logo

అమ్మ ఒడి.. ఆవేదనా జడి

నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడికి జగన్‌ రకరకాల కొర్రీలు వేశారు. గెలవక ముందు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంత మందికి అమ్మఒడి అని చెప్పి.. గెలిచాక లేదు లేదు ఒక్కరికే అన్నారు.

Updated : 08 May 2024 07:35 IST

అయిదేళ్లలో.. ఇచ్చింది నాలుగు సార్లే..
లబ్ధిదారులను తగ్గించి మిగుల్చుకుంది రూ.135.68 కోట్లు
ఈనాడు, నెల్లూరు: విద్య, న్యూస్‌టుడే

నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడికి జగన్‌ రకరకాల కొర్రీలు వేశారు. గెలవక ముందు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంత మందికి అమ్మఒడి అని చెప్పి.. గెలిచాక లేదు లేదు ఒక్కరికే అన్నారు. మరుగుదొడ్లు, పాఠశాల నిర్వహణ అంటూ సాకులు చూపి ఇచ్చే రూ. 15వేలలో రూ. 2వేలు కోత విధించారు. అంతటితో ఆగకుండా కరెంట్‌ ఎక్కువగా వాడారని కొందరికీ, జీతం రూ. 10వేలు- రూ.12వేలు వస్తోందని ఇంకొందరికీ, విద్యార్థుల హాజరు తక్కువగా ఉందని మరికొందరికి డబ్బు ఇవ్వలేదు. మొత్తంగా అయిదేళ్లలో నాలుగుసార్లే అమ్మఒడి బటన్‌ నొక్కారు.. చివరకు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి.. మా ప్రభుత్వం పేదల పక్షపాతి అని డప్పులు కొడుతున్నారు.

పిల్లలను బడికి పంపితే.. వారిని చదివించే బాధ్యత తానే తీసుకుంటానని గొప్పలు చెప్పిన సీఎం జగన్‌.. అమ్మఒడి పథకం లబ్ధిదారులు, సాయం అందజేతలో పెట్టని కోత లేదు. 2021లో 2,43,497 మందికి అమ్మఒడి నిధులు జమ చేయగా.. 2022లో ఆ సంఖ్యను 2,00,366కు తగ్గించారు. 75 శాతం హాజరు పేరుతో గత ఏడాది జూన్‌లో 1,94,842 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. 2020-21లో తల్లుల ఖాతాల్లో రూ.365.24 కోట్లు జమ చేయగా.. గత ఏడాది జూన్‌లో రూ. 292.26 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ లెక్కన రెండేళ్లలో రూ. 135.68 కోట్లు మిగుల్చుకున్నారు. గత ఏడాది సాయం రూ. 13వేలను కొంత మందికి రెండు, మూడు విడతలుగా వేశారు. అందులోనూ కొందరికి ఒకసారి రూ. 9వేలు వేయగా.. మరికొందరికి రూ. అయిదు వేలే వేశారు. 2022 జూన్‌లో బటన్‌ నొక్కిన తర్వాత.. 15 రోజుల వరకు చాలా మందికి డబ్బు పడుతూనే ఉన్నాయి.

పొరుగు సేవలంటూ.. పొగబెట్టారు

పొరుగు సేవల ఉద్యోగులకు రూ.వేలల్లో వేతనం ఇచ్చినట్లే ఇస్తూ.. జగన్‌ వారికి పొగబెట్టారు. ప్రభుత్వ పథకాలు అందకుండా కొర్రీలు వేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో సుమారు 50వేల మంది పొరుగు సేవల ఉద్యోగులు ఉండగా- వీరి మేలు కోసం ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌(ఆప్కాస్‌) తెచ్చినట్లు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పారు. కానీ, ఇందులో చేరిన చాలా మందికి పథకాన్ని దూరం చేశారు. వీరి వేతనాలను సీఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానించడంతో.. వారి వివరాలన్నీ రాబడుతూ.. పథకాలకు కోత వేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీలోకి వచ్చినట్లేనని అధికారులు సమాధానం ఇవ్వడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలాగని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేవన్నీ పొరుగు సేవల వారికి ఇస్తున్నారా? అంటే అదీ లేదు. గ్రామీణంలో నెలకు రూ. 10వేలు, పట్టణాల్లో రూ.12వేల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లు చూపుతూ.. వారిని పథకాలను దూరం చేసి, నిధులు మిగుల్చుకుంటున్నారు.

ఉచిత విద్యకు...

విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు కల్పిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రైవేటు బడులకు ఫీజులను నిర్ణయించి, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే రీయింబర్స్‌మెంట్‌ చేయాలి. జగన్‌ సర్కారు మాత్రం అమ్మఒడి ఇస్తున్నందున.. వాటి నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం ఏకంగా విద్యాహక్కు చట్టానికి సవరణ చేసింది. ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలనే నిబంధన తొలగించింది. దీంతో ఈ కోటాలో చేరేవారికి ప్రభుత్వం ఇచ్చే మొత్తం.. విద్యా సంస్థల ఫీజులకూ సరిపోని పరిస్థితి ఏర్పడింది.


నిర్వహణ నగదు.. రూ. 104 కోట్లు ఏమయ్యాయి?

పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో ప్రభుత్వం అమ్మఒడి సాయంలో మినహాయించుకున్న సొమ్ము అక్షరాలా రూ. 104 కోట్లు. దీంతో బడుల్లో  నిర్వహణ చేపడుతుందా? అంటే అదీ లేదు. మరి ఆ డబ్బంతా ఏమైందనే దానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు. అంటే.. ఆ నగదును ప్రభుత్వమే వాడేసుకుంటోంది.


ఒకసారి మాత్రమే వచ్చింది
- మమత, సోమశిల గ్రామం

మా పాప అయిదో తరగతి చదువుతోంది. నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే అమ్మఒడి వచ్చింది. ఏమని అడిగితే.. సచివాలయ సిబ్బంది ఇల్లు, కరెంటు బిల్లు అధికంగా నమోదైందని తెలిపారు. మా పేరు మీద ఎలాంటి స్థిరాస్తులు లేవు. ఆ మేరకు ధ్రువీకరణ పత్రాలు అధికారులకు అందించినా మూడేళ్లపాటు అమ్మఒడి ఇవ్వలేదు. అవగాహన లేని సచివాలయ సిబ్బందితో మేము ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి విసిగి పోయాం. చివరికి గత ఏడాది ఖాతాలో జమ అయింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు