logo

ఫోర్జరీ, ఛీటింగ్‌ కేసులో ఇద్దరికి ఏడాది జైలు

బ్యాంకును మోసగించి ఫిర్యాది ఖాతాలోని నగదు బదిలీ చేశారని నేరం రుజువు కావడంతో ముత్తుకూరు మండలం నేలటూరుకు చెందిన యనాటి శ్రీనివాసులురెడ్డి, ప్రస్తుత విశ్రాంత ఏజీఎం

Published : 30 Mar 2023 03:46 IST

నెల్లూరు (లీగల్‌): బ్యాంకును మోసగించి ఫిర్యాది ఖాతాలోని నగదు బదిలీ చేశారని నేరం రుజువు కావడంతో ముత్తుకూరు మండలం నేలటూరుకు చెందిన యనాటి శ్రీనివాసులురెడ్డి, ప్రస్తుత విశ్రాంత ఏజీఎం, అప్పటి మేనేజరు ఎస్‌.వి.సుబ్బారావుకు ఏడాది జైలుశిక్షతో పాటు రూ.3.80 లక్షల పరిహారం ఇద్దరు కలిసి ఫిర్యాదికి చెల్లించాలని అయిదో అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ జి.దేవిక బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు నెల్లూరు రంగనాయకులపేటకు చెందిన యానాటి శ్రీధర్‌ నెల్లూరు ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్‌ ఇంజినీరు కార్యాలయంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేసేవారు. ఆయనకు శ్రీనివాస అగ్రహారం వద్దనున్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 2006 నుంచి ఖాతా ఉంది. 13-3-2010న తన ఖాతాలో రూ.1.35,500 మిస్సయినట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని అప్పటి మేనేజరు ఎస్‌.వి.సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించిన ఆయన అదే బ్యాంకులో ఖాతా ఉన్న యానాటి శ్రీనివాసులరెడ్డి ఖాతాకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. అందుకు ఫిర్యాది సంతకంతో తప్పుడు లేఖను సృష్టించగా.. దాని ద్వారా మేనేజరు ఎస్‌.వి.సుబ్బారెడ్డి 5-10-2008న నగదు బదిలీ చేసినట్లు ధ్రువీకరించారు. అయితే ఆ లేఖ తాను ఇవ్వలేదని, దీనిపై విచారణ చేయాలని బ్యాంకు అధికారులు, అంబుడ్స్‌మెన్‌ను బాధితుడు కోరారు. 29-9-2012న బాధితుడి ఫిర్యాదుపై బాలాజీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించి దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైమేరకు తీర్పు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని