logo

అధికారం.. అయిదేళ్ల విధ్వంసం!

కొండలను పిండి చేశారు. గుట్టలకు గుండు కొట్టారు. నదుల్లోని ఇసుకను తోడేశారు. అధికారమే అండగా.. గడిచిన అయిదేళ్లలో వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు సహజ వనరులను ఇష్టారీతిన దోచేశారు.

Updated : 06 Apr 2024 05:16 IST

ప్రకృతి వనరులను ఇష్టారీతిన దోపిడీ
ప్రశ్నించిన వారిపై దాడులు, కేసులు

ఈనాడు, నెల్లూరు: కొండలను పిండి చేశారు. గుట్టలకు గుండు కొట్టారు. నదుల్లోని ఇసుకను తోడేశారు. అధికారమే అండగా.. గడిచిన అయిదేళ్లలో వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు సహజ వనరులను ఇష్టారీతిన దోచేశారు. మట్టి, ఇసుక, గ్రావెల్‌, భూములు.. దేన్నీ వదలలేదు. రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతూ.. రూ. కోట్లు వెనకేసుకున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతూ.. ప్రజల హక్కులనూ నిర్వీర్యం చేశారు. ఈ దోపిడీల్లో జిల్లాస్థాయి నాయకులే కాదు.. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు భాగస్వాములే దీనికి బాధ్యులు జగనా? వారి పార్టీ నాయకులా అని జనం ప్రశ్నిస్తున్నారు.

అక్రమ లేఅవుట్‌లో..

అడ్డగోలుగా దోచుకునేందుకు అవకాశం ఉన్న దేన్నీ వైకాపా నాయకులు వదల్లేదు. నేరుగా ప్రజాప్రతినిధులే రంగంలోకి దిగి దోపిడీకి తెగబడ్డారు. లేఅవుట్‌ పేరుతో ప్రభుత్వ, ఇరిగేషన్‌ భూములను ఆక్రమించి అమ్మకాలు చేశారు. నెల్లూరు నగరానికి చెందిన ప్రజాప్రతినిధి.. అనుచరులతో అల్లీపురంలో లేఅవుట్‌ వేశారు. అందులో ఆరు ఎకరాల ఇరిగేషన్‌ స్థలం ఉందని అధికారులు గుర్తించినా.. ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. జేసీ విచారణ జరిపి నివేదిక ఇస్తే.. ఆ వివరాలు బయటకు రాకుండా సీఎంవో నుంచి జిల్లా అధికారులకు ఫోన్‌ చేయించినట్లు సమాచారం. కోవూరు నియోజకవర్గంలో మండల కార్యాలయం ఎదుట పది ఎకరాల్లో లేఅవుట్‌ వేస్తే అనుమతులు తీసుకోలేదు. బిట్రగుంట సమీపంలో కావలికి చెందిన ఓ ప్రజాప్రతినిధి భారీ లేఅవుట్‌ వేస్తే.. అందులో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటం గమనార్హం. ప్రస్తుతం కావలిలో ముఖ్యమంత్రి సభ నిర్వహించే లేఅవుట్‌ కూడా కాలువలు, ఇరిగేషన్‌ స్థలాలు ఆక్రమించి వేసింది కావడం గమనార్హం. ‘మేమంతా సిద్ధం’ సభకు వచ్చిన వాహనాలు నిలిపే లేఅవుట్‌ ముందు గతంలో అధికారులు అనధికార లేఅవుట్‌ అని బోర్డు పెడితే.. ఒక్క రోజులో పీకి పక్కనేయడం గమనార్హం.


గ్రావెల్‌ దందాకు గుంతలే సాక్ష్యం

కావలిలో ఇలా..

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రావెల్‌ వైకాపా నాయకుల ప్రధాన ఆదాయ వనరు అయింది. ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులు, తిప్పలు, కొండలు, ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఇష్టానుసారం తవ్వకాలు చేశారు. పరిమితికి మించి గుంతలు తవ్వి.. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టారు. ఆత్మకూరు, కావలి, కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో మరీ రెచ్చిపోయారు. కావలిలో రుద్రకోట చెరువుతో పాటు పక్కనే ఉన్న లాటరైట్‌ మైన్‌ను దోచేశారు. అధికార పార్టీ నాయకుల దెబ్బతో లీజుదారుడు పారిపోయారు. కోవూరులో సహజసిద్ధమైన కలిగిరి రిజర్వాయరును నాలుగేళ్లగా భారీ యంత్రాలతో నాశనం చేశారు. సంగం సమీపంలోని కొండలను పిండి చేశారు. సర్వేపల్లి రిజర్వాయరుతో పాటు కనుపూరు చెరువు, ఈదగాలి ప్రాంతాల్లో గ్రావెల్‌ దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా.. ముఖ్యమంత్రి నెల్లూరులో ఉన్నప్పుడూ ఈదగాలి ప్రాంతంలో పెద్దఎత్తున తవ్వకాలు చేయడం గమనార్హం.


పొర్లుకట్ట పనుల్లోనూ కక్కుర్తి

అధ్వానంగా పెన్నా పొర్లుకట్ట

పెన్నా డెల్టా పరిధిలో 10 ప్రధాన కాలువలు 194.4 కి.మీ. విస్తరించి ఉండగా- వీటి కింద దాదాపు 2.47 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లు వర్షాలు పడటంతో కాలువలు దెబ్బతిన్నాయి. దానికి మొదటి ఏడాది రూ.20 కోట్లు, రెండో ఏడాది రూ. 240 కోట్లు ఎఫ్‌డీఆర్‌ నిధులు మంజూరు చేయగా- వాటిని అధికార పార్టీ నాయకులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇష్టానుసారం పనులు చేయడంతో కట్టలు అధ్వానంగా తయారయ్యాయి. 2021 ముదివర్తిపాళెం దగ్గర కట్ట తెగి.. గ్రామాలు నీట మునిగిన సంఘటన జరిగినా.. పాలకులు ధనదాహంతో పట్టించుకోలేదు. 2022-23లో రూ.అయిదు కోట్లు(ఓఅండ్‌ఎం) కావాలని ఇరిగేషన్‌ అధికారులు ప్రతిపాదనలు పెట్టినా.. నిధులు మంజూరు చేయలేదు. దీంతో పాటు నాలుగేళ్లుగా పెన్నా డెల్టా ప్రాంతంలోని కాలువలకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది.


క్వార్ట్జ్‌లో.. వందల కోట్లు!

జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు క్వార్ట్జ్‌ దోపిడీకి తెగబడ్డారు. ఉమ్మడి జిల్లా గూడూరు డివిజన్‌లోని జోగిపల్లి, పెదమాలపాడు, తుమ్మల తలుపూరు, ఊటుకూరు, మర్లపూడి, తిప్పిరెడ్డిపల్లి, చాగనం తదితర 20 గ్రామాల పరిధిలో క్వార్ట్జ్‌ నిల్వలను కొల్లగొట్టారు. సైదాపురం పరిధిలోని గ్రామాల్లో కొండలు, ప్రభుత్వ భూములు, లీజు ముగిసిన మైకా గనుల్లో రూ. కోట్ల విలువైన ఖనిజాన్ని తరలించారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి కనుసన్నల్లో స్థానిక నేతలను రంగంలోకి దింపి.. ఇష్టానుసారం బ్లాస్టింగ్‌లు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవగా- బెదిరింపులకు పాల్పడటంతో పాటు కేసులు బనాయించడం పరిస్థితికి అద్దం పట్టింది. ఒక్క క్వార్ట్జ్‌ నుంచే జిల్లాలోని వైకాపా నాయకులు రూ. నాలుగు వేల కోట్లు స్వాహా చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటం గమనార్హం.


పెన్నమ్మ కన్నీరు

పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు (పాత చిత్రం)

జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన రీచ్‌లకు ఏడాదిన్నర కిందటే అనుమతులు ముగిసినా.. గుత్తేదారులు యథేచ్ఛగా తవ్వకాలు చేశారు. పడమటి కంభంపాడు, మినగల్లు, విరువూరు, ముదివర్తి, పల్లిపాడు రీచ్‌లను రాత్రి, పగలు తేడా లేకుండా కొల్లగొడుతూ.. నదీ స్వరూపాన్నే మార్చేశారు. సాధారణంగా నదిలో 8 మీటర్ల ఎత్తున ఇసుక ఉంటే.. ఆ ప్రాంతంలో గరిష్ఠంగా మూడు మీటర్లు తవ్వుకునేందుకే అనుమతిస్తారు. ఈసీ(పర్యావరణ అనుమతులు) కూడా 1.5 నుంచి 2 మీటర్లు తవ్వుకునేందుకు ఇస్తారు. జిల్లాలో అది ఎక్కడా పాటించలేదు. నదిలోకి నేరుగా వాహనాలు వెళ్లేందుకు పొర్లుకట్టలను సైతం ధ్వంసం చేశారు. పల్లిపాడు, మినగల్లు, పీకేపాడు రీచ్‌ల్లో స్థానికులు అడ్డుకుని.. భూగర్భ జలాలు అడుగంటుతాయని, రోడ్లు గుంతలమయమయ్యాయని ఆందోళన చేస్తే.. బాధితులపైనే కేసులు పెడతామని బెదిరించడం పరాకాష్ఠగా నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని