమీటర్ల మేర కాలువ తవ్వారని వివరించారు. రూ.2.30కోట్ల విలువైన పనులు పూర్తయిన అనంతరం వైకాపా ప్రభుత్వంలో గుత్తేదారుడు బిల్లులు పెట్టుకున్నాడని, ఇంజనీరింగ్‌ అధికారుల ఒత్తిడితో ఎమ్మెల్యే కాకాణిని వారు కలవగా తనకు 10 శాతం కప్పం కట్టాల్సిందేనని చెప్పినట్లు ఆరోపించారు. ఆయనతోపాటు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని