logo

నెల్లూరు పార్లమెంట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

‘ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమైంది. అయిదేళ్ల వైకాపా రాక్షస పాలనకు మరికొన్ని రోజుల్లో ముగింపు పడనుంది. మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్‌కల్యాణ్‌ చతురతతో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేద్దాం. పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కంకణబద్ధులవుతాం.

Published : 09 May 2024 05:52 IST

‘ఈనాడు’తో నెల్లూరు కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
ఈనాడు, నెల్లూరు

‘ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమైంది. అయిదేళ్ల వైకాపా రాక్షస పాలనకు మరికొన్ని రోజుల్లో ముగింపు పడనుంది. మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్‌కల్యాణ్‌ చతురతతో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేద్దాం. పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కంకణబద్ధులవుతాం. కూటమి సూపర్‌-6, మోదీ సంకల్ప్‌ పత్ర్‌లతో రాష్ట్రాన్ని పురోగామిపథంలో నడుపుతామ’ని నెల్లూరు పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సామాజిక భద్రత పింఛను రూ. 4వేలు ఇస్తామని, జులైలో ఏప్రిల్‌ నుంచి మొత్తం రూ. ఏడువేలు లబ్ధిదారులకు అందిస్తామన్నారు. బుధవారం ‘ఈనాడు’ ముఖాముఖిలో వేమిరెడ్డి మాట్లాడుతూ.. రానున్న అయిదేళ్లలో జిల్లాను అభివృద్ధి చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధికి రూపొందించిన కార్యాచరణను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఏటా జాబ్‌ క్యాలెండర్‌

జిల్లాలో చదువుకున్న యువతలో 40 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వైకాపా ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ అంటూ యువతను మోసం చేసింది.  ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఈ విషయం నా దృష్టికి వచ్చింది. బీటెక్‌, ఎంటెక్‌, బీఈడీ, డిగ్రీ చేసిన వారు ఉపాధి కూలీలుగా వెళుతున్నారు. ఈ పరిస్థితిని మారుస్తాం. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని తెదేపా లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. తెదేపా అధికారం చేపట్టిన రోజే మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలిసంతకం పెట్టనున్నారు. కేంద్రం కూడా యువశక్తి కార్యక్రమం ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తోంది. జిల్లాలోనూ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకుని.. వీలైనన్ని ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం.

పొదుపు మహిళలకు రూ. పది లక్షల వడ్డీలేని రుణం

తెదేపా ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. సూపర్‌-6లో వారికి సంబంధించినవే ఎక్కువ. పొదుపు రుణాలపై రూ. పది లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నాం. ఈ నిర్ణయం ద్వారా జిల్లాలోని 4 లక్షల మంది పొదుపు మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఇంటింటికీ మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. దీనివల్ల జిల్లాలో 4.5 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తాం. ఈ పథకం ద్వారా సుమారు 4.8 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. వీటన్నిటితో పాటు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్‌ సదుపాయం కల్పిస్తాం. వారు ఆర్థికంగా రాణించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.

ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు

కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా ఉంటుంది. ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు అందిస్తాం. వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తుంది. వైకాపా ప్రభుత్వంలో ఒకటో తేదీ జీతాలు, పెన్షన్లు రావడమే కష్టంగా ఉన్న విషయం తెలిసిందే. దానిపై అడిగితే కేసులు పెట్టారు. పనులు చేయించుకునేందుకు కొందరిని బెదిరించారు. చివరకు విశ్రాంత ఉద్యోగులనూ పట్టించుకోలేదు. మేము జీతభత్యాలు సకాలంలో అందించడంతో పాటు అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా పాలన సాగిస్తాం.

ఆక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్తు

జిల్లాలో ఇందుకూరుపేట, విడవలూరు, ముత్తుకూరు, టీపీగూడూరు, వెంకటాచలం, అల్లూరు, బిట్రగుంట, కావలి, ఉలవపాడు మండలాల్లో ఆక్వా సాగు ఎక్కువ. వైకాపా ప్రభుత్వం నిబంధనల పేరుతో పలు కొర్రీలు పెట్టడంతో.. చాలా ప్రాంతాల్లో సాగు చేయడమే మానేశారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇష్టానుసారం బిల్లులు వేస్తున్నారు. వీటన్నింటి నుంచి ఆక్వా రంగాన్ని కాపాడుతాం. జోన్లతో సంబంధం లేకుండా రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్తు సరఫరా చేస్తాం.

ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను

ఎస్సీ ఎస్టీ బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తాం. వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన అన్ని పథకాలను పునరుద్ధరిస్తాం. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. ఆర్థికంగా చేయూత ఇస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరువ చేస్తా. రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌, సంక్రాంతి కానుకలు ఇస్తాం.

సామాజిక భద్రతా పింఛను రూ. 4వేలు

వైకాపా ప్రభుత్వంలో ఏటా సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. పలు ఆంక్షలు పెట్టి.. పేదలకు అవి అందకుండా చేశారు. కూటమి ప్రభుత్వంలో అర్హులందరికీ ఆంక్షలు లేని సంక్షేమ పథకాలు అందిస్తాం. సామాజిక భద్రత పింఛను రూ. 4వేలకు పెంచడంతో పాటు.. ఏప్రిల్‌ నుంచి దాన్ని అమలు చేసి.. జులైలో అరియర్స్‌తో రూ. 7వేలు ఇంటికే అందిస్తాం. జిల్లాలో 3.16 లక్షల మందికి రూ. 221 కోట్లు ఒక్క జులై నెలలో ఇవ్వబోతున్నాం. లక్ష మంది పేదలకు ఇళ్లు కట్టిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం ఇస్తాం.

నెల్లూరులో ఐటీ హబ్‌లు

ఇఫ్కో భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు, కావలి నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాల ప్రభుత్వ భూముల్లో సెజ్‌లు ఏర్పాటుకు కృషి చేస్తాం. ఆ దిశగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చేలా ప్రోత్సహిస్తాం. నెల్లూరులో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తాం. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తీసుకొస్తాం.

పెట్టుబడి సాయం రూ. 20వేలు

రైతులకు తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్తుతో పాటు పెట్టుబడి సాయంగా రూ. 20వేలు అందిస్తాం. వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన ఇన్‌పుట్‌ రాయితీ, ఎరువుల రాయితీలు అమలు చేస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రైతు కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి.. సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు

ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచి.. నెల్లూరు పార్లమెంట్‌ను రాష్ట్రానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతా. కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని.. ప్రజలకు అందుబాటులో ఉంటా. సువిశాల సముద్ర తీరాన్ని పర్యాటకంగా అభివృధ్ధి చేస్తాం. పేదల భూములను కాజేసేందుకు తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు