logo

ఆదిలోనే తిరకాసు

నెల్లూరులో దేవస్థానానికి చెందిన సుమారు తొమ్మిది ఎకరాల వాణిజ్య స్థలాలను 11 ఏళ్లకు లీజుకు కేటాయించేందుకు బహిరంగ వేలం పాటలు ప్రారంభించారు.

Published : 25 Mar 2023 05:34 IST

నెల్లూరు(సాంస్కృతికం), న్యూస్‌టుడే

టెండర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తున్న దేవస్థానం ఈవో వెంకటేశ్వర్లు, ఆర్‌జేసీ సాగర్‌బాబు, ధర్మకర్తలు తదితరులు

నెల్లూరులో దేవస్థానానికి చెందిన సుమారు తొమ్మిది ఎకరాల వాణిజ్య స్థలాలను 11 ఏళ్లకు లీజుకు కేటాయించేందుకు బహిరంగ వేలం పాటలు ప్రారంభించారు. నిర్ణయించిన మేరకు ధరావతు, ఈఎండీ మొత్తాలను చెల్లించిన వారిని పాల్గొనేందుకు అనుమతించాల్సి ఉండగా- దేవాదాయశాఖ తిరుపతి రీజియన్‌ (7 జిల్లాల పరిధి) జాయింట్‌ కమిషనర్‌ సాగర్‌బాబు సమక్షంలో జరిగిన ప్రక్రియలో ఆ మొత్తాలను చెల్లించకుండానే ప్రథమ ధరావతు చెల్లించిన వారిని అనుమతించారు. దానిపై ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు రంగాచారి వెంకటేష్‌ అభ్యంతరం వ్యక్తం చేయగా.. అప్పటికప్పుడు చెల్లిస్తారని బ్యాంకు అధికారులను పిలిపించారు. వారు నగదు చెల్లించేందుకు సిద్ధంగా లేకపోవడంతో పాటలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. టెండర్ల ప్రక్రియ నిర్వహణ ద్వారా ఆదాయం సమకూరకపోగా.. రూ. లక్ష ఖర్చు చేయడం విశేషం.

ఏటా రూ. కోటి నష్టం

బహిరంగ వేలం పాటల్లో పాల్గొనేందుకు ప్రతి బిట్‌కు వేర్వేరుగా ధరావతు, ఈఎండీలను చెల్లించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. హక్కు పొందిన వెంటనే ఏడాది కాలానికి చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని 24 గంటల్లో చెల్లించాలి. 30 రోజుల్లో స్థలం మార్కెట్‌ విలువలో 10 శాతం నగదు కానీ, 25 శాతం బ్యాంకు గ్యారెంటీగా దేవస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. వేలానికి మూడు బిట్లు ప్రకటించినా.. ఒక్కోటి మూడు ఎకరాలకుపైగా ఉండటంతో రెండుగా చేసి నాలుగింటికి నిర్వహించారు. నిబంధనల మేరకు భూములకు ప్రభుత్వం నిర్ణయించిన రూ. 30 కోట్ల మార్కెట్‌ విలువ మేరకు నాలుగు బిట్లకు ధరావతుగా ధరావతుగా రూ.4 లక్షలు, ఈఎండీగా మరో రూ.83 లక్షలు, సెక్యూరిటీ ధరావతుగా రూ. 3కోట్లు చెల్లించాలి. పెద్దమొత్తంలో నగదు చెల్లించి.. లీజు హక్కులు పొందే సంస్థలు, వ్యాపారులు.. టెండర్లలో పాల్గొనేలా దేవాదాయశాఖ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. వేలం నిర్వహించి.. దేవస్థానం భూములను లీజుకు కేటాయిస్తే.. తక్షణం సుమారు రూ.అయిదు కోట్లు డిపాజిట్‌ రూపంలో నగదు సమకూరే అవకాశం ఉంది. దానిపై లీజుదారులకు వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్కో స్థలానికి నెలకు రూ.లక్ష లీజుకు కేటాయించినా.. నాలుగింటికి ఏడాదికి రూ.48 లక్షల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. సెక్యూరిటీ డిపాజిట్‌పై వడ్డీతో పాటు లీజు రూపంలో ఆదాయం కలిపి ఏటా రూ. కోటి వరకు వచ్చే అవకాశం ఉన్నా.. లోపాయికారీ వ్యవహారంతో నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు నెలకొన్నాయి. ఈఎండీలు సైతం చెల్లించని వారిని వేలానికి అనుమతించి.. అయిన వారికి దేవస్థానం భూములు కట్టబెట్టాలనే ప్రయత్నం చివరికి బెడిసికొట్టిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

* ఈవో డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. త్వరలోనే టెండర్లు తిరిగి నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలనే ఈ రోజు రద్దుచేశామని.. బ్రహ్మోత్సవాల కారణంగా దీనిపై సరైన దృష్టి పెట్టకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.  

ప్రక్రియ ప్రారంభమిలా...

ఈ నెల 10వ తేదీ పత్రికా ప్రకటనలో దేవస్థానానికి చెందిన మూడు ఖాళీ స్థలాలను 11 ఏళ్ల లీజుకు కేటాయించేందుకు ఈ-టెండర్‌, సీల్డ్‌ టెండర్లను, 24 బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మూడు ప్రక్రియల్లో అధిక మొత్తంలో చెల్లించేందుకు ముందుకొచ్చిన వారికి లీజు హక్కులు కేటాయించాల్సి ఉంది. ప్రకటనలో పేర్కొన్న విధంగా.. 15 రోజుల గడువు ఇచ్చి, ఆన్‌లైన్‌లో వివరాలను ఆలస్యంగా పొందుపరిచారు. దేవస్థానంలో సీల్డ్‌ టెండర్లు దాఖలు చేసే వారికి అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచలేకపోయారు. ఈ విషయాన్ని మార్చి 15న ‘రంగనాథా ఇదేమీ చోద్యం’ శీర్షికన ఇచ్చిన కథనం ద్వారా ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. 24వ తేదీన బహిరంగ వేలం పాటలు నిర్వహించే సమయానికి ఈ-టెండర్లు, సీల్డ్‌ టెండర్లను ఎవరూ దాఖలు చేయలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు